షిప్‌యార్డు డైరెక్టర్‌గా జస్విందర్‌సింగ్
ABN , Publish Date - May 03 , 2026 | 12:33 AM
హిందుస్థాన్ షిప్‌యార్డు డైరెక్టర్ (స్ట్రాటజిక్ ప్రాజెక్ట్)గా కమొడోర్ జస్విందర్ సింగ్ (ఇండియన్ నేవీ రిటైర్డ్) శనివారం బాధ్యతలు స్వీకరించారు.
మల్కాపురం, మే 2 (ఆంధ్రజ్యోతి):
హిందుస్థాన్ షిప్‌యార్డు డైరెక్టర్ (స్ట్రాటజిక్ ప్రాజెక్ట్)గా కమొడోర్ జస్విందర్ సింగ్ (ఇండియన్ నేవీ రిటైర్డ్) శనివారం బాధ్యతలు స్వీకరించారు. మెకానికల్, మెరైన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేసిన మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. అనంతరం భారత నౌకాదళంలో అనేక కీలకమైన కార్యాచరణ, సాంకేతిక పదవుల్లో పనిచేశారు. ఆన్‌బోర్డు షిప్‌లు, సబ్‌మెరైన్‌లు, ట్రై-సర్వీస్ ఇన్‌స్టాలేషన్, వ్యూహాత్మక నౌకల నిర్మాణానికి సహకరించారు. షిప్‌యార్డులో జస్విందిర్‌సింగ్ జలాంతర్గామి ప్రాజెక్టుల పర్యవేక్షణ సహా పలు బాధ్యతలు నిర్వర్తిస్తారు.
టెన్త్ ఫలితాలపై సమీక్ష
పాఠశాలల వారీగా ఉత్తీర్ణత శాతంపై విద్యా శాఖ దృష్టి
సబ్జెక్టు, సెక్షన్‌ల వారీగా వివరాల సేకరణ
తక్కువ ఫలితాలు వచ్చినచోట బాధ్యుల నుంచి వివరణ తీసుకోవాలని నిర్ణయం
విశాఖపట్నం, మే 2 (ఆంధ్రజ్యోతి):
పదో తరగతి ఫలితాలపై పాఠశాలల వారీగా సమీక్షకు జిల్లా విద్యా శాఖ సిద్ధమవుతోంది. జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ, జీవీఎంసీ, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలు 98 వరకూ ఉన్నాయి. రెండు రోజుల క్రితం వెలువడిన ఫలితాల్లో రెండు, మూడుపాఠశాలలు తప్ప మిగిలిన వాటిల్లో ఉత్తీర్ణత శాతం జిల్లా సగటు (89.51 శాతం) కంటే తక్కువగా ఉంది.
జిల్లాలోని ఎక్కువ పాఠశాలలు 50 నుంచి 80 శాతం మధ్య ఉత్తీర్ణత సాధించాయి. నడుపూరు, కణితి, అగనంపూడి, గోపాలపట్నం తదితర ఉన్నత పాఠశాలలు 70 శాతానికి మించి, చంద్రంపాలెం, ఎండాడ, తోటగరువు తదితర జడ్పీ పాఠశాలలు, జీవీఎంసీలో మరికొన్ని ఉన్నత పాఠశాలలు అంతకంటే తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులు ఉన్న చంద్రంపాలెం పాఠశాలలో 66 శాతం మంది పాసయ్యారు. ఈ పాఠశాలపై ఇటీవల పలు వివాదాలు వచ్చిన నేపథ్యంలో ఉత్తీర్ణత తగ్గడంపై విద్యా శాఖ అసంతృప్తిగా ఉంది. ఇంకా తోటగరువు, ఎండాడ పాఠశాలల్లో ఫలితాలు తగ్గడానికి గల కారణాలు ఆరా తీస్తోంది. కాగా, సబ్జెక్టుల వారీగా చూస్తే ప్రథమ భాష (ఫస్ట్ లాంగ్వేజ్)లోనే ఎక్కువ మంది తప్పారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సబ్జెక్టుల వారీగా ఉత్తీర్ణత, ఫెయిలైన విద్యార్థుల వివరాలతోపాటు అందుకు గల కారణాలు పంపాలని ప్రధానోపాధ్యాయులను డీఈవో ప్రేమకుమార్ ఆదేశించారు. పాఠశాలల నుంచి వివరాలు వచ్చిన తరువాత విశ్లేషణ చేసి పాఠశాలల పనితీరుపై ఒక అంచనాకు రానున్నారు. జిల్లాలో సబ్జెక్టు టీచర్లకు కొరత లేదు. కానీ తెలుగు పరీక్ష 1,899 మంది తప్పడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తుండడంతో విద్యా శాఖ ఆత్మ పరిశీలనలో పడింది. ఈ నేపథ్యంలో తక్కువ ఉత్తీర్ణ సాధించిన పాఠశాలల హెచ్‌ఎంలు, ఎక్కువ మంది పరీక్ష తప్పిన సబ్జెక్టు టీచర్ల నుంచి వివరణ తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయం డీఈవో ప్రేమకుమార్ వద్ద ప్రస్తావించగా పాఠశాలల వారీగా వివరాలు తీసుకుంటున్నామని, అన్నీ అందిన తరువాత పరిశీలించి, వివరణ తీసుకుంటామని పేర్కొన్నారు.
నేడే నీట్
ఉమ్మడి జిల్లాలో 8,000 మంది విద్యార్థులు
విశాఖపట్నం, మే 2 (ఆంధ్రజ్యోతి):
వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నీట్-2026 జరగనున్నది. ఈ పరీక్షకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి సుమారు ఎనిమిది వేల మంది హాజరవుతున్నారు. వారి కోసం నగరంలో 18 కేంద్రాలు ఏర్పాటుచేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరగనున్నది. విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తరువాత అనుమతించరు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని అధికారులు సూచించారు.
ఉక్కు ఉద్యోగులకు ఈ నెలలోనూ ఉత్పత్తి ఆధారిత వేతనాలే
ఉక్కుటౌన్‌షిప్, మే 2 (ఆంధ్రజ్యోతి):
స్టీల్‌ప్లాంటు ఉద్యోగులకు ఈ నెల (ఏప్రిల్‌కు సంబంధించి) కూడా యాజమన్యాం ఉత్పత్తి ఆధారిత వేతనాలనే చెల్లించింది. గత ఏడాది నవంబరు నుంచి ఇదే విధానం అమలుచేస్తోంది. ఈ నెలలో కోక్-ఓవెన్, బ్లాస్ట్ ఫర్నేస్, రోలింగ్ మిల్స్ విభాగాల ఉద్యోగులకు 95 శాతం, సింటర్‌ప్లాంటు, ఎస్‌ఎంఎస్ ఉద్యోగులకు 94 శాతం, మార్కెటింగ్ ఉద్యోగులకు 85, ఇతరులకు 93 శాతం చొప్పున వేతనాలు ఇచ్చారు.