మోడల్ ప్రాజెక్టుగా జర్రకొండ పంచాయతీ ఎంపిక
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:35 AM
గిరిజన గ్రామాల్లో ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఢిల్లీలోని భారత వైద్య పరిశోధన మండలి ఆధ్వర్యంలో హుకుంపేట మండలం జర్రకొండ పంచాయతీని మోడల్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డి.కృష్ణమూర్తి నాయక్ తెలిపారు.
ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం
పాడేరురూరల్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): గిరిజన గ్రామాల్లో ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఢిల్లీలోని భారత వైద్య పరిశోధన మండలి ఆధ్వర్యంలో హుకుంపేట మండలం జర్రకొండ పంచాయతీని మోడల్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డి.కృష్ణమూర్తి నాయక్ తెలిపారు. ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ కుసుమ సోమవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో డి.కృష్ణమూర్తి నాయక్‌ను కలిసి ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ముందుగా పంచాయతీలోని ప్రతీ ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు నమోదు చేస్తారన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా గర్భిణి, బాలింత, చిన్నారులు, వృద్ధులకు 105 రకాల మందులు, 14 రకాల రక్త, ఇతర పరీక్షలు అందుబాటులోకి తెస్తారన్నారు. వారం రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. జర్రకొండ పంచాయతీలో ఈ పైలట్ ప్రోగ్రాం తీరును పరిశీలించిన అనంతరం సంతృప్తిగా ఉంటే జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు విస్తరింపజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశాలు, ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు భాగస్వాములై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఎంఆర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.