Share News

జన్‌మన్‌ పనులు వేగంగా జరగాలి

ABN , Publish Date - May 07 , 2026 | 12:12 AM

జిల్లాలో జరుగుతున్న పీఎం జన్‌మన్‌ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ ఆదేశించారు.

జన్‌మన్‌ పనులు వేగంగా జరగాలి
లంబసింగి బాలికల ఆశ్రమ పాఠశాలలో అధికారులతో మాట్లాడుతున్న పీవో ఆదిత్య వర్మ

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

అధికారులకు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశం

చింతపల్లి, మే 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరుగుతున్న పీఎం జన్‌మన్‌ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ ఆదేశించారు. బుధవారం మండలంలోని లంబసింగి, తాజంగి పంచాయతీల్లో ఆయన పర్యటించారు. పీఎం జన్‌మన్‌ నిధులతో జరుగుతున్న ప్రభుత్వ పాఠశాల భవనాల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. లంబసింగి ఉన్నత పాఠశాలలో పీఎం జన్‌మన్‌ పనులకు తలెత్తిన భూ సమస్యపై గ్రామస్థులతో ఆయన సమావేశమయ్యారు. భూ సమస్యపై పూర్తి నివేదికను రెండు రోజుల్లో సమర్పించాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ ప్రభుత్వం పీఎం జన్‌మన్‌ పథకం ద్వారా రహదారులు, ప్రభుత్వ పాఠశాల భవనాల నిర్మాణాలకు భారీగా నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ పనులను సంబంధిత కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయాలన్నారు. నిర్మాణాల్లో కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఇంజనీరింగ్‌ అధికారులు పర్యవేక్షించాలని, నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆశ్రమ పాఠశాలల్లో అదనపు భవనాలు అందుబాటులోకి వస్తే విద్యార్థులకు వసతి సమస్య తీరుతుందన్నారు. అనంతరం లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలు, వార్డులను స్వయంగా పరిశీలించారు. ఆస్పత్రిలో ప్రసవాలు తక్కువగా జరుగుతుండడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు వైద్యులు అందుబాటులో ఉండాలని, ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు. వైద్య సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న ఎపిడమిక్‌ సీజన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. ఎంపిక చేసిన గిరిజన గ్రామాల్లో దోమల మందు మొదటి విడత పిచికారీ సమర్థవంతంగా జరిగిలే పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్‌ ఏవీ స్వామినాయుడు, తహశీల్దార్‌ కె. శంకరరావు, టీడబ్ల్యూ డీఈఈ రఘునాథరావునాయడు, ఏఈఈ యాదకిశోర్‌, ఎంఈవో పీబీవీవీ ప్రసాద్‌, కూటమి నాయకులు కిముడు లక్ష్మియ్య, పడాల్‌, మాజీ ఎంపీటీసీ సభ్యుడు దేపూరి గిరిబాబు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2026 | 12:12 AM