పార్టీ బలోపేతానికి జనసేన కార్యాచరణ
ABN , Publish Date - Jun 25 , 2026 | 01:20 AM
జనసేన పార్టీ బలోపేతానికి అధినాయకత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్న వారికి తగిన గుర్తింపు, నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇటువంటి వారిని పార్లమెంటు నియోజకవర్గాల వారీగా గుర్తించడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేసింది.
నిర్మాణ సారధుల గుర్తింపునకు
ప్రత్యేక కమిటీలు
ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి
సీనియర్ నాయకుల నియామకం
విశాఖకు కొణతాల రామకృష్ణ
అమలాపురానికి పంచకర్ల
శ్రీకాకుళానికి వంశీకృష్ణ శ్రీనివాస్
అరకులోకు ఎమ్మెల్సీ కె.నాగబాబు
విశాఖపట్నం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి):
జనసేన పార్టీ బలోపేతానికి అధినాయకత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్న వారికి తగిన గుర్తింపు, నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇటువంటి వారిని పార్లమెంటు నియోజకవర్గాల వారీగా గుర్తించడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేసింది. ఈ కమిటీలకు సీనియర్ నాయకులు బాధ్యత వహిస్తారు. ఆ కమిటీలో పార్టీ పట్ల నిబద్ధత, స్థానిక సమస్యలపై లోతైన అవగాహన కలిగిన ముగ్గురు సీనియర్ నాయకులు ఉంటారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొంటున్న ముగ్గురు సాధక్‌లను కూడా చేర్చుకుంటారు. ఇలా పార్లమెంటు పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం ముగ్గురు సాధక్‌లను నియమిస్తారు. ఇలా మొత్తం 28 మంది నాయకులు, సాధక్‌లతో ‘జనసేన పార్టీ నిర్మాణ సారథుల నమాచార సేకరణ కమిటీ’ ఏర్పాటుచేశారు. ఈ కమిటీ పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించి, ఆ సమాచారాన్ని కేంద్ర కార్యాలయానికి చేరుస్తుంది. అక్కడ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ స్వయంగా ఆ జాబితాలను పరిశీలించి, ఎవరికి బాధ్యతలు అప్పగించాలో నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియ సజావుగా సాగడానికి కేంద్ర కార్యాలయం కూడా తగిన సహకారం అందిస్తుంది. గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు నియోజకవర్గం వరకు వివిధ విభాగాల్లో పనిచేసేందుకు తగిన ఆసక్తి, ఆకళింపు సామర్థ్యం ఉన్నవారిని గుర్తించి బాధ్యతలు ఇస్తారు. పార్టీ కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు పార్టీ కార్యాలయం బుధవారం ప్రకటించింది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా వారిలో ముగ్గురికి మూడు పార్లమెంటరీ నియోజకజవర్గాల బాధ్యతలు అప్పగించింది. విశాఖపట్నం పార్లమెంటుకు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అమలాపురం పార్లమెంటుకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గానికి విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ను, అరకు పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్సీ నాగబాబును నియమించారు.
విశాఖ పార్లమెంటుకు...
విశాఖ పార్లమెంటు నియోజకవర్గానికి సీనియర్ నాయకులుగా జి.అప్పారావు (గాజువాక), బీవీ కృష్ణయ్య (భీమిలి); ఎ.శరణిదేవి (విశాఖపట్నం), సాఽధక్ ప్రతినిధులుగా జి.సోమశేఖర్ (గాజువాక), డి.శివ (భీమిలి), ఎం.నాగలక్ష్మి (విశాఖపట్నం), పరిశీలక కమిటీ సభ్యులుగా డీవీ జగన్నాథరావు, డి.ధర్మేంద్ర, సర్దార్ ఇంద్రజిత్, జి.అప్పారావు, కందుల నాగరాజు, ఎన్.దివాకర్, డి.రఘు, వై.కళ, పి.సాయిబాబా, బీఆర్ రమేశ్, ఆర్.గోవిందరావు, ఎం.విజయకుమార్, జి.రవికుమార్, ఎం.శ్రీను, పి.కోమలత, ఎం.నాగమణి, బీఆర్ రమేశ్, ఎల్.మురళీదేవి, ఎం.షాలిని, వైవీ లక్ష్మి, కె.అనిల్‌కుమార్, బి.రాజులను నియమించారు. వీరంతా కలిసి పార్టీ కోసం పనిచేస్తున్న నిజమైన కార్యకర్తల జాబితాలు తయారుచేస్తారు. ఆపై ఎంపిక చేసినవారికి పార్టీ నిర్మాణంలో బాధ్యతలు ఇస్తారు.