Share News

జానకిరామపురం పీఏసీఎస్‌ సీఈవో డిస్మిస్‌

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:49 AM

రోలుగుంట మండలం జానకిరామపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) సీఈవోగా పనిచేసిన బీవీవీవీఎస్‌ఆర్‌జీ రామకృష్ణను విధుల నుంచి తొలగిస్తూ సొసైటీ పర్సన్‌ ఇన్‌చార్జి ఉత్తర్వులు జారీ చేశారు. సహకార సంఘానికి చెందిన లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేసినట్టు నిర్ధారణ కావడంతో ఆయనపై వేటు వేశారు.

జానకిరామపురం పీఏసీఎస్‌ సీఈవో డిస్మిస్‌
జానకిరామపురం పీఏసీఎస్‌ కార్యాలయం (ఫైల్‌ ఫొటో)

నిధుల అక్రమాలకు పాల్పడినందుకు చర్యలు

నర్సీపట్నం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): రోలుగుంట మండలం జానకిరామపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) సీఈవోగా పనిచేసిన బీవీవీవీఎస్‌ఆర్‌జీ రామకృష్ణను విధుల నుంచి తొలగిస్తూ సొసైటీ పర్సన్‌ ఇన్‌చార్జి ఉత్తర్వులు జారీ చేశారు. సహకార సంఘానికి చెందిన లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేసినట్టు నిర్ధారణ కావడంతో ఆయనపై వేటు వేశారు.

జానకిరామపురం పీఏసీఎస్‌లో సీఈవోగా పని చేసిన రామకృష్ణ సొసైటీ డబ్బులు సొంత అవసరాలకు వాడుకొన్నట్టు ఆరోపణలు వచ్చాయి. పీఏసీఎస్‌లో జరిగిన అవకతవకలపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు రావడంతో సహకార శాఖ అధికారులు స్పందించారు. ఇతనిపై వచ్చిన ఐదు ఆరోపణలపై శాఖాపరమైన విచారణ చేశారు. బోర్డు అనుమతి తీసుకోకుండా సొసైటీ నిధులు రూ.16,35,492 సొంత అవసరాలకు వాడుకొన్నట్టు విచారణలో తేలింది. ఇంకా ఓచర్స్‌ లేకుండా రూ.24,500 వాడుకున్నారు. పంట రుణాలను సకాలంలో వసూలు చేయలేదు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో సుమారు ఏడాది క్రితం రామకృష్ణను సస్పెండ్‌ చేశారు. ఈ సమయానికి ఆయన వద్ద వున్న సొసైటీ నిధులు రూ.6 వేలను తర్వాత విధుల్లో చేరిన కార్యదర్శికి అప్పగించ లేదు. గత ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన నర్సీపట్నం డీసీసీసీ బ్రాంచ్‌లోకి పెట్రోల్‌ క్యాన్‌తో ప్రవేశించి, బ్రాంచ్‌ మేనేజర్‌, సిబ్బందిపై హత్యాయత్నానికి పాల్పడినట్టు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేయగా, 75 రోజులు రిమాండ్‌లో ఉన్నారు. ఈ సంఘటనపైనా సహకార అధికారులు విచారణ జరిపారు. దీంతో రామకృష్ణను ఉద్యోగం నుంచి తొలగిస్తూ పీఏసీఎస్‌ పర్సన్‌ఇన్‌చార్జి బలిజి మహరాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నర్సీపట్నం డీసీసీసీ బ్రాంచ్‌ ఘటనలో ఇతనికి సహకరించిన పీఏసీఎస్‌ గుమస్తా దేవుడుని కూడా విధుల నుంచి తొలగించారు.

Updated Date - Feb 19 , 2026 | 12:50 AM