జలగలగెడ్డ రహదారి పనులు చకచకా
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:22 AM
మండలంలోని లంబసింగి పంచాయతీ జలగలగెడ్డ గ్రామస్థుల కష్టాలు తీరనున్నాయి. రహదారి సౌకర్యం లేక అవస్థలు పడుతున్న గిరిజనులకు ఉపశమనం లభించనుంది.
అడ్డంకులు తొలగిపోవడంతో శరవేగంగా నిర్మాణం
తీరనున్న గిరిజనుల రవాణా కష్టాలు
చింతపల్లి, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లంబసింగి పంచాయతీ జలగలగెడ్డ గ్రామస్థుల కష్టాలు తీరనున్నాయి. రహదారి సౌకర్యం లేక అవస్థలు పడుతున్న గిరిజనులకు ఉపశమనం లభించనుంది. ఈ రహదారి నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో వారం రోజుల క్రితం పనులు ప్రారంభమ య్యాయి. ఇప్పుడు శరవేగంగా పనులు సాగుతున్నాయి.
లంబసింగికి అతి సమీపంలో ఉన్న జలగలగెడ్డ గ్రామంలో ఆదిమజాతి ఆదివాసీలు నివాసముంటున్నారు. సుమారు యాభై ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామానికి కాలిబాట మినహా కనీస రహదారి సదుపాయం లేదు. స్థానిక గిరిజనులు పొరుగు గ్రామాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. రోగులు, గర్భిణులను డోలీపై ఆస్పత్రులకు తరలించాల్సిన పరిస్థితి. గ్రామానికి అధికారులు, పాలకులు ఏనాడూ వచ్చిన సందర్భాలు లేవు. తమ గ్రామానికి రహదారి సదుపాయం కల్పించాలని కొన్నేళ్లుగా కోరుతున్నప్పటికీ ఫలితం దక్కలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు, పాలకుల చుట్టూ రహదారి కోసం కాళ్లు అరిగేలా తిరిగినప్పటికీ ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. వీరు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ‘ఎవరికీ పట్టని గ్రామమిది’ శీర్షికన గత ఏడాది ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావడంతో కూటమి ప్రభుత్వం లంబసింగి నుంచి జలగలగెడ్డ గ్రామానికి 670 మీటర్లు మేర తారు రోడ్డు నిర్మాణానికి రూ.90 లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను మంజూరు చేసింది. నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖకు అప్పగించడంతో వెనువెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసింది. అయితే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు లంబసింగి జంక్షన్ గిరిజనుల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ రహదారి నిర్మాణంలో తమ జిరాయితీ సాగు భూములు కోల్పోవాల్సి వస్తుందని లంబసింగి జంక్షన్ గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఏడాది కాలంగా ఈ రహదారి నిర్మాణ పనులు ప్రారంభంకాలేదు. కూటమి ప్రభుత్వం తమ గ్రామానికి తారు రోడ్డు నిర్మించేందుకు నిధులు విడుదల చేసినప్పటికీ పనులు ఎందుకు ప్రారంభించడంలేదని ప్రశ్నిస్తూ జలగలగెడ్డ గిరిజనులు పాడేరులో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ జోక్యం చేసుకుని రహదారి నిర్మాణాలకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న లంబసింగి జంక్షన్ గిరిజన మహిళలతో చర్చించారు. రహదారి నిర్మాణంలో నష్టపోతున్న భూములకు ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో రహదారి నిర్మాణాలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులు గత నెల 25న రహదారి నిర్మాణ పనులు ప్రారంభించారు. కేవలం ఆరు రోజుల్లోనే లంబసింగి నుంచి జలగలగెడ్డ వరకు ఎర్తువర్క్ పూర్తి చేశారు. ప్రస్తుతం గ్రామం వరకు వాహనాలు నిరాటంకంగా వెళుతున్నాయి. మరో పది రోజుల్లో మెటల్, వెట్‌మిక్స్ రోలింగ్ చేస్తామని, నెలాఖరు నాటికి తారు రోడ్డు నిర్మాణాలు పూర్తి చేస్తామని గిరిజన సంక్షేమశాఖ డీఈఈ జి.రఘునాథరావునాయుడు తెలిపారు. కాగా జలగలగెడ్డ గ్రామానికి రహదారి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండడంతో స్థానిక గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.