3న జలహారతి
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:21 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెప్టెంబరు 3వ తేదీన జిల్లాకు రానున్నారు. గోదావరి జలాలను పోలవరం ఎడమ కాలువకు విడుదల చేసి, పాయకరావుపేట వద్ద నిర్వహించే జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
పోలవరం ఎడమ కాలువ నుంచి జిల్లాకు నీరు
పాయకరావుపేట వద్ద కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు
కాలువ పనులను పరిశీలించిన మంత్రి అనిత
సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
అనకాపల్లి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెప్టెంబరు 3వ తేదీన జిల్లాకు రానున్నారు. గోదావరి జలాలను పోలవరం ఎడమ కాలువకు విడుదల చేసి, పాయకరావుపేట వద్ద నిర్వహించే జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలోని సీతారామపురం, పీఎల్ పురం, పాయకరావుపేట గ్రామాల పరిధిలో జరుగుతున్న పోలవరం ఎడమ కాలువ పనులను హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్, అధికారులు మంగళవారం పరిశీలించారు. కాగా సీఎం జిల్లా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు.
చంద్రబాబు అపర భగీరథుడు: మంత్రి అనిత
పాయకరావుపేట, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషిచేస్తున్న సీఎం చంద్రబాబు అపర భగీరఽథుడని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అభివర్ణించారు. ఆమె కలెక్టర్ విజయకృష్ణన్‌తో కలిసి మంగళవారం సాయంత్రం పాయకరావుపేట మండలం సీతారాంపురం, పీఎల్‌పురం, పాయకరావుపేటల వద్ద చివరి దశలో ఉన్న పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలించారు. సీఎం చంద్రబాబునాయుడు వచ్చే నెల 3వ తేదీన ఇక్కడ నిర్వహించే జలహారతి కార్యక్రమానికి చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులకు పలుసూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోలవరం ఎడమ కాలువ వల్ల ఉత్తరాంధ్ర రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు రైతులకు సాగునీటి భద్రత వుంటుందన్నారు. పోలవరం ఎడమ కాలువ నుంచి తాండవ, వరహా, శారదా నదుల్లోకి నీటి విడుదల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని, దీంతో ఆయా నదులపై వున్న గ్రోయిన్లు, ఆనకట్టల ద్వారా వేలాది ఎకరాలకు పుష్కలంగా నీరు సరఫరా అవుతుందని మంత్రి చెప్పారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్‌పటేల్,, పోలవరం ఎస్‌ఈ ఏసుబాబు, అడ్డరోడ్డు జంక్షన్ ఆర్డీఓ రామలక్ష్మి, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు
నక్కపల్లి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): పోలవరం ఎడమ ప్రధాన కాలువకు నీటి విడుదల సందర్భంగా వచ్చే నెల మూడో తేదీన పాయకరావుపేట వద్ద నిర్వహించే ‘జలహారతి’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారని, అందువల్ల సీఎం పర్యటనకు సంబంధించి పక్కాగా ఏర్పాటు చేయాలని హోం మంత్రి అనిత, జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇక్కడ తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ విజయకృష్ణన్, పోలవరం ఎడమ కాలువ అధికారులతో ఆమె సమావేశమయ్యారు.సీఎం పర్యటనకు సంబంధించి పలు సూచనలు చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా పాయకరావుపేట నియోజకవర్గంలో 35 వేల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. అంతకుముందు సీఎం పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై నియోజకవర్గానికి చెందిన కూటమి ముఖ్య నాయకులతో ఆమె చర్చించారు. పోలవరం ఎడమ కాలువకు నీటి విడుదల సందర్భంగా నిర్వహించే ‘జలహారతి’ కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబుకు ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయ కళలు ఉట్టిపడేలా ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.