స్తంభించిన జల్ జీవన్
ABN , Publish Date - Aug 27 , 2026 | 01:19 AM
ఇంటింటికీ కొళాయి ద్వారా ప్రజలకు సమృద్ధిగా తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్’ పనులు జిల్లాలో మందగించాయి. నిధుల కొరత, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో తీవ్రజాప్యం కారణంగా సుమారు నాలుగు నెలల నుంచి పనులు ఆగినట్టు సమాచారం. కొత్తగా చేపట్టాల్సిన పనులపై కాంటాక్టర్లు ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు.
జిల్లాలో నాలుగు నెలల నుంచి నిలిచిపోయిన పనులు
మొత్తం పనులు: 1,869
అంచనా వ్యయం: రూ.69.90 కోట్లు
ఇంతవరకు పూర్తయిన పనులు: 1,212
వ్యయం చేసిన నిధులు: రూ.30.37 కోట్లు
పెండింగ్ బిల్లులు: రూ.8.22 కోట్లు
మిగిలిన పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్ల నిరాసక్తత
పూర్తయిన పనుల్లో బయటపడుతున్న నాణ్యతాలోపాలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ఇంటింటికీ కొళాయి ద్వారా ప్రజలకు సమృద్ధిగా తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్’ పనులు జిల్లాలో మందగించాయి. నిధుల కొరత, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో తీవ్రజాప్యం కారణంగా సుమారు నాలుగు నెలల నుంచి పనులు ఆగినట్టు సమాచారం. కొత్తగా చేపట్టాల్సిన పనులపై కాంటాక్టర్లు ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు.
జల్ జీవన్ పథకం కింద 2024-25 సంవత్సరంలో అనకాపల్లి జిల్లాలో 1,869 పనులు చేపట్టాలని నిర్ణయించి, వాటి కోసం రూ.69.90 కోట్లతో అంచనాలు రూపొందించారు. పనులు మొదలుపెట్టాల్సిన సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు టెండర్లు పిలవలేదు. తరువాత కూటమి హయాంలో పనులు ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. మొత్తం మీద సుమారు రెండేళ్ల కాలంలో.. అంటే ఈ నెల 15వ తేదీ నాటికి 1,212 పనులు పూర్తికాగా వాటికి రూ.30.37 కోట్లు ఖర్చు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పథకం పనులకు సత్వరమే నిధులు విడుదల కావడం లేదు. ఇంతవరకు పూర్తి చేసిన పనులకు సంబంధించి ఇంకా రూ.8.22 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో వున్నాయి. మిగిలిన 657 పనులు కొనసాగుతున్నట్టు అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటి పురోగతి అంతంతమాత్రంగానే ఉంది. పూర్తిచేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు.
పనుల్లో నాణ్యతాలోపం
జిల్లాలో జరుగుతున్న జల్ జీవన్ పనులు నాసిరకంగా వుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాయకరావుపేట, ఎలమంచిలి, చోడవరం నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో జల్ జీవన్ మిషన్ పనులపై ఈ తరమా ఫిర్యాదులు అందాయి. అనకాపల్లి మండలం మాకవరంలో నీటి ట్యాంకు నిర్మాణ పనులు ఆరు నెలల క్రితం అర్ధంతరంగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఎటువంటి కదలిక లేదు. ఇదే మండలం గోపాలపురం, శంకరం, భట్లపూడి, రేబాక గ్రామాల్లో చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. నక్కపల్లి మండలం డొంకాడలో నీటి పథకం ప్రారంభానికి ముందే కూలిపోయింది. పాయకరావుపేట మండలం దుర్గానగర్, రాజీవ్‌నగర్ కాలనీల్లో నాసిరకం పైపులు వినయోగించడంతో లీకవుతున్నాయి. ఇదే మండలం ఎస్.నర్సాపురం, సత్యవరం శ్రీరాంపురం, పాల్తేరులో చేపట్టిన పనుల్లో నాణ్యత లేదని అంటున్నారు. ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో పైపులు లీకవుతున్నట్టు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. పూర్తయిన పనులను క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలించి, నాణ్యతాప్రమాణాల మేరకు పనులు జరిగాయని నిర్ధారించిన తరువాతే బిల్లులు మంజూరు చేయాలని పలు గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.