Share News

జోరుగా జల్‌ జీవన్‌

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:33 AM

జిల్లాలో జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా సురక్షిత తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) శాఖ అధికారులు పనులు ముమ్మరం చేస్తున్నారు. పెండింగ్‌ పనులను పూర్తి చేయడంతోపాటు, అన్ని గృహాలకు కొళాయి కనెక్షన్లు ఇస్తున్నారు.

జోరుగా జల్‌ జీవన్‌
అనకాపల్లి మండలం మాకవరంలో నిర్మాణంలో ఉన్న తాగునీటి ఓవర్‌ హెడ్‌ ట్యాంకు పనులు

కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుతో ఊపందుకున్న పనులు

మొత్తం 1,869 పనులకుగాను 1,233 పనులు పూర్తి

వివిధ దశల్లో మిగిలిన పనులు

వచ్చేఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా సురక్షిత తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) శాఖ అధికారులు పనులు ముమ్మరం చేస్తున్నారు. పెండింగ్‌ పనులను పూర్తి చేయడంతోపాటు, అన్ని గృహాలకు కొళాయి కనెక్షన్లు ఇస్తున్నారు.

జల్‌ జీవన్‌ మిషన్‌ కింద జిల్లాలో రూ.690 కోట్ల అంచనా వ్యయంతో 1,869 పనులను చేపట్టాలని అధికారులు గతంలో ప్రతిపాదించారు. గత నెల (ఆగస్టు నాటికి) చివరకు వీటిలో 1,233 పనులు పూర్తయ్యాయి. మరో 636 పనులు వివిధ దశల్లో వున్నాయి. ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 4.17 లక్షల కుటుంబాలు ఉండగా ప్రతి ఇంటికీ కొళాయి అమర్చాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు 3,08,976 ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఏర్పాటు చేశారు. ఇంకాకొళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. మిగిలిన 1,08,513 గృహాలకు కూడా కొళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు పనులు వేగంగా సాగుతున్నాయి.

బిల్లుల చెల్లింపులతో పనుల్లో కదలిక

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు నత్తనడకన సాగాయి. పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు సక్రమంగా చెల్లించలేదు. కూటమి అధికారంలోకి వచ్చేనాటికి రూ.38 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో వున్నాయి. కూటమి ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ పెండింగ్‌ పనులను పూర్తి చేయడంపై ద్రృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లులతోపాటు గత రెండేళ్ల కాలంలో చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు రూ.67 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో వుండడంతో ఇటీవల రూ.60 కోట్లమేర నిధులు విడుదల చేసింది. మరో రూ.7 కోట్ల బిల్లులు మాత్రమే పెండింగ్‌లో వున్నాయి. ఇవి కూడా కొద్ది రోజుల్లోనే క్లియర్‌ అవుతాయని అధికారులు చెబుతున్నారు.

మార్చిలోగా పనులు పూర్తి

అనిల్‌కుమార్‌, ఎస్‌ఈ, ఆర్‌బడబ్ల్యూఎస్‌, అనకాపల్లి

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న జల్‌ జీవన్‌ మిషన్‌ పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పెండింగ్‌ బిల్లులకు నిధులు మంజూరు కావడంతో మిగిలిన పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేసేందుకు కాంట్రాక్టర్లకు తగు ఆదేశాలు జారీ చేశాం. ఇంటింటికీ కొళాయి కనెక్షన్ల ఏర్పాటు పనులను వేగవంతం అయ్యాయి.

Updated Date - Sep 30 , 2026 | 12:33 AM