Share News

జై... జగన్నాథ!

ABN , Publish Date - Jul 17 , 2026 | 01:10 AM

భక్తుల ఆనందోత్సాహాల మధ్య జగన్నాథ రథయాత్ర గురువారం అంగరంగ వైభవంగా సాగింది.

జై... జగన్నాథ!

అంగరంగ వైభవంగా రథయాత్ర

భారీగా తరలివచ్చిన భక్తులు

నేటి నుంచి దశావతారాల్లో దర్శనమివ్వనున్న స్వామి

మహారాణిపేట, జూలై 16 (ఆంధ్రజ్యోతి):

భక్తుల ఆనందోత్సాహాల మధ్య జగన్నాథ రథయాత్ర గురువారం అంగరంగ వైభవంగా సాగింది. నగరంలో అతి పురాతనమైన టౌన్‌ కొత్తరోడ్డులోని ఆలయం వద్ద జగన్నాథుడు బలభద్ర, సుభద్ర సమేతుడై భక్తులను ఆశీర్వదిస్తూ రథాన్ని అధిరోహించాడు. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, హరినామ సంకీర్తనలు, గోవింద నామస్మరణ మధ్య రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. ఉదయం జగన్నాథస్వామిని తోడ్కొని వచ్చి రథంపైకి చేర్చారు. అప్పటి నుంచి భక్తులు స్వామిని దర్శించుకుని, పూజలు చేశారు. సాయంత్రం దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ రథం వద్ద కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి, రథాన్ని లాగి యాత్రను ప్రారంభించారు. భక్తులు గోవింద నామస్మరణతో రథాన్ని లాగుతూ టర్నర్‌ చౌల్ర్టీ వరకు తీసుకువెళ్లారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య రథోత్సవం వైభవంగా సాగింది. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో టి.రాజగోపాల్‌రెడ్డి ఉత్సవాన్ని పర్యవేక్షించారు. టర్నర్‌ చౌల్ర్టీలో కొలువుదీరిన జగన్నాథుడు శుక్రవారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు ప్రతిరోజూ విశిష్ఠ అవతారంలో భక్తులకు దర్శనమిస్తాడు. 26న తిరుగు రథయాత్రతో స్వామి ఆలయానికి చేరుకుంటారు.

Updated Date - Jul 17 , 2026 | 01:10 AM