Share News

డీసీసీబీని ముంచిన జగన్‌ పథకాలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 01:10 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాల కోసం లబ్ధిదారులకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) మంజూరుచేసిన రుణాలు వసూలు కావడం లేదు.

డీసీసీబీని ముంచిన జగన్‌ పథకాలు

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎడాపెడా రుణాలు

వసూలు కాక తలలు పట్టుకుంటున్న అధికారులు

వ్యవసాయ పనిముట్ల కోసం మంజూరు చేసిన రుణంలో తిరిగిరాని మొత్తం రూ.1.46 కోట్లు

‘జగనన్న తోడు’లో రూ.38.33 లక్షలు బకాయి

ఫిష్‌ ఆంధ్రా రుణదాతల్లో పత్తాలేని 52 మంది

వసూలుకాని రుణాలు రూ.ఐదు కోట్ల పైమాటే

విశాఖపట్నం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి):

వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాల కోసం లబ్ధిదారులకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) మంజూరుచేసిన రుణాలు వసూలు కావడం లేదు. కొందరు నెలవారీ వాయిదాలు చెల్లించడం లేదు. మరికొందరు అసలు పత్తాలేరు. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

గత ప్రభుత్వంలో గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలకు వ్యవసాయ పనిముట్ల కొనుగోలు కోసం డీసీసీబీ ఆయా సొసైటీల ద్వారా రుణాలు ఇచ్చింది. ట్రాక్టర్లు, పవర్‌ టిల్లర్లు, తదితరాల కోసం ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇవ్వగా, మిగిలింది సొసైటీల నుంచి రుణం కింద అందజేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో కస్టమర్‌ హైరింగ్‌ సెంటర్‌ రుణాలుగా 738 మందికి రూ.18.59 కోట్లు మంజూరుచేశారు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు రుణాల చెల్లింపులు అంతంత మాత్రంగా జరిగాయి. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రుణాల వసూళ్లకు డీసీసీబీ అధికారులు ఆయా సొసైటీలపై ఒత్తిడి తీసుకువచ్చారు. ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు జప్తు చేయడానికి సిద్ధం కావడంతో రూ.17 కోట్లు వసూలు కాగా, ఇంకా 170 మంది నుంచి రూ.1.46 కోట్లు రావలసి ఉంది.

జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారం చేసుకునే వీధి వ్యాపారులకు ఎటువంటి హామీ లేకుండా వడ్డీ లేని రుణం కింద రూ.10 వేలు ఇవ్వాలని అప్పటి పాలకులు ప్రతిపాదించారు. ప్రధానంగా జీవీఎంసీ, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల్లో చిరు వ్యాపారులకు 2020-21లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 10,191 మందికి రూ.10.21 కోట్లు రుణాలుగా మంజూరుచేసింది. తీసుకున్న రుణాన్ని వడ్డీ లేకుండా పది వాయిదాల కింద నెలకు రూ.1,000 వంతున వ్యాపారులు చెల్లించాలి. దీని ప్రకారం 2022 ఫిబ్రవరి నాటికి ఇచ్చిన రుణం మొత్తం వసూలు కావాలి. అయితే వ్యాపారుల చుట్టూ డీసీసీబీ సిబ్బంది తిరిగితే రూ.9.8 కోట్ల వరకు వసూలు కాగా మరో రూ.40 లక్షలు బకాయిలుగా ఉండిపోయాయి. రుణం తీసుకున్న చిరు వ్యాపారుల్లో 594 మంది పత్తాలేరు. వారి ఆచూకీ లేకపోవడంతో రూ.40 లక్షలు రానట్టేనని అధికారులు భావిస్తున్నారు.

సీఎంగా ఉన్న సమయంలో జగన్మోహన్‌రెడ్డి ఎంతో ఆర్భాటం చేసి ప్రారంభించిన ఫిష్‌ ఆంధ్ర అవుట్‌లెట్లు వైసీపీ పాలనలోనే మూతపడ్డాయి. అప్పట్లో పాలకుల ఒత్తిడితో ఉమ్మడి జిల్లాలో ఫిష్‌ ఆంధ్రా కింద చేపల అమ్మకాలకు 83 మందికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.1.07 కోట్లు రుణం అందజేయగా వారిలో 31మంది రూ.78.57 లక్షలు తిరిగి చెల్లించారు. ఇంకా రూ.28.54 లక్షలు బకాయిలు ఉండిపోయాయి. 52 మంది అవుట్‌లెట్లు మూసివేసి పత్తాలేకుండా పోయారు. ఈ సొమ్ములు వసూళ్లకు డీసీసీబీ అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కాగా కేంద్ర సబ్సిడీతో మంజూరుచేసిన పీఎంఈజీ పథకం కింద 45 మందికి రూ.5.84 కోట్లు రుణాలుగా ఇచ్చారు. వీటి కోసం ఎమ్మెల్యేలు, ఇతర పెద్దలు సొసైటీలపై ఒత్తిడి తీసుకువచ్చారు. తీరా రికవరీ అధికారులు అనుకున్నంత వేగంగా జరగడం లేదు. ఇంకా 39 మంది నుంచి రూ.3.72 కోట్లు వసూలు కావాల్సి ఉంది. గత ప్రభుత్వంలో వేర్వేరు పథకాల కింద ఇచ్చిన రుణాలకు సంబంధించి ఇంకా రూ.ఐదు కోట్ల వరకు రావలసి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

Updated Date - Apr 07 , 2026 | 01:11 AM