Share News

జగన్నాథ రథయాత్ర

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:53 AM

జగన్నాథస్వామి రథోత్సవం గురువారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలుత ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పట్టణంలోని గవరపాలెం అగ్గిమర్రిచెట్టు వద్ద వున్న ఆలయంలో సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథస్వామిని, ఉత్సవమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

జగన్నాథ రథయాత్ర
రథంపై సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథస్వామి ఉత్సవమూర్తులు

గవరపాలెం ఆలయం వద్ద పూజలు చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే కొణతాల

పట్టణంలోని పలు ప్రాంతాల్లో రథోత్సవం

రాత్రికి ఇంద్రద్యుమ్న మందిరానికి చేరిక

అనకాపల్లి టౌన్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): జగన్నాథస్వామి రథోత్సవం గురువారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలుత ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పట్టణంలోని గవరపాలెం అగ్గిమర్రిచెట్టు వద్ద వున్న ఆలయంలో సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథస్వామిని, ఉత్సవమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తరువాత పూజారులు ఉత్సవమూర్తులను రథంలో అధిష్ఠింపజేసిన తరువాత రథోత్సవాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యేతోపాటు ఆలయ చైర్మన్‌ దాడి బుజ్జి, కూటమి నాయకులు మళ్ల సురేంద్ర, భీమరశెట్టి రామకృష్ణ (రాంకీ), బుద్ద నాగజగదీశ్వరరావు, దాడి రత్నాకర్‌ దంపతులు, వైసీపీ నేత మలసాల భరత్‌కుమార్‌, తదితరులు కొంత దూరం రథాన్ని లాగారు. దారి పొడవునా భక్తులు సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథస్వామి ఉత్సవమూర్తులను దర్శించుకొని రథం ముందు కొబ్బరికాయలు కొట్టారు. ఆలయం వద్ద ప్రారంభమైన రథయాత్ర దిబ్బవీధి, సతకంపట్టు, చినరామస్వామికోవెల, సంతబయలు, కోటవీధి, గంగిరేవిచెట్టు, సంతోషిమాత ఆలయం, పరమేశ్వరిపార్కు జంక్షన్‌, మెయిన్‌రోడ్డు, వన్‌ వే డౌన్‌, నీలకంఠరావువీధి, వేగివీధి, చింతావారివీధి, చిననాలుగురోడ్ల జంక్షన్‌, పెరుగుబజార్‌ జంక్షన్‌, గాంధీబొమ్మ జంక్షన్‌, మళ్లవీధి మీదుగా రాత్రి పదిన్నర గంటలకు రైల్వే స్టేషన్‌ సమీపంలోని గూడ్స్‌షెడ్డు వద్ద గల ఇంద్రద్యుమ్న మందిరానికి చేరుకుంది. ఆలయ అర్చకులు బి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉత్సవమూర్తులను మందిరంలో కొలువుదీర్చారు. రథోత్సవంలో భాగంగా పులివేషాలు, నేల వేషాలు వంటి కళారూపాలను ప్రదర్శించారు. రథోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐలు జి.ప్రేమ్‌కుమార్‌, అశోక్‌కుమార్‌, వెంకటనారాయణ, ఎస్‌ఐలు ఎ.వెంకటేశ్వరరావు, ఎస్‌కే జిలానీ, డి.శేఖరం, శేషగిరిరావు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌ కేఎల్‌ సుధారాణి, ఆలయ ఈవో కె.చంద్రతేజ, ధర్మకర్తలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా అగ్గిమర్రి చెట్టు వద్దగల జగన్నాథస్వామి ఆలయంలో బుధవారం రాత్రి రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువుగా నిర్వహించారు.

Updated Date - Jul 17 , 2026 | 12:53 AM