జడ్పీటీసీలకు జగన్ మొండిచేయి
ABN , Publish Date - Aug 22 , 2026 | 01:08 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో జడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం కూడా సరిగా ఇవ్వలేదు.
గౌరవ వేతనం సక్రమంగా చెల్లించని వైసీపీ ప్రభుత్వం
2021 సెప్టెంబరు నుంచి 2024 మార్చి వరకు...30 నెలలకుగాను కేవలం ఎనిమిది నెలల
గౌరవ వేతనం విడుదల
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా అందుతున్న వేతనం
వైసీపీ హయాంలో రూ.65 లక్షల బకాయిలు
వాటి కోసం సభ్యుల ఎదురుచూపు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వైసీపీ ప్రభుత్వ హయాంలో జడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం కూడా సరిగా ఇవ్వలేదు. జడ్పీ ఎన్నికలు 2021 సెప్టెంబరులో జరిగాయి. తొలి ఆరు నెలల గౌరవ వేతనం ఇంతవరకూ సభ్యులకు అందలేదు. ఆ తరువాత 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలు...24 నెలల్లో కేవలం ఎనిమిది నెలలు మాత్రమే గౌరవ వేతనం ఇచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం గౌరవ వేతనం అందజేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మే వరకు గౌరవ వేతనం మంజూరుచేసింది. జూన్ నెలకు సంబంధించి బిల్లులు రూపొందించి ట్రెజరీకి పంపారు.
వైసీపీ హయాంలో 2021 సెప్టెంబరులో ఎన్నికైన జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం వచ్చే నెల 23వ తేదీతో ముగియనున్నది. జడ్పీటీసీ సభ్యులకు నెలకు రూ.6 వేలు, చైర్‌పర్సన్‌కు రూ.40 వేల గౌరవ వేతనంగా ఇస్తున్నారు. ఉమ్మడి విశాఖ జడ్పీలో 39 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఇద్దరు తప్ప మిగిలిన 37 మంది వైసీపీకి చెందినవారే. జడ్పీ సమావేశం జరిగిన ప్రతిసారి ప్రోటోకాల్ మర్యాద, మండల పరిషత్ కార్యాలయంలో ఛాంబర్ ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తుండేవారు. అలాగే గౌరవ వేతనం సక్రమంగా విడుదల చేయాలని కోరేవారు. గౌరవ వేతనం కోసం జడ్పీ సమావేశాల్లో తీర్మానం చేసి అప్పటి ప్రభుత్వానికి పంపారు. అయినా అరకొరగానే నిధులు విడుదల చేస్తుండేది.
2021 సెప్టెంబరు నుంచి 2022 మార్చి వరకు ఆరు నెలలకుగాను రూ.18 లక్షలకు బిల్లు పెడితే ట్రెజరీ అధికారులు అప్పట్లో తిరస్కరించారు. ఆ తరువాత బిల్లులు అప్‌లోడ్ చేసినా గౌరవ వేతనం విడుదల చేయలేదు. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.33.6 లక్షలకుగాను ఐదు నెలలకు సంబంధించి సుమారు రూ.18 లక్షలు విడుదల చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.13.6 లక్షలు మాత్రమే విడుదల చేయగా కేవలం మూడు నెలల గౌరవ వేతనం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను గౌరవ వేతనం కింద రూ.33.6 లక్షలు విడుదల చేశారు. అంటే జడ్పీటీసీ సభ్యులు ఎన్నికైన తరువాత ఏడాదంతా గౌరవ వేతనం తీసుకున్నది కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతేనని అర్థమవుతోంది. ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్, మే నెల వరకు గౌరవ వేతనం అందగా, జూన్ బిల్లు ట్రెజరీకి పంపారు. మొత్తం ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు జడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం కింద ఇంకా రూ.65 లక్షల బకాయిలు అందాల్సి ఉంది. వచ్చే నెలలో పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో బహుశా ఒకసారి సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. అప్పటికి గౌరవ వేతనం బకాయిలు చెల్లించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని జడ్పీటీసీ సభ్యులు కోరుతున్నారు.