జాఫ్రా ధర పతనం
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:35 PM
జాఫ్రా(అనోటా) గింజలకు ఈ ఏడాది మార్కెట్ ప్రారంభంలోనే ధర తగ్గింది. గత ఏడాది ప్రైవేటు వర్తకులు కిలో రూ.300 కొనుగోలు చేయగా, ప్రస్తుతం రూ.250 ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఆదివాసీ రైతులు కొన్నేళ్లుగా పొలాల గట్లు, మెట్ట భూముల్లో జాఫ్రాను సాగు చేస్తున్నారు.
- గత ఏడాది కిలో రూ.300
- ఈ ఏడాది రూ.250
- జీసీసీ మార్కెటింగ్ సదుపాయం కల్పించి జాతీయ ధరలను అందించాలని రైతుల వేడుకోలు
గూడెంకొత్తవీధి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): జాఫ్రా(అనోటా) గింజలకు ఈ ఏడాది మార్కెట్ ప్రారంభంలోనే ధర తగ్గింది. గత ఏడాది ప్రైవేటు వర్తకులు కిలో రూ.300 కొనుగోలు చేయగా, ప్రస్తుతం రూ.250 ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఆదివాసీ రైతులు కొన్నేళ్లుగా పొలాల గట్లు, మెట్ట భూముల్లో జాఫ్రాను సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది జనవరిలో జాఫ్రా దిగుబడులు ప్రారంభమవుతాయి. మార్చి వరకు జాఫ్రాకు మార్కెట్ ఉంటుంది. జాఫ్రా సహజసిద్ధమైన రంగును ఇస్తుంది. ఈ గింజలను వివిధ వంటకాలతో పాటు అలంకరణకు ఉపయోగించే క్రీములు, లోషన్లు, కాస్మొటిక్స్‌లో ఉపయోగిస్తారు. దీంతో ఈ జాఫ్రా గింజలకు మంచి డిమాండ్ ఉంటుంది. గిరిజన ప్రాంత రైతులు ఆర్గానిక్ పద్ధతిలో జాఫ్రాను సాగు చేయడం వల్ల జాతీయ మార్కెట్‌లో మంచి ధర లభిస్తుంది. జాఫ్రా గింజలను జీసీసీ గతంలో కొనుగోలు చేసేది. ప్రస్తుతం మార్కెటింగ్ సదుపాయం కల్పించడం లేదు. దీంతో ప్రైవేటు వర్తకులు ఈ గింజలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా జాఫ్రా గింజలకు జీసీసీ మార్కెటింగ్ సదుపాయం కల్పించి జాతీయ ధరలను అందించాలని రైతులు కోరుతున్నారు.