కేజీహెచ్‌లో ఐయూఐ ల్యాబ్ ప్రారంభం
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:52 AM
కేజీహెచ్‌లోని గైనిక్ విభాగంలో నూతనంగా ఏర్పాటుచేసిన అత్యాధునిక ఇంట్రాటెరిన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) ల్యాబ్‌ను జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, ఎమ్మెల్యే సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు.
సంతానలేమి సమస్యతో బాధపడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉచితంగా నాణ్యమైన సేవలు
ఆస్పత్రి చరిత్రలో మైలురాయిగా పేర్కొన్న కలెక్టర్, ఎమ్మెల్యే
విశాఖపట్నం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి):
కేజీహెచ్‌లోని గైనిక్ విభాగంలో నూతనంగా ఏర్పాటుచేసిన అత్యాధునిక ఇంట్రాటెరిన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) ల్యాబ్‌ను జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, ఎమ్మెల్యే సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేజీహెచ్, ఆంధ్ర మెడికల్ కాలేజీ చరిత్రలో ఇదో మైలురాయిగా నిలుస్తుందన్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు నాణ్యమైన సేవలు ఉచితంగా అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరమన్నారు. విశాఖ జిల్లాలో 15 నుంచి 18 శాతం మంది దంపతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. వైద్యులు మాట్లాడుతూ ఐయూఐ విధానంలో పురుషుడి నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన శుక్ర కణాలను ప్రత్యేక ప్రక్రియ ద్వారా శుద్ధి చేసి, మహిళ అండం విడుదలయ్యే సరైన సమయంలో గర్భాశయంలో ప్రవేశపెట్టడం ద్వారా గర్భధారణ అవకాశాలు పెరుగుతాయన్నారు. తక్కువ ఖర్చుతో సురక్షితంగా నిర్వహించగల ఈ విధానం సంతాన లేమి చికిత్సలో కీలకమైందన్నారు. ఈ అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటుకు అవసరమైన పరికరాలను ‘అంకోస’ సామాజిక బాధ్యతగా అందించింది. కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ చంద్రశేఖరంనాయుడు, డాక్టర్ వాసవీలత, ఆర్‌ఎంవోలు డాక్టర్ బంగారయ్య, అడ్మినిస్ర్టేటర్ బీవీ రమణ, ఇతర అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.