పెద్దాస్పత్రిలో ఐయూఐ?
ABN , Publish Date - May 11 , 2026 | 01:03 AM
సంతానలేమితో బాధపడుతున్నవారి సంఖ్య కొన్నాళ్లుగా పెరుగుతోంది.
గైనకాలజీ విభాగంలో ఇంట్రాయుటెరైన్ ఇన్సెమినేషన్ సెంటర్ ఏర్పాటుకు యత్నాలు
అనుమతి కోసం ఆరోగ్య శాఖకు దరఖాస్తు
తనిఖీలు నిర్వహించి సానుకూలంగా స్పందించిన బృందం
త్వరలోనే గ్రీన్‌సిగ్నల్
మూడు లక్షల రూపాయల విలువైన పరికరాలు అందించిన అంకోసా
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
సంతానలేమితో బాధపడుతున్నవారి సంఖ్య కొన్నాళ్లుగా పెరుగుతోంది. ఇందుకు ఆహారపు అలవాట్లు, జీవన విధానం, ఒత్తిడి, స్థూలకాయం వంటివి కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగని దంపతులు ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా యత్నిస్తున్నారు. అయితే, ఇందుకు లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. వీటిల్లో ఐయూఐ, ఐవీఎఫ్, సరోగసీ, స్పెర్మ్/ఎగ్ ఫ్రీజింగ్ వంటి అనేక పద్ధతులు ఉన్నాయి. ఇప్పటివరకూ ఇవి ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రమే పరిమితం కాగా, తొలిసారి ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రిగా పేరుగాంచిన కేజీహెచ్‌లో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు అధికారులు నడుంబిగించారు. గైనకాలజీ విభాగంలో ఇంట్రాయుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) సెంటర్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. రెండు నెలల కిందట కేంద్రం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరుతూ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయానికి ఆస్పత్రి అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. మూడు వారాల కిందట ఆరోగ్య శాఖ అధికారులు బృందం కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తున్న గైనకాలజీ విభాగాన్ని సందర్శించి సానుకూలతను వ్యక్తంచేసింది. దీంతో కొద్దిరోజుల్లో ఐయూఐ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ వస్తుందని ఆస్పత్రి అధికారులు భావిస్తున్నారు.
ఐయూఐతో ఎంతో మేలు
కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఐయూఐ ఒకటి. ఈ విధానంలో వైద్యులు స్ర్తీ అండాశయాల పనితీరును, అండం విడుదల సమయాన్ని ట్రాక్ చేస్తారు. అవసరమైతే అండం విడుదలను ప్రేరేపించడానికి మందులు, ఇంజెక్షన్లు ఇస్తారు. పురుషుడి నుంచి సేకరించిన వీర్యాన్ని ల్యాబ్‌లో ప్రత్యేక పద్ధతిలో శుద్ధి చేసి వేగంగా కదిలే కణాలను వేరు చేస్తారు. ఇలా వేరు చేసిన కణాలను గర్భాశయంలోకి పంపిస్తారు. ఈ ప్రక్రియ కొద్ది నిమిషాల్లో ముగుస్తుంది. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా, కదలిక లేకపోయినా, స్ర్తీలలో గర్భాశయ ముఖద్వారంలో సమస్యలు ఉన్నా, ఎండోమెట్రియాసిస్ వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఐయూఐ పద్ధతిని అనుసరిస్తారు. ఐయూఐ చాలా తేలిక ప్రక్రియ కావడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దీని తరువాత మహిళలు రోజువారీ పనులు చేసుకోవచ్చు. 14 రోజుల తరువాత గర్భధారణ పరీక్ష చేసి ఫలితాన్ని నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియకు ప్రైవేటు/కార్పొరేటు ఆస్పత్రుల్లో కనీసం రూ.35 వేలు నుంచి రూ.50 వేల వరకు ఖర్చవుతుంది. కొన్నిచోట్ల మరింత అధికంగా వసూలుచేస్తారు. కేజీహెచ్‌లో ఈ సెంటర్ ఏర్పాటైతే సాధారణ, నిరుపేదలు రూపాయి ఖర్చు లేకుండా సేవలు పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది.
పరికరాలు సమకూర్చిన అంకోసా..
ఈ సంతాన సాఫల్య చికిత్స కేంద్రంలో వినియోగించేందుకు అవసరమైన పరికరాలను ఆంధ్ర మెడికల్ కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (అంకోసా) సమకూర్చింది. సుమారు రూ.3 లక్షల విలువైన సెంట్రిఫ్యూజ్, మైక్రోస్కోప్, లామినార్ ఫ్లో, ఇంక్యుబేటర్, రెఫ్రిజిరేటర్, ఐయూఐ క్యాథెటర్లు వంటివి కొనుగోలు చేశారు. వీటి ద్వారా వీర్యాన్ని శుద్ధి చేయడం దగ్గర నుంచి గర్భాశయంలో ప్రవేశపెట్టడం వరకు మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు అవకాశం ఉంది.
నిరుపేదలకు మేలు చేకూర్చే ఉద్ధేశంతో ఏర్పాటు
- డాక్టర్ ఐ.వాణి, కేజీహెచ్ సూపరింటెండెంట్
సంతానలేమి ఎంతోమందిని వేధిస్తోంది. ఇది ఒక్క మహిళలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. కానీ, మానసిక ఒత్తిడి పూర్తిగా మహిళలపైనే ఉంటోంది. చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో చాలామంది ఆధునిక వైద్య పద్ధతులకు వెళ్లలేని పరిస్థితి. అటువంటి వారికి మేలు చేసే ఉద్దేశంతో కేజీహెచ్‌లో ఐయూఐ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. ఇప్పటికే దరఖాస్తు చేశాం. కొద్దిరోజుల్లో అనుమతులు వస్తాయని భావిస్తున్నాం. కేజీహెచ్ గైనిక్ విభాగంలో సంతాన లేమి సమస్యలతో బాధపడే వారిని గుర్తిస్తుంటాం. అటువంటి వారికి ఐయూఐ విధానాన్ని అనుసరించి పిల్లలు కలిగేలా కృషి చేస్తాం.