ఉత్సవ్‌కు వేళాయె
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:55 AM
విశాఖ ఉత్సవ్‌కు విస్తృత ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు.
నేటి నుంచి 31వ తేదీ వరకూ నిర్వహణ
కాళీమాత గుడి ఎదురుగా ఆర్‌కే బీచ్‌లో ప్రధాన వేదిక ఏర్పాటు
ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకూ కార్యక్రమాలు
27 నుంచి బీచ్‌లో కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్ పోటీలు
రుషికొండ బీచ్‌లో హెలికాప్టర్ రైడ్, పారామోటారింగ్, అడ్వంచర్ స్పోర్ట్స్
సిటీ సెంట్రల్ పార్కులో 29, 30, 31 తేదీల్లో ఫ్లవర్ షో
కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్
విశాఖపట్నం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఉత్సవ్‌కు విస్తృత ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ విద్యాధరి, జిల్లా పర్యాటక శాఖాధికారిణి మాధవితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉత్సవాలు శనివారం నుంచి 31వ తేదీ వరకు ఉంటాయన్నారు. ప్రధాన వేదిక ఆర్‌కే బీచ్‌లో కాళీమాత గుడి ఎదురుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాన కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతాయన్నారు. స్థానిక కళాకారుల కోసం నోవాటెల్ హోటల్ ఎదురుగా మరో వేదిక ఉంటుందన్నారు. ఉత్సవాల ప్రారంభానికి శనివారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్ వస్తున్నారన్నారు. తొలిరోజు గాయని సునీత సినీ గేయాలు ఆలపిస్తారన్నారు. ఉత్సవ్‌లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీలు కూడా ఉంటాయన్నారు.
ప్రధాన వేదిక సమీపాన ఫుడ్ స్టాళ్లు
ప్రధాన వేదికపై సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకూ, నోవాటెల్ హోటల్ వద్ద ఏర్పాటుచేసే మరో వేదికపై సాయంత్రం 5 గంటల నుంచి 7.30 గంటల వరకూ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రధాన వేదికకు సమీపానే 70 ఫుడ్ స్టాళ్లు, స్థానిక కళాకారులు తయారుచేసిన వస్తువుల విక్రయ స్టాళ్లు ఉంటాయన్నారు. రుషికొండ బీచ్‌లో హెలికాప్టర్ రైడ్, పారామోటారింగ్, అడ్వంచర్ స్పోర్ట్స్ ఉంటాయన్నారు. భీమిలిలో హాట్ ఎయిర్ బెలూన్ల ప్రదర్శన రద్దు చేశామని చెప్పారు. అక్కడ బోట్ల పోటీలు ఉంటాయన్నారు. ఏయూ మైదానంలో 30వ తేదీన ముగ్గుల పోటీ నిర్వహిస్తామన్నారు. పిల్లల కోసం 31న స్వర్ణభారతి స్టేడియంలో ఒలింపియాడ్ ఉంటుందన్నారు. 27న సన్ ఇనిస్టిట్యూట్‌లో వంటల పోటీలు ఉంటాయన్నారు. 27 నుంచి 29 వరకు బీచ్‌లో కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్ పోటీలు నిర్వహిస్తారన్నారు. ఇంటాక్ సంస్థతో కలిసి హెరిటేజ్ ట్రెజర్ హంట్ నిర్వహిస్తున్నామన్నారు.
క్రౌన్ వైజాగ్ పేరుతో మిస్ వైజాగ్, మిస్టర్ వైజాగ్, మిస్టర్ కిడ్ పోటీలు ఉంటాయన్నారు. వీఎంఆర్‌డీఏ అధికారులు సిటీ సెంట్రల్ పార్కులో 29, 30, 31 తేదీల్లో ఫ్లవర్ షో ఏర్పాటు చేస్తారన్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఉచిత ప్రవేశాలు ఉంటాయన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను అంతర్జాతీయంగా పేరున్న శ్రేయాస్ మీడియా సంస్థకు ఇచ్చారని, మొత్తం రూ.8 కోట్ల వ్యయంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్థానిక కళాకారులకు కూడా అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఉత్సవాల నిర్వహణలో కొంత సమాచారలోపం ఉందని, సమన్వయంతో విజయవంతం చేస్తామని చెప్పారు.
ఇంకా ఖరారు కాని కార్యక్రమాలు
ఈవెంట్ సంస్థకు నిర్వహణ బాధ్యతలు
ప్రధాన వేదిక ఎంజీఎం నుంచి కాళీమాత గుడికి మార్పు
స్థానిక కళాకారులకు వేరుగా మరో వేదిక
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ ఉత్సవ్ నిర్వహణ బాధ్యతను రూ.8 కోట్లకు ఒక ఈవెంట్ సంస్థకు అప్పగించారు. అధికారులు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఎంజీఎం మైదానంలో ప్రధాన వేదిక అని ముందుగా ప్రకటించారు. దానిని రద్దు చేసి, బీచ్‌రోడ్డులో కాళీమాత ఆలయం ఎదురుగా పెడుతున్నారు. స్థానిక కళాకారుల కోసం ప్రత్యేకంగా గోకుల్ పార్కులో మరో వేదిక ఏర్పాటుచేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు తొమ్మిది రోజులు ఉత్సవాలు ఉంటాయని ప్రకటించి ఇప్పుడు 31వ తేదీ వరకే అని చెబుతున్నారు. ఏ రోజు ఏ కార్యక్రమానికి ఎవరు ప్రధాన ఆకర్షణ (సినీ గాయకులు/సంగీత దర్శకులు/నటులు), ఎవరు ముఖ్య అతిథి అనేది ఇప్పటికీ ఖరారు కాలేదు. శుక్రవారం సాయంత్రం కూడా జాబితా ఖరారు కావలసి ఉందని అధికారులు ప్రకటించడం గమనార్హం.
ఉత్సవ్‌లో భాగంగా ‘క్రౌన్ ఆఫ్ వైజాగ్’ పేరుతో మిస్ వైజాగ్, మిస్టర్ వైజాగ్, కిడ్ పోటీలు ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో గెలిచిన వారితో రెండు గంటల పాటు ప్రధాన వేదికపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఈ పోటీలలో పాల్గొనేవారిని ‘శ్రేయాస్ మీడియా’ ప్రీ ఆడిషన్ చేసి, ఎంపిక చేస్తుందని, ఆ సంస్థే విజేతలను ప్రకటిస్తుందని అధికారులు తెలిపారు. సమన్వయం బాధ్యతలు మాత్రం జిల్లా అధికారులకు అప్పగించారు. ఒక్కో వేదికకు ఒక్కో అధికారిని నియమించారు.
మూడు రోజులకే ఫ్లవర్ షో పరిమితం
విశాఖ ఉత్సవ్ ఎన్ని రోజులు నిర్వహిస్తే అన్ని రోజులు వీఎంఆర్‌డీఏ ఫ్లవర్ షో నిర్వహించడం ఆనవాయితీ. ఆ తరువాత కూడా మరో రెండు రోజులు ఉంచి అందరికీ అవకాశం కల్పించేవారు. ఈసారి ఉత్సవ్ తొమ్మిది రోజులు జరుగుతుంటే ప్రదర్శన కేవలం మూడు రోజులు 29, 30, 31 తేదీలకే పరిమితం చేశారు.
ఆర్టీసీ స్పెషల్స్
ద్వారకా బస్‌స్టేషన్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఉత్సవ్ సందర్శకుల సౌకర్యార్థం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ 14 ప్రత్యేక సర్వీసులు నడపాలని ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు నిర్ణయించారు. శనివారం నుంచి 31వ తేదీ వరకు రామకృష్ణా బీచ్ వేదికగా ఉత్సవ్ జరగనున్నది. కొత్తవలస, సింహాచలం, పెందుర్తి, స్టీల్ సిటీ, తగరపువలస, పాత గాజువాక, సింధియా తదితర ప్రాంతాల నుంచి సందర్శకులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు...ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసులు ఆపరేట్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3.00 నుంచి రాత్రి 11.00 గంటల వరకు ఈ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు.