బడికి వేళాయే
ABN , Publish Date - Jun 11 , 2026 | 11:07 PM
వేసవి సెలవులు ముగియడంతో శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి మొదలుకుని ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల వరకు విద్యాకానుకలను అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డొక్కా సీతమ్మ పేరిట విద్యాలయాల్లో నాణ్యమైన సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నారు. వేసవి సెలవుల్లో బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, పథకాలు, విద్యాబోధన వంటి అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించడంతో జిల్లాలోని స్కూళ్లలో పది వేల మంది చేరనున్నారు.
నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం
ఒకటి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు
విద్యామిత్ర కిట్లు పంపిణీకి సన్నాహాలు
జిల్లా వ్యాప్తంగా 2,033 విద్యాలయాలు,
1 లక్షా 23 వేల మంది విద్యార్థులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని 11 మండలాల్లో ప్రాథమిక, ప్రాథకోన్నత, ఉన్నత, ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కస్తూర్భా బాలికల విద్యాలయాలు, ఏకలవ్య పాఠశాలలు మొత్తం 2,033 ఉన్నాయి. వాటిలో 1 లక్షా 23 వేల మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట విద్యామిత్రా కిట్లను అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. వాటిని పాఠశాలల పునఃప్రారంభం నుంచి విద్యార్థులకు అందజేసేలా చర్యలు చేపట్టారు. ఆయా విద్యామిత్ర కిట్లలో నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, యూనీఫారం దుస్తులు, బూట్లు, నిఘంటువు, బెల్ట్ ఉంటాయి. అలాగే కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ తల్లి వందనం పథకంలో రూ.13 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం ప్రతి ఏడాది జమ చేయనుంది.
నాణ్యమైన సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం
ప్రభుత్వ విద్యాలయాల్లో డొక్కా సీతమ్మ పేరిట మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన సన్నబియాన్ని గతేడాది నుంచే వినియోగిస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఐదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ పాఠశాలల్లో ఉండేలా, డ్రాపవుట్స్ కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఐదేళ్లు నిండిన విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించేందుకు వేసవి సెలవుల్లోనే బడి పిలుస్తుంది పేరిట కార్యక్రమాలు నిర్వహించి జిల్లాలో 10 వేల మంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించారు.
ప్రాథమిక పాఠశాలకు గూడు లేని దుస్థితి
ఏజెన్సీలో అధిక సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలకు భవనాలు లేని దుస్థితి చాలా ఏళ్లుగా కొనసాగుతున్నది. జిల్లాలోని 11 మండలాల్లో 254 ప్రాథమిక పాఠశాలకు కనీస భవన సదుపాయాలు లేవు. దీంతో కొన్నిచోట్ల స్థానికుల పెంకుటిల్లులో, పాకల్లో నిర్వహిస్తుండగా, మరి కొన్నిచోట్ల గ్రామస్థుల శ్రమదానంతో నిర్మించే షెడ్లలో ప్రాథమిక పాఠశాలలను నడుపుతున్నారు. వాస్తవానికి గూడు లేని బడులకు భవనాలను నిర్మించేందుకు రూ.40 కోట్లు మంజూరు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖామంత్రి నారా లోకేశ్ గతేడాది జూలైలోనే ప్రకటించినప్పటికీ నేటికీ కార్యరూపం దాల్చలేదు.
జిల్లాలోని ఉన్న విద్యాలయాలు...
ు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు: 98
ు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు: 35
ు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు : 11
ు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు: 1,000
ు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు: 45
ు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు: 6
ు కస్తూర్భా బాలికల విద్యాలయాలు: 11
ు గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలలు: 665
ు గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమికోన్నత ఆశ్రమ పాఠశాలలు: 1
ు గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమోన్నత పాఠశాలలు: 116
ు గిరిజన సంక్షేమ గురుకుల ప్రాథమికోన్నత పాఠశాలలు: 3
ు గిరిజన సంక్షేమ గురుకుల ఉన్నత పాఠశాలలు: 20
ు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు: 11
ు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు: 11