కేజీబీవీల్లో ప్రవేశాలకు వేళాయె!
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:13 PM
బాలికల విద్యకు పెద్దపీట వేసిన కస్తూర్బా గాంధీ విద్యాలయాలు కార్పొరేటు పాఠశాలలకు దీటుగా రాణిస్తున్నాయి.
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సదుపాయాలు
ఆంగ్ల మాధ్యమంలో బోధన
ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య
12 నుంచి దరఖాస్తుల స్వీకరణ
(పాడేరు/చింతపల్లి- ఆంధ్రజ్యోతి)
బాలికల విద్యకు పెద్దపీట వేసిన కస్తూర్బా గాంధీ విద్యాలయాలు కార్పొరేటు పాఠశాలలకు దీటుగా రాణిస్తున్నాయి. ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యను ఆంగ్ల మాధ్యమంలో ఇక్కడ అందిస్తున్నారు. విద్యార్థినులకు పాఠశాలలో మెరుగైన సదుపాయాలతో పాటు పోషకాహారం అందుతుంది. 24 గంటలూ ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉంటుంది. బాలికలు క్రమశిక్షణతో విద్యలో రాణిస్తున్నారు. నాడు డ్రాపౌట్(పాఠశాల నుంచి దూరమైన) విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన కేజీబీవీల్లో ప్రస్తుతం రెగ్యులర్ విద్యార్థుల ప్రవేశాల కోసం క్యూ కడుతున్నారంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ప్రవేశాలకు ఈ నెల 12 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో షెడ్యుల్డ్ కులాలు, షెడ్యుల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు చెందిన బాలికలకు నాణ్యమైన విద్యను అందించాలని 2004 ఆగస్టులో కస్తూర్బాగాంఽధీ బాలికా విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలకు దూరమైన విద్యార్థినుల సంఖ్యను తగ్గించేందుకు వసతితో కూడిన విద్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పాఠశాలను 2008 ఏప్రిల్ ఒకటిన సర్వ శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ప్రోగ్రామ్‌లో విలీనం చేశారు. ఈ పాఠశాలలు ప్రస్తుతం సమగ్ర శిక్ష పర్యవేక్షణలో నడుస్తున్నాయి. ప్రతి మండలంలో బాలికల కోసం ఒక కేజీబీవీ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో ఒక తరగతిలో 40 సీట్లు ఉంటాయి. విద్యార్థినులకు విద్యాబోధనకు అర్హత కలిగిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు 12-14 మంది అందుబాటులో ఉన్నారు. విద్యార్థినుల ఆరోగ్యం పర్యవేక్షించి ప్రాథమిక చికిత్స అందించేందుకు ఏఎన్‌ఎం అందుబాటులో ఉన్నారు.
ఆధునిక విద్యాబోధన
కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఆధునిక పద్ధతుల్లో విద్యాబోధనకు శ్రీకారం చుట్టారు. ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్‌పీ) అందుబాటులో ఉన్నాయి. పాఠశాలను విజువల్స్ రూపంలో ఐఎఫ్‌పీ, ట్యాబ్‌ల ద్వారా బోధిస్తున్నారు. ఈ విధానం వల్ల విద్యార్థినులకు కష్టమైన సబ్జెక్టులు సులభంగా అర్థమవుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రవేశపెట్టడం వల్ల ఇక్కడ విద్యాభ్యాసం చేసిన విద్యార్థినులు పోటీ పరీక్షల్లోనూ రాణిస్తున్నారు. పాఠ్యాంశాల బోధనతో పాటు వృత్తి కోర్సుల్లోనూ విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్, కుట్టు, బ్యూటీషియన్ కోర్సులో విద్యార్థినులకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు.
బాలికలకు ప్రత్యేక శిక్షణ
విద్యార్థినులకు విద్యతో పాటూ శారీరక, మానసిక వికాసానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి రోజు ఉదయం యోగా, సాయంత్రం క్రీడలు నిర్వహించడం వల్ల బాలికలు ఉత్సాంగా ఉంటున్నారు. ఆత్మరక్షణ కోసం బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ కరాటే శిక్షణ ఇస్తున్నారు. సంగీతం, నృత్యం, చిత్రలేఖనంలోనూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
క్రమశిక్షణ, మెరుగైన వసతి
విద్యార్థినులకు క్రమశిక్షణ కలిగిన టైం టేబుల్ అమలు చేస్తున్నారు. విద్యాలయంలో విద్యార్థినులు ప్రతి రోజు ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేవాల్సి ఉంటుంది. కాలకృత్యాల అనంతరం ఐదు గంటలకు స్టడీలో కూర్చోవాలి. ఆరు గంటలకు నుంచి ఆరున్నర గంటల వరకు యోగా చేస్తారు. 6:30 గంటలకు రాగీ మాల్ట్ ఇస్తారు. అనంతరం స్నానాలు పూర్తి చేసుకుంటారు. 8:30 గంటలకు అల్పాహారం పెడతారు. 9 గంటల నుంచి 15 నిమిషాల పాటు ప్రార్థన ఉంటుంది. 9:15 గంటలకు ఉదయం తరగతులు ప్రారంభమవుతాయి. ఒక్కొక్క తరగతి 50 నిమిషాలు ఉంటుంది. మధ్యాహ్నం 12:15 గంటలకు మధ్యాహ్న భోజనం ఉంటుంది. ఒంటి గంటకు తిరిగి మధ్యాహ్నం తరగతులు ప్రారంభమవుతాయి. నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు వెనుకబడిన విద్యార్థులకు బేసిక్(ప్రాథమిక విద్యాబోధన) అందిస్తారు. ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు విద్యార్థినులు క్రీడల్లో పాల్గొంటారు. 6:30 గంటలకు రాత్రి భోజనం ఉంటుంది. రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో స్టడీ ఉంటుంది. అలాగే విద్యార్థినులు విద్యాభ్యాసం, వసతి కోసం నూతన భవనాలు అందుబాటులో ఉన్నాయి. తరగతిలో 40 మంది విద్యార్థినులు కూర్చోవడానికి అనువుగా గదులు ఉన్నాయి. ప్రతి విద్యార్థిని కూర్చోవడానికి డెస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. వసతి గృహాల్లోనూ విద్యార్థినులకు విశాలమైన గదులు ఉన్నాయి. ప్రస్తుతం విద్యార్థినులు పడుకోవడానికి బెడ్స్, బెడ్‌షీట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది నుంచి ప్రతి విద్యార్థికీ బంకర్ బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. విద్యార్థినులకు వేడి నీళ్ల కోసం సోలార్ హీటర్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థినులకు తగిన మరుగుదొడ్లు, స్నానపు గదులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో రన్నింగ్ వాటర్ ఉంది. వసతి గృహం చుట్టూ ప్రహరీ గోడలు ఉన్నాయి. విద్యార్థినులు సీసీ కెమేరాల పర్యవేక్షణలో ఉంటారు. పగలు, రాత్రి మహిళా పర్యవేక్షక సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అలాగే విద్యాలయంలో విద్యార్థినులకు మంచి పోషకాహారం అందిస్తున్నారు. ఉదయం రాగి మాల్ట్‌తో దినచర్చను ప్రారంభిస్తారు. ప్రతి రోజు ఒక రకం అల్పాహారం ఉంటుంది. మధ్యాహ్నం పప్పు, ఆకు కూర, రసంతో పాటు శనివారం మినహా ప్రతి రోజు గుడ్డు ఇస్తారు. మధ్యాహ్నం, రాత్రి మజ్జిగ ఉంటుంది. రాత్రి ఒక కూర, అరటిపండు ఇస్తారు. ఆదివారం మధ్యాహ్నం చికెన్ పెడతారు.