కౌంటింగ్‌కు వేళాయె...
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:04 AM
జిల్లాలో గురువారం నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికల్లో ఓటరు ఇచ్చిన తీర్పు నేడు (శనివారం) వెల్లడికానున్నది. ఓట్ల లెక్కింపు కోసం ఆయా కేంద్రాల్లో శుక్రవారం సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలీసు అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లాలో 24 మండలాలు వుండగా.. అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, దేవరాపల్లి (తెనుగుపూడి)ల్లో రిసెప్షన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నేడే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు
ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం
జిల్లాలో ఏడుచోట్ల పది కేంద్రాల్లో ఏర్పాట్లు
తేలనున్న 80 మంది జడ్పీటీసీ, 979 మంది ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం
మొత్తం ఓటర్లు: 12,35,090 పోలైన ఓట్లు: 9,33,422
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం
అనకాపల్లి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో గురువారం నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికల్లో ఓటరు ఇచ్చిన తీర్పు నేడు (శనివారం) వెల్లడికానున్నది. ఓట్ల లెక్కింపు కోసం ఆయా కేంద్రాల్లో శుక్రవారం సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలీసు అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లాలో 24 మండలాలు వుండగా.. అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, దేవరాపల్లి (తెనుగుపూడి)ల్లో రిసెప్షన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. తరువాత బ్యాలెట్ బాక్సులను తెరిచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు చేపడతారు. ప్రతి ఎంపీటీసీ స్థానానికి రెండేసి టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక టేబుల్‌పై ఎంపీటీసీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, మరో టేబుల్‌పై జడ్పీటీసీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగినందున ఫలితాలు వెలువడానికి కొంత ఎక్కువ సమయం పడుతుందని, ఉదయం 11 గంటల తరువాతే ఫలితాలు వెలువడే అవకాశం వుందని, సాయంత్రంకల్లా ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని చెబుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అభ్యర్థులను, కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతిస్తారు.
జిల్లాలో 24 జడ్పీటీసీ స్థానాలు 80 మంది పోటీ చేశారు. 427 ఎంపీటీసీ స్థానాలకుగాను అచ్యుతాపురం, ఎస్.రాయవరం మండలాల్లో రెండు స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 425 స్థానాలకు 979 మంది పోటీ చేశారు. మొత్తం 12,35,090 మంది ఓటర్లకుగాను 9,33,422 మంది (75.58 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 4,49,969 మంది, మహిళలు 4,83,447 మంది, ఇతరులు ఆరుగురు వున్నారు. కె.కోటపాడు మండలంలో అత్యధికంగా 80.37 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. రోలుగుంట మండలంలో 80.28 శాతం, దేవరాపల్లి మండలంలో 80 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాయకరావుపేట మండలంలో అత్యల్పంగా 66.66 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది.