ఉత్సవాలకు వేళాయె
ABN , Publish Date - Apr 18 , 2026 | 12:56 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు శనివారం ఉదయం ఆర్కే బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభం కానున్నాయి.
నేటి నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం శత వసంతాల వేడుకలు
ఆర్కే బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాలులో ప్రారంభం
27న ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ముగింపు
ముఖ్య అతిథులుగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి కె.పవన్ కల్యాణ్, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్ హాజరు
విశాఖపట్నం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు శనివారం ఉదయం ఆర్కే బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26వ తేదీ వరకూ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. విశిష్ట అతిథుల ప్రసంగాలు, విశిష్ట స్థానాల్లో నిలిచిన పూర్వ విద్యార్థులకు సన్మానాలు, సత్కారాలు, అవగాహన ఒప్పందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ముగింపు వేడుకలు మాత్రం 27వ తేదీన ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీఎత్తున నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రముఖ మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ హాజరుకానున్నారు. అలాగే, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి కె.పవన్ కల్యాణ్, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్‌తోపాటు పూర్వ విద్యార్థుల సంఘంలో కీలకంగా ఉన్న ప్రముఖులు ఎంతోమంది హాజరుకానున్నారు. ముగింపు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా 25 వేల మంది తిలకించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జోరుగా సాగుతున్నాయి. ఈ పనులను ఏయూ అధికారులు, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముగింపు వేడుకలకు రెండు రోజులు ముందే సభా ప్రాంగణం సిద్ధమవుతుందని చెబుతున్నారు.
వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు
అధికారులకు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆదేశం
వందేళ్ల చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పేలా ఉత్సవాల నిర్వహణ
27న ముగింపు కార్యక్రమ పర్యవేక్షణకు రెండు కమిటీలు
ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోని ప్రధాన వేదిక పరిసరాలతో పాటు బీచ్‌రోడ్డులో, ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు
విశాఖపట్నం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు చేయడంతోపాటు విజయవంతం చేసేందుకు ప్రణాళికాయుతంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. 27న నిర్వహించనున్న ఉత్సవాల ముగింపు వేడుకలపై జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, ఏయూ ఉపకులపతి ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్‌తో కలిసి శుక్రవారం ఆయన సెనేట్ హాల్‌లో జిల్లా అధికారులు, యూనివర్సిటీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో వర్చువల్‌గా పాల్గొన్న విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ భరత్ గుప్తా పలు సూచనలు చేశారు. తొలుత ఏయూ తరఫున చేయబోయే కార్యక్రమాలను, ప్రాథమిక ప్రణాళికలను వీసీ జీపీ రాజశేఖర్ వివరించారు. ముగింపు వేడుకలను ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహించడానికి నిర్ణయించామని, సుమారు 25 వేల మంది భాగస్వామ్యం కానున్నారని, మధ్యాహ్నం నాలుగు గంటలు నుంచి కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. ముగింపు వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, మాజీ క్రికెటర్ సచిన్ టెండ్కులర్ అతిథులుగా హాజరవుతున్నట్టు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. అడ్వైజరీ (సలహా) కమిటీలో యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని, వర్కింగ్ (నిర్వహణ) కమిటీ జిల్లా యంత్రాంగం, యూనివర్సిటీ అధ్యాపకులతో సమన్వయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ముగింపు వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ హాజరుకానున్న నేపథ్యంలో ప్రొటోకాల్, భద్రతాపరమైన అంశాల్లో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, సాధారణ పౌరులు మధ్యాహ్నం రెండు గంటలకే తమకు కేటాయించిన స్థానాల్లో కూర్చునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఏయూ వందేళ్ల చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి మినిట్ టు మినిట్ షెడ్యూల్ తయారు చేయాలని జేసీకి సూచించారు. గ్యాలరీల్లోనే కాకుండా ప్రధాన వేదిక పరిసరాల్లో, బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాలులో, బీచ్ రోడ్డులో ప్రత్యేక ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా యంత్రాంగం, ఏయూ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో రిజిస్ర్టార్ ప్రొఫెసర్ కె.రాంబాబు, రెక్టార్ ప్రొఫెసర్ పి.కింగ్, ఏయూలోని కాలేజీల ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు, ప్రొఫెసర్ జాలాది రవి, ప్రొఫెసర్ సీతామాణిక్యంతోపాటు పలువురు సీనియర్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.