Share News

ఏకలవ్యలో ప్రవేశాలకు వేళాయె!

ABN , Publish Date - May 05 , 2026 | 12:40 AM

ఆదివాసీ విద్యార్థులకు ఇంటర్మీడియట్‌లో కార్పొరేటు స్థాయి విద్యను అందించేందుకు గిరిజన సంక్షేమశాఖ గురుకులం, ఏకలవ్య ఆదర్శ నివాసానుబంధ కళాశాలలు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. విద్యార్థులకు రెండేళ్ల పాటు ఉచిత విద్య, భోజన వసతి కల్పించడంతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో పోటీ పరీక్షలకు అవసరమైన కోచింగ్‌ అందిస్తున్నారు. ప్రభుత్వం ఏడాదికి ఒక విద్యార్థిపై రూ.1.4 లక్షల నుంచి రూ.1.8 లక్షల వరకు ఖర్చు చేస్తున్నది. గురుకులం, ఈఎంఆర్‌ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తుండడంతో సీట్లకు డిమాండ్‌ పెరిగింది.

ఏకలవ్యలో ప్రవేశాలకు వేళాయె!
చింతపల్లి ఈఎంఆర్‌ కళాశాల

- గురుకుల కళాశాలల్లో కూడా..

- దరఖాస్తుల స్వీకరణకు 20వ తేదీతో ముగియనున్న గడువు

చింతపల్లి, మే 4 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ విద్యార్థులకు ఇంటర్మీడియట్‌లో కార్పొరేటు స్థాయి విద్యను అందించేందుకు గిరిజన సంక్షేమశాఖ గురుకులం, ఏకలవ్య ఆదర్శ నివాసానుబంధ కళాశాలలు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. విద్యార్థులకు రెండేళ్ల పాటు ఉచిత విద్య, భోజన వసతి కల్పించడంతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో పోటీ పరీక్షలకు అవసరమైన కోచింగ్‌ అందిస్తున్నారు. ప్రభుత్వం ఏడాదికి ఒక విద్యార్థిపై రూ.1.4 లక్షల నుంచి రూ.1.8 లక్షల వరకు ఖర్చు చేస్తున్నది. గురుకులం, ఈఎంఆర్‌ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తుండడంతో సీట్లకు డిమాండ్‌ పెరిగింది.

జిల్లాలోని పదకొండు మండలాల్లో ఏపీటీడబ్ల్యూ గురుకులం కళాశాలలు బాలికలకు మూడు(అరకు, పాడేరు, జీకేవీధి), బాలురకు ఐదు(అరకు, చింతపల్లి, జి.మాడుగుల, కొయ్యూరు, పెదబయలు) ఉన్నాయి. ప్రతి మండలంలో ఒక ఈఎంఆర్‌ కళాశాల ఉంది. ఏపీటీడబ్ల్యూ గురుకులం కళాశాలల్లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులతో పాటు చింతపల్లి గురుకుల కళాశాలలో బాలురకు అదనంగా ఒకేషనల్‌ కోర్సు అకౌంట్స్‌ అండ్‌ ట్యాక్స్‌(ఏఎన్‌టీ), పాడేరు గురుకుల కళాశాలలో బాలికలకు కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ అండ్‌ యానిమేషన్‌(సీడీఏ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈఎంఆర్‌ కళాశాలలో ప్లస్‌టూ సీబీఎస్‌ఈ సిలబస్‌తో కూడిన ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈజీ గ్రూప్‌లు ఉన్నాయి. గురుకుల కళాశాలలో ఒక్కొక్క గ్రూపులో 40 సీట్లు, ఈఎంఆర్‌ కళాశాలలో ఒక గ్రూపునకు 30 సీట్లు ఉన్నాయి. ఈఎంఆర్‌ కళాశాలలో స్థానిక పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సీట్లు కేటాయించగా, మిగిలిన సీట్లు ఇతర విద్యార్థులకు పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా కేటాయిస్తారు. ఏపీటీడబ్ల్యూ గురుకుల కళాశాలల్లోనూ దరఖాస్తు చేసుకున్న విద్యార్థినీ, విద్యార్థులకు పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్‌ పద్ధతిలో సీట్లు కేటాయిస్తారు.

ఎవరు అర్హులంటే..

జిల్లాలో పదకొండు మండలాలకు చెందిన గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు మాత్రమే ఏపీ టీడబ్ల్యూ గురుకుల కళాశాలలు, ఈఎంఆర్‌ కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు అర్హులు. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్ష మించి ఉండరాదు. తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉండాలి. ఏపీటీడబ్ల్యూ గురుకుల కళాశాల, ఈఎంఆర్‌ కళాశాలల్లో ఒక గ్రూపులో ఎస్సీ, బీసీ, ఓసీకి ఒక్కొక్క సీటు కేటాయిస్తారు. గురుకుల కళాశాలలో ఏజెన్సీ ఉద్యోగి పిల్లలకు ఒక సీటు ఉంటుంది.

దరఖాస్తు ఎలా చేయాలంటే..

ఏపీటీడబ్ల్యూ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థినీ, విద్యార్థులు గురుకులం వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈఎంఆర్‌ ప్రవేశాలకు సంబంధిత కళాశాలకు నేరుగా వెళ్లి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గురుకుల కళాశాలలో ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసేందుకు విద్యార్థులు పదవ తరగతి హాల్‌ టికెట్‌, మార్కుల మెమో, ఆధార్‌ కార్డు, కులం, ఆదాయం ధ్రువపత్రాలు, రేషన్‌ కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, సంతకం అప్‌లోడ్‌ చేయాలి. ఈఎంఆర్‌ కళాశాలకు దరఖాస్తు సంబంధిత పత్రాలు జతపర్చాల్సి వుంటుంది.

అందుబాటులో ఉన్న సదుపాయాలు

ఏపీటీడబ్ల్యూ గురుకులం, ఈఎంఆర్‌ కళాశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన అందిస్తారు. తరగతి గదిలో డెస్క్‌లు, వసతి గృహాల్లో బంకర్‌ బెడ్లు ఉన్నాయి. రోజూ ప్రత్యేక మెనూ ఆధారంగా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, సాయంత్రం స్నాక్స్‌ అందిస్తున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, టవల్‌, బ్లాంకెట్‌, బెడ్‌షీట్‌, షూ పంపిణీ చేస్తారు. విద్యార్థులకు విశాలమైన క్రీడా మైదానం, లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు నీట్‌, జేఈఈ మెయిన్స్‌, ఎంసెట్‌ కోచింగ్‌ ఇస్తున్నారు.

Updated Date - May 05 , 2026 | 12:40 AM