Share News

ఫుడ్‌ లేబొరేటరీలో అదే తీరు.!

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:07 AM

స్టేట్‌ ఫుడ్‌ లేబోరేటరీ సేవలు వినియోగించుకోవడంపై అధికారుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది.

 ఫుడ్‌ లేబొరేటరీలో  అదే తీరు.!

పరికరాలు ఉన్నా పరీక్షలు అంతంతే

నెలకు వందకు మించి నమూనాలు పంపని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు

ప్రైవేటు ల్యాబులకు వందలాది నమూనాలు..

రూ. లక్షల్లో ఫీజుల చెల్లింపు

సిబ్బంది కొరతే కారణమంటున్న అధికారులు

విశాఖపట్నం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి):

స్టేట్‌ ఫుడ్‌ లేబోరేటరీ సేవలు వినియోగించుకోవడంపై అధికారుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత మంజూరైన ఈ ల్యాబ్‌ను సుమారు రూ.20 కోట్ల వ్యయంతో పెదవాల్తేరులోని ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాల ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. సుమారు ఐదేళ్లు నత్తనడకన సాగిన భవన నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తై అందుబాటులోకి వచ్చినా, ల్యాబొరేటరీ ప్రారంభానికి నోచుకోలేదు.

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా దీనిని ప్రారంభించారు. అయినప్పటికీ వినియోగంలోకి తేవడానికి అధికారులు మరో ఏడాదిన్నర గడిపేశారు. ల్యాబ్‌ను పట్టించుకోవడం లేదని మీడియాలో కథనాలు రావడం, స్థానిక బీజేపీ నాయకులు ఆందోళ నలు చేయడంతో ఎట్టకేలకు గత ఏడాది డిసెంబరులో ప్రారంభించారు. ఇప్పటికీ అరొకర పరీక్షలను నిర్వహిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సేవలపై కొరవడిన ప్రచారం

స్టేట్‌ ఫుడ్‌ లేబొరేటరీ కావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఫుడ్‌ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు సేకరించిన నమూనాలను పరీక్షల నిమ్తితం ఇక్కడకు పంపించాలి. పోలీసులు, ప్రైవేటు వ్యక్తులు, ఎగుమతి, దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తుల నమూనాలను ఇక్కడే పరీక్షలు చేయించుకోవచ్చు. కానీ ల్యాబ్‌ సేవలపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో ఆశించిన స్థాయిలో నమూనాలు రావడం లేదు. ల్యాబ్‌ అందుబాటులోకి రావడానికి ముందు ప్రతినెలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఫుడ్‌ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు సేకరించిన సుమారు 1,000 నుంచి 1,500 వరకు నమూనాలు హైదరాబా ద్‌లోని స్టేట్‌ఫుడ్‌ ల్యాబ్‌, ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలకు పంపించే వారు. ఇక్కడ సేవలు ప్రారంభమైన తరువాత నెలకు 100కు మించి నమూనాలు రావడం లేదని సమాచారం. దీనికి కారణం ఫుడ్‌ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులకు ఆదేశాలు లేకపోవడమేనని చెబుతున్నారు. ఫుడ్‌సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు సేకరించే నమూనాలు స్టేట్‌ఫుడ్‌ లేబ్‌లో పరీక్షించేందుకు రూ.200 చెల్లించాలి. ప్రైవేటు ల్యాబ్‌లకు పంపితే రూ.5 వేల నుంచి రూ.10 వేలు చెల్లించాలి. దీంతో ఫుడ్‌ సేఫ్టీ విభాగానికి భారీ నష్టమని చెబుతున్నారు.

నిరుపయోగంగా పరికరాలు..

ల్యాబ్‌ ప్రారంభం కావడానికి ముందే సుమారు రూ.15 కోట్ల విలువజేసే అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేశారు. అత్యంత ఖరీదు చేసే కెమికల్స్‌ మంజూరు చేశారు. పరీక్షల నిర్వహణకు నమూనాలు రాకపోవడంతో ఇవన్నీ వృథాగా మారుతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం ల్యాబ్‌లో ఇద్దరు సైంటిఫిక్‌ ఆఫీసర్లు, ముగ్గురు జూనియర్‌ అనలిస్టులు, ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లు, సిబ్బందితో 16 మంది పని చేస్తున్నారు. మరో 12 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఎనిమిది మంది జూనియర్‌ అనలిస్టులు, నలుగురు సైంటిఫిక్‌ ఆఫీసర్లు, ఆరుగురు స్వీపర్లు, ఇద్దరు వాచ్‌మన్లు, సాంకేతిక సిబ్బంది కలిపి మొత్తం 40 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. దీంతోపాటు అన్ని జిల్లాల నుంచి నమూనాలు వచ్చేలా చూస్తే ల్యాబ్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చినట్టు.

మూలకు చేరిన వాహనం

స్టేట్‌ ఫుడ్‌ల్యాబ్‌కు రూ.45 లక్షల విలువచేసే ఫుడ్‌సేఫ్టీ ఆన్‌వీల్స్‌ వాహనం కేటాయించారు. దీనిద్వారా ఆహార భద్రతకు సంబంధించి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. సుదూర ప్రాంతాలకు వెళ్లి నమూనాలు సేకరించేందుకు వినియోగించాలి. అయితే పది నెలలుగా ఈ వాహనం మూలన ఉంది. దీనికి రిజిస్ర్టేషన్‌ కూడా చేయించలేదు. వాహనం నడిపేందుకు డ్రైవర్‌ పోస్టు మంజూరు చేయలేదు. దీంతో వాహనాన్ని వినియోగించలేని పరిస్థితి.

Updated Date - Aug 17 , 2026 | 12:07 AM