గొంతెండుతోంది!
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:40 PM
జిల్లాలో వేసవి ప్రారంభంలోనే తాగునీటి ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. దీంతో రానున్న రోజుల్లో నీటికి మరింత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తాయేమోనని జనం ఆందోళన చెందుతున్నారు.
వేసవి ప్రారంభంలోనే తాగునీటి కష్టాలు
జల్ జీవన్ మిషన్ పనులు అసంపూర్తిగా ఆగడమే కారణం?
గిరి పల్లెలకు సాకారం కాని ఇంటింటా కొళాయి
రానున్న రోజుల్లో మరింత ఇబ్బందులు తప్పని ప్రజల్లో ఆందోళన
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో వేసవి ప్రారంభంలోనే తాగునీటి ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. దీంతో రానున్న రోజుల్లో నీటికి మరింత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తాయేమోనని జనం ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా తాగునీటిని అందించాలనే లక్ష్యంతో మొదలైన జల్ జీవన్ మిషన్ పనులు సుమారుగా ఆరు నెలలుగా నిలిచిపోవడమే ఇందుకు కారణంగా పలువురు చెబుతున్నారు. అయితే ఈ సమస్యను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించకపోతే తాగునీటి సమస్య మరింత జఠిలమవుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 22 మండలాల పరిధిలో 7,185 పనుల ద్వారా 2 లక్షల 64 వేల 766 ఇళ్లకు కొళాయిల ద్వారా తాగునీరు అందించేందుకు రూ.626 కోట్లు మంజూరయ్యాయి. ఆయా పనులను గత నాలుగేళ్లుగా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు కాంట్రాక్టర్లతో చేయిస్తున్నారు. ప్రస్తుతానికి రూ.131 కోట్ల పనులు మాత్రమే జరగ్గా 96 వేల ఇళ్లకు కొళాయిల ద్వారా తాగునీటిని అందించారు. అయితే జిల్లా వ్యాప్తంగా గత ఏడాదిన్నర కాలంలో రూ.26 కోట్ల విలువ చేసే 443 పనులు జరగ్గా, వాటికి సంబంధించి పది నెలలుగా ఎటువంటి బిల్లులు విడుదల కాలేదు. దీంతో ఆయా పనులు వివిధ దశాల్లో అసంపూర్తిగా నిలిచిపోయాయి. వాస్తవానికి విడతలుగా బిల్లులు మంజూరైతే పనులు జోరందుకుంటాయి. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడంతో ఏడాది కాలంగా 443 పనులు అందుబాటులోకి రాని పరిస్థితిలో వేలాది కుటుంబాలకు ఇంటింటా కొళాయి ద్వారా నీళ్లు అందని దుస్థితి కొనసాగుతున్నది.
వేసవితో తీవ్రం కానున్న తాగునీటి వెతలు
జిల్లాలో వేసవి ప్రారంభంలోనే అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు ఉత్పన్నం కావడంతో రానున్న రోజుల్లో పరిస్థితులపై జనం ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి జల్ జీవన్ మిషన్‌లో చేపడుతున్న పనులకు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులను విడుదల చేస్తే పనులు జరిగి అనేక గ్రామాలకు తాగునీటి సౌకర్యం కలిగి ఉండేది. కానీ అందుకు భిన్నంగా అరకొరగా జరిగిన పనులకే బిల్లులు విడుదల కాకపోవడంతో గతేడాది మే నాటికి పూర్తికావాల్సిన వందల సంఖ్యలో పనులు నేటికీ జరగలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో గిరిజనులకు తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయి. కాగా ఈ ఏడాది ఎండలు సైతం అధికంగా ఉంటాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో భవిష్యత్తులో తాగునీటి సమస్యలు ఎక్కువతాయని స్పష్టమవుతున్నది.