Share News

కదిలేదే... లే!

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:52 AM

జీవీఎంసీ మెకానికల్‌ విభాగంలోని అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి వ్యవహారశైలి వివాదాలకు దారితీస్తోంది.

కదిలేదే... లే!

బదిలీ చేసినా సీటు మారని అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి

జీవీఎంసీ మెకానికల్‌ విభాగంలో కొనసాగుతున్న హవా

ఏళ్ల తరబడి ఒకేచోట విధులు

ఇటీవల ఉత్తరజోన్‌కు బదిలీచేసిన అధికారులు

అయినా పాతసీటులోనే కొనసాగుతున్న వైనం

అధికారుల అండదండలే కారణమని ఆరోపణలు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ మెకానికల్‌ విభాగంలోని అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి వ్యవహారశైలి వివాదాలకు దారితీస్తోంది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న చోటు నుంచి మరో చోటుకు అధికారులు బదిలీచేసినా, వెళ్లకుండా అదేచోట పనిచేస్తుండడం ఆ విభాగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారుల అండదండలు కారణంగానే బదిలీ జరిగిన చోటకు వెళ్లకుండా గతంలో పనిచేసిన పోస్టులోనే కొనసాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మెకానికల్‌ విభాగంలో కొందరు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఏళ్లతరబడి ఒకేచోట పనిచేస్తుండడంతో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాహనాలకు పెట్రోల్‌ డీజిల్‌ సరఫరా వ్యవహారాలు, చెత్త తరలింపు, రోడ్డు శుభ్రంచేసే వాహనాలకు జీపీఎస్‌ స్టేట్‌మెంట్‌ తీయడం, కాంట్రాక్టర్లకు బిల్లులు నమోదుచేయడం, బిల్లులను వివిధ విభాగాల అధికారుల వద్దకు తీసుకెళ్లి సంతకాలు చేయించడం వంటి పనులన్నీ వారే చక్కబెట్టేవారు. ఈ క్రమంలో అధికారులను గుప్పిట్లో పెట్టుకుని జీవీఎంసీకి నష్టం కలిగించేలా చర్యలు చేపడుతున్నట్టు బహిరంగంగా ఆరోపణలు వినిపించేవి. కొంతమంది సిబ్బంది అక్రమ సంపాదనతో ఏకంగా పెట్రోల్‌బంకులు పెట్టుకున్నారని, భారీ వాహనాలను కొనుగోలుచేసి జీవీఎంసీకే అద్దెకు ఇస్తుండడంపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమమైంది. దీనిపై స్పందించిన అధికారులు మెకానికల్‌ విభాగంలో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న 17 మంది వర్క్‌ఇన్‌స్పెక్టర్లు/సూపర్‌వైజర్లను వేర్వేరుజోన్‌లకు బదిలీచేసిన విషయం తెలిసిందే. అధికారుల ఆదేశాల ప్రకారం బదిలీ అయిన వారంతా కొత్తపోస్టుల్లో చేరిపోయారు.

బదిలీ చేసినా బేఖాతరు

కాగా ప్రధాన కార్యాలయంలో మెకానికల్‌ విభాగం ఆధ్వర్యంలో పనిచేసే వాహనాలకు జీపీఎస్‌లు తీయడం, వాటిని ఎంబుక్‌లో రికార్డుచేసి అధికారుల సంతకాలు చేయించడం వంటి పనులు చూసే ఒక వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ను ఉత్తరజోన్‌కు బదిలీచేశారు. బదిలీ జరిగి వారం రోజులు గడుస్తున్నా సదరు వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ గతంలో తాను పనిచేసిన చోటనే కొనసాగుతుండడం విశేషం. ఈ వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ తన కుటుంబసభ్యుల పేర్లతో రెండు జేసీబీలను కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకం కింద తీసుకుని, జీవీఎంసీకి అద్దెకు ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. ఆ రెండు జేసీబీలు పెద్దగా పనిచేయకపోయినా ఎక్కువ పనిచేసినట్టు, రికార్డులను ట్యాంపర్‌చేసి బిల్లులు చేసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. అలాగే నగరంలో చెత్త తరలించే 6 సీఎంటీ, 14 సీఎంటీ సామర్థ్యం కలిగిన కాంపాక్టర్‌ వాహనాల జీపీఎస్‌లను కూడా సదరు వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ తీసి కాంట్రాక్టర్‌కు లాభం చేకూరేలా బిల్లు సిద్ధంచేసి అధికారులతో సంతకాలు చేయిస్తున్నట్టు ఆ విభాగం సిబ్బందే చెబుతున్నారు. దీనికోసం మెకానికల్‌ విభాగంలోని కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు అందరికీ కమీషన్లు కూడా అందజేస్తున్నట్టు ఇంజనీరింగ్‌ విభాగం సిబ్బంది బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల అండదండలతోనే బదిలీ జరిగినా పాతచోటనే విధులు నిర్వర్తించగలుగుతున్నాడని ఆరోపిస్తున్నారు.

Updated Date - Jun 08 , 2026 | 12:52 AM