తగ్గేదేలే!
ABN , Publish Date - Jan 17 , 2026 | 01:07 AM
సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలోని పలు మండలాల్లో యథేచ్ఛగా కోడిపందేలు, గుండాట, పేకాట నిర్వహిస్తున్నారు. పండుగ ముసుగులో జూదాలు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుహిన్ సిన్హా చేసిన హెచ్చరికలను బేఖాతరు చేశారు. కిందిస్థాయిలో పోలీసు అధికారులు, సిబ్బంది సైతం పట్టించుకున్న దాఖలాలు లేవు. భారీ స్థాయిలో కోడిపందేలు, గుండాలు నిర్వహించిన ప్రదేశాలవైపు కన్నెత్తి అయినా చూడలేదు... చూసే సాహసం కూడా చేయలేదు.
పోలీసుల ఆదేశాలు బేఖాతరు
జోరుగా కోడిపందేలు, గుండాట, పేకాట
పెద్ద మొత్తంలో చేతులు మారిన నగదు
పోలీసు అధికారుల హెచ్చరికలు బేఖాతరు
అనకాపల్లి/ అచ్యుతాపురం/ సబ్బవరం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలోని పలు మండలాల్లో యథేచ్ఛగా కోడిపందేలు, గుండాట, పేకాట నిర్వహిస్తున్నారు. పండుగ ముసుగులో జూదాలు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుహిన్ సిన్హా చేసిన హెచ్చరికలను బేఖాతరు చేశారు. కిందిస్థాయిలో పోలీసు అధికారులు, సిబ్బంది సైతం పట్టించుకున్న దాఖలాలు లేవు. భారీ స్థాయిలో కోడిపందేలు, గుండాలు నిర్వహించిన ప్రదేశాలవైపు కన్నెత్తి అయినా చూడలేదు... చూసే సాహసం కూడా చేయలేదు. అక్కడక్కడా గ్రామాల శివార్లలోని తోటలు, ఖాళీ స్థలాల్లో నిర్వహిస్తున్న కోడిపందేలపై మొక్కుబడిగా దాడులు చేసి కొద్దిమంది జూదరులను పట్టుకున్నారు. ప్రధానంగా అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవవర్గాల పరిధిలో కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంక్రాంతి సంబరాల మాటున పెద్దఎత్తున జూద క్రీడలను ప్రోత్సహించడంతో పోలీసులు ఇరకాటంలో పడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్లి మండలం వెంకటాపురం, అచ్యుతాపురం మండలం చోడపల్లిల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోకూటమికి చెందిన జనసేన, టీడీపీ నేతలు వేర్వేరుగా బరులు ఏర్పాటు చేసి మూడు రోజులపాటు కోడిపందేలు, గుండాటలు నిర్వహించారు. కోడిపందేల కన్నా గుండాటల్లో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయి.
వెంకటాపురంలో నాలుగు కోడిపందేల బరులు, 16 గుండాట బల్లలు, అచ్యుతాపురం మండలం చోడపల్లిలో నాలుగు కోడిపందెం బరులు, 12 గుండాట బల్లలు ఏర్పాటుచేశారు. మూడు రోజులకు లాటరీ బల్లలు నిర్వహించేవారు వెంకటాపురంలో గుండాట బల్లలు నిర్వహించేవారు మూడు రోజులకు ఒక బల్లకు రూ.3.5 లక్షలు, చోడపల్లిలో రూ.3 లక్షలు ఇవ్వటానికి ఒప్పందం చేసుకున్నారు. ఇక కోడి పందేల విషయానికివస్తే.. ఒకసారి పందెంలో కాసే డబ్బులనుబట్టి నాయకులు పర్సంటేజీలు వసూలు చేశారు. కోడిపుంజులకు కత్తులు కట్టకుండా పోటీలు నిర్వహించడం సంప్రదాయం. కానీ ఇక్కడ సంప్రదాయం మాటున, కోడిపుంజుల కాళ్లకు కత్తులు కట్టి పోటీలు (పందేలు) నిర్వహించారు. ఇక గుండాటల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఎలమంచిలి నియోజకవర్గంతోపాటు పాయకరావుపేట, అనకాపల్లి, పెందుర్తి, విశాఖ నగరం కూడా పెద్ద ఎత్తున పందెంరాయుళ్లు తరలివచ్చారు. కోడిపందేల వద్ద పురుషులతోపాటు మహిళలు కూడా వుండడం విశేషం. ఒకవేళ ఎవరైనా గొడవకు దిగితే.. అదుపుచేయడానికి బౌన్సర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో బౌన్సర్‌కు రోజుకి రూ.వెయ్యి వేతనంతోపాటు భోజనం, మద్యం అందించారు. సంబరాలు జరుగుతున్న ప్రదేశాల్లో నిర్వాహకులు అనధికారికంగా మద్యం అమ్మకాలు జరిపారు. మూడు రోజుల్లో ఒక్క పోలీసు అధికారిగానీ, కనీసం కానిస్టేబుల్‌గానీ ఈ ఛాయలకు వచ్చిన దాఖలాలు లేవు.
పాయకరావుపేట నియోకవర్గం వేంపాడు, అడ్డరోడ్డు ప్రాంతాల్లో కూడా కోడిపందేలు, గుండాటలు నిర్వహించారు. అనకాపల్లి నియోజకవర్గంలోని కశింకోట, అనకాపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో కోడిపందేలు జరిగాయి. గ్రామాలకు శివారుల్లోని తోటల్లో పేకాట డెన్‌లు ఏర్పాటు చేశారు. పోలీసుల డ్రోన్ కెమెరాలకు కూడా చిక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
సబ్బవరం మండలం అమృతపురం, మొగలిపురం, గంగవరం గ్రామాల్లో మూడు రోజులపాటు కోడి పందేలు, బల్లాటలు, కోతముక్క (పేకాట) భారీ ఎత్తున జరిగాయి. స్థానికులతోపాటు విశాఖ నగరం నుంచి పెద్ద సంఖ్యలో పందెంరాయుళ్లు కార్లు, ద్విచక్ర వాహనాల్లో తరలివచ్చారు. రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రధాన పార్టీల వారు కోడిపందేలను వీక్షించారు. బరుల వద్ద మద్యం, బిర్యానీ, కూల్ డ్రింక్స్ విక్రయాలు జోరుగా సాగాయి.
రోలుగుంట మండలంలో కుసర్లపూడి, ఎంకేపట్నం, కొంతలం, కొండపాలెం, అంట్లపాలెం, రోలుగుంట, శరభవరం, వడ్డిప, బుచ్చెంపేట గ్రామాల్లో కోడి పందేలను జోరుగా నిర్వహించారు. కుసర్లపూడి శివారు కాముడుపాలెం, ఎంకేపట్నంలో కోడిపందేల శిబిరాలపై ఎస్‌ఐ రామకృష్ణారావు ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి నలుగురిని అరెస్టు చేశారు. రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు.