Share News

వానొస్తే నరకమే!

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:19 PM

జీకేవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలోని దొరగొంది గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రోడ్డు బురదమయమై కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది.

వానొస్తే నరకమే!
దొరగొంది గ్రామ రహదారి బురదమయంగా ఉండడంతో ఇబ్బంది పడుతున్న వాహనచోదకులు

బురదమయంగా దొరగొంది రోడ్డు

పిల్లిగెడ్డ అప్రోచ్‌ రహదారి కూడా..

వాహనచోదకులకు తప్పని అవస్థలు

సీలేరు, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలోని దొరగొంది గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రోడ్డు బురదమయమై కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది.

దొరగొంది నుంచి గుమ్మిరేవులకు 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దొరగొంది గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్‌ కొంత మేర పనులు చేసి ఆ తరువాత అర్ధంతరంగా నిలిపివేశారు. కాగా గత నెల రోజులుగా ఈ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఈ రహదారి బురదమయమై అధ్వానంగా మారింది. దీంతో గ్రామస్థులు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణులు, అనారోగ్యానికి గురైన వారిని ఆస్పత్రికి తరలించాలంటే అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.

అధ్వానంగా పిల్లిగెడ్డ అప్రోచ్‌ రోడ్డు

ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లోని అంతర్రాష్ట్ర రహదారిని కలిపే పిల్లిగెడ్డ వంతెన అప్రోచ్‌ రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయమై వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల క్రితం తుఫాన్‌కు ఈ ప్రాంతంలోని పాత వంతెన కొట్టుకుపోవడం, దీంతో అప్పటికే నిర్మాణంలో ఉన్న కొత్త వంతెన పనులను యుద్ధప్రాతిపదిన పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే వంతెనకు ఇరువైపులా అప్రోచ్‌ రోడ్డుకు మాత్రం ఎర్రమట్టి పోసి వదిలేశారు. దీంతో ఈ ప్రాంతంలో వర్షాలు కురిసినప్పుడల్లా అప్రోచ్‌ రోడ్డు బురదమయమై వాహనదారులు నరకం చూస్తున్నారు. భారీ లోడు వాహనాలు అయితే ఇక్కడ బురదలో కూరుకుపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఈ ప్రాంతీయులు, వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - Aug 31 , 2026 | 11:19 PM