వానొస్తే నరకమే..
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:14 PM
ఆంధ్రా, ఒడిశా రాష్ర్టాలను కలిపే పిల్లిగెడ్డ వంతెన ఇటీవల కురిసిన వర్షాలకు అధ్వానంగా తయారైంది. ఈ వంతెన అప్రోచ్ రోడ్డును పక్కాగా నిర్మించకుండా మట్టి వేసి వదిలేయడంతో బురదమయంగా ఉంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పిల్లిగెడ్డ వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం
మట్టి వేసి వదిలేయడంతో వర్షాలకు బురదమయం
కూరుకుపోతున్న వాహనాలు
రెండు రాష్ట్రాల వాహనచోదకులకు ఇబ్బందులు
సీలేరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా రాష్ర్టాలను కలిపే పిల్లిగెడ్డ వంతెన ఇటీవల కురిసిన వర్షాలకు అధ్వానంగా తయారైంది. ఈ వంతెన అప్రోచ్ రోడ్డును పక్కాగా నిర్మించకుండా మట్టి వేసి వదిలేయడంతో బురదమయంగా ఉంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పిల్లిగెడ్డ పాత వంతెన 2024 సెప్టెంబర్ 8న ఇక్కడ సంభవించిన భారీ తుఫాన్ ప్రభావానికి కొట్టుకుపోయింది. అయితే అప్పటికే పిల్లిగెడ్డ వంతెన శిథిలావస్థకు చేరడంతో కొత్త వంతెన నిర్మాణం పనులు చేపడుతున్నారు. పాత వంతెన కొట్టుకుపోవడంతో యుద్ధప్రాతిపదికన కొత్త వంతెన పనులు పూర్తి చేశారు. అయితే వంతెన అప్రోచ్‌కు మట్టి మాత్రమే పోసి బీటీ వేయకుండా నిర్లక్ష్యం చేశారు. దీంతో గత రెండేళ్లుగా ఈ ప్రాంతంలో వర్షాలు కురిస్తే వాహనాలు కూరుకుపోయి ట్రాఫిక్ స్తంభిస్తోంది. గత రెండేళ్లుగా అధికారులకు ఈ ప్రాంతవాసులు ఎన్నోసార్లు విన్నవించుకున్నా ఇప్పటికీ పిల్లిగెడ్డ వంతెన అప్రోచ్ నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు అప్రోచ్ రోడ్డు బురదమయైు వాహనాలు కూరుకుపోతుండడంతో రెండు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పక్కాగా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.