జోరుగా సాగుతోంది సర్!
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:24 AM
భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో చేపడుతున్న ఓటరు జాబితాల స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ ఎట్టకేలకు జిల్లాలో జోరందుకుంది. జూన్ 15న మొదలైన సర్ ప్రక్రియను ఈ నెల 14 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. అయితే అనివార్య కారణాలతో జిల్లాలో మూడు రోజుల క్రితం వరకు కేవలం 44 శాతం మాత్రమే ఈ ప్రక్రియ పూర్తయింది.
- కేవలం మూడు రోజుల్లో 44 నుంచి 56 శాతానికి చేరిక
- భారత ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి ఎస్‌బీ జోషి పర్యటన
జిల్లా యంత్రాంగం నిరంతర పర్యవేక్షణే కారణం
పాడేరు, జూలై 7(ఆంధ్రజ్యోతి): భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో చేపడుతున్న ఓటరు జాబితాల స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ ఎట్టకేలకు జిల్లాలో జోరందుకుంది. జూన్ 15న మొదలైన సర్ ప్రక్రియను ఈ నెల 14 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. అయితే అనివార్య కారణాలతో జిల్లాలో మూడు రోజుల క్రితం వరకు కేవలం 44 శాతం మాత్రమే ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ తరుణంలో మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ టి.నిషాంతి ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ పలువురు బూత్ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లు పట్టనట్టు వ్యవహరించడంతో ఆగ్రహించిన కలెక్టర్ నిషాంతి కొయ్యూరు మండలంలో ఇద్దరు బీఎల్‌వోలను సస్పెండ్ చేస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై ఇవే చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. అలాగే జిల్లాలో సర్ ప్రక్రియ జరుగుతున్న స్థితిగతులపై భారత ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ఎస్‌బీ జోషి సైతం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువునాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. దీంతో కలెక్టర్ టి.నిషాంతి, జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు జిల్లాలోని పాడేరు, అరకులోయ నియోజకవర్గాల్లోని పదకొండు మండలాల్లోని తహశీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలను అప్రమత్తం చేసి రేయింబవళ్లు సర్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. దీంతో ఆదివారం నాటికి 44 శాతం ఉన్నది, మంగళవారం నాటికి 56 శాతానికి పెరిగింది. అయితే ఏజెన్సీలో గత వారం రోజులుగా వర్షాలు కురవడం, గ్రామాలు దూరంగా ఉండడం, ఇంటర్నెట్ సదుపాయాలు అరకొరగా ఉండడంతో ఓటర్ల ఎన్యుమరేషన్‌కు సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో మంగళవారం నాటికి సర్ ప్రక్రియ వివరాలు
---------------------------------------------------------------------------
వ.సం. మండలం మొత్తం ఓటర్లు ఓటర్ల డిజిటలైజేషన్
--------------------------------------------------------------------------
1. ముంచంగిపుట్టు 39,041 23,422
2. పెదబయలు 43,408 25,423
3. హుకుంపేట 45,871 26,551
4. డుంబ్రిగుడ 38,879 22,979
5. అరకులోయ 43,002 22,629
6. అనంతగిరి 38,464 22,876
7. జీకేవీధి 52,515 26,153
8. కొయ్యూరు 43,755 5,188
9. చింతపల్లి 65,462 34,451
10. జి.మాడుగుల 44,808 23,661
11. పాడేరు 44,547 26,095
------------------------------------------------------------------------------
మొత్తం 4,99,752 2,79,428 (56 శాతం)
------------------------------------------------------------------------------