పేరుకే పార్కింగ్ బిల్డింగ్!
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:11 AM
సిరిపురం జంక్షన్‌లో వీఎంఆర్‌డీఏ నిర్మించిన ‘ది డెక్’ పేరుకే మల్టీ లెవెల్ కారు పార్కింగ్ భవనం. అందులో ఒక్క వాహనం కూడా నిర్దేశించిన ప్రాంతంలో పార్కింగ్ చేయడం లేదు.
వాహనాలన్నీ బయటే...
ఇదీ ‘ది డెక్’ వద్ద పరిస్థితి
చెప్పేదొకటి, చేసేదొకటి
పార్కింగ్ అవసరాల కోసం సిరిపురం జంక్షన్ వద్ద కాంప్లెక్స్ నిర్మించిన వీఎంఆర్‌డీఏ
అందులో 80 శాతం వాణిజ్య సంస్థలకు కేటాయింపు
మిగిలిన 20 శాతం కూడా అసలు అవసరాలకు వినియోగించని వైనం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
సిరిపురం జంక్షన్‌లో వీఎంఆర్‌డీఏ నిర్మించిన ‘ది డెక్’ పేరుకే మల్టీ లెవెల్ కారు పార్కింగ్ భవనం. అందులో ఒక్క వాహనం కూడా నిర్దేశించిన ప్రాంతంలో పార్కింగ్ చేయడం లేదు. ఇప్పటివరకూ పెయిడ్ పార్కింగే ప్రారంభించలేదు. ప్రధాన ఉపయోగం మరిచి పూర్తిగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నారు. బయట చూస్తే వీఎంఆర్‌డీఏ ఉద్యోగ భవన్ చుట్టూ వాహనాలే. ఉదయం 11 గంటల తరువాత అక్కడ ఏ కార్యాలయానికి వెళ్లినా...వాహనం ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక, తిరిగి రోడ్డు మీదకు వచ్చి ఏ పక్కనో పెట్టుకోవలసి వస్తోంది. ఈ విధంగా ఉంది అక్కడి పరిపాలన తీరు.
నగరంలోని ప్రధాన జంక్షన్లలో వాహనాల పార్కింగ్ కోసం ప్రభుత్వ సంస్థలే తగిన ఏర్పాట్లు చేయాలని పాలకులు నిర్దేశించడంతో జీవీఎంసీ జగదాంబ జంక్షన్‌లో, వీఎంఆర్‌డీఏ సిరిపురం జంక్షన్‌లో ‘మల్టీ లెవెల్ కారు పార్కింగ్’ భవనాల నిర్మాణానికి నడుం కట్టాయి. జగదాంబ సెంటర్‌లో నిర్మాణం పూర్తయి చక్కగా ఉపయోగపడుతోంది. ఆ ప్రాంతానికి వాహనాల్లో వెళ్లేవారికి చక్కటి పార్కింగ్ సదుపాయం కల్పిస్తోంది. ఇక సిరిపురంలో వీఎంఆర్‌డీఏ నిర్మించిన భవనం (ది డెక్) ఇటీవలె శంకుస్థాపన చేసుకుంది. దానిని వాణిజ్యపరంగాను ఉపయోగించుకునేందుకు ఐటీ స్పేస్ వచ్చేలా నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 12 అంతస్థుల్లో మూడు బేస్‌మెంట్లు, రెండో అంతస్థును కేవలం పార్కింగ్ కోసం కేటాయించారు. మిగిలిన వాటిని ఆఫీస్‌ల కోసం ఇచ్చారు. వాటిలో జార్జియా యూనివర్సిటీ, భెల్ ఐటీ కంపెనీ, రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్, దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాల ఏర్పాటయ్యాయి. పార్కింగ్ మినహా అన్ని అంతస్థులు నిండిపోయాయి. అయితే నక్కపల్లిలో స్టీల్ ప్లాంటు పెడుతున్న ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ కంపెనీ తమకు తప్పనిసరిగా అందులో తగిన స్థలం ఇవ్వాలని ఒత్తిడి పెట్టడంతో పార్కింగ్ కోసం ఉద్దేశించిన రెండో అంతస్థును రూ.4.5 కోట్ల వ్యయంతో మార్పులు చేసి ఆఫీసు స్పేస్‌గా మార్చడానికి ఇటీవలె చర్యలు చేపట్టారు. దీనికి గత నెలలోనే బోర్డు ఆమోదం కూడా తెలిపింది.
పార్కింగ్ ప్రారంభించడం లేదు
ఈ భవనాన్ని పార్కింగ్ అవసరాల కోసం నిర్మించినా ఇంతవరకు అందులో పెయిడ్ పార్కింగ్ కోసం బోర్డులో చర్చ జరగనే లేదు. అధికారులు కూడా దానిపై ఆసక్తి లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. బయట చూస్తే వాహనాలు పెట్టుకోవడానికి స్థలం ఉండడం లేదు. భవనంలో మూడు సెల్లార్లు ఖాళీగా ఉన్నాయి. వాటిలో 200 కార్లు, 250 ద్విచక్ర వాహనాలు పెట్టుకోవచ్చు. వాటిని పెయిడ్ పార్కింగ్ కింద ప్రారంభిస్తే అనేక మందికి ఉపయోగపడుతుంది. రూ.100 కోట్లు వెచ్చించి నిర్మించిన భవనం ప్రయోజనం కూడా నెరవేరుతుంది. అధికారులు ఎప్పుడు మేల్కొంటారో మరి.