Share News

పెదబయలులో ఐటీడీఏ పీవో పర్యటన

ABN , Publish Date - Jul 06 , 2026 | 10:58 PM

మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల-1ను సోమవారం ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ సందర్శించారు. విద్యా ప్రమాణాలు, వసతి గృహ నిర్వహణ, పరిశుభ్రతను పరిశీలించారు.

పెదబయలులో ఐటీడీఏ పీవో పర్యటన
విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

ఆశ్రమ పాఠశాలలో వసతులపై ఆరా

విద్యార్థినుల అభ్యాసన సామర్థ్యం పరిశీలన

విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు ఆదేశం

పెదబయలు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల-1ను సోమవారం ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ సందర్శించారు. విద్యా ప్రమాణాలు, వసతి గృహ నిర్వహణ, పరిశుభ్రతను పరిశీలించారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ (ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ)లో భాగంగా గణితం, ఆంగ్లం చదవడం, రాయడం వంటి కనీస అభ్యాసన సామర్థ్యాన్ని స్వయంగా పరీక్షించారు. గణితంలోని చతుర్విద ప్రక్రియలను విద్యార్థినులకు వివరించి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ప్రతి విద్యార్థిని ప్రాథమిక స్థాయి నైపుణ్యాలను తప్పనిసరిగా సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం పాఠశాల మరుగుదొడ్లు, వసతి గృహ ం, స్టాక్‌రూమ్‌ను పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో వార్డెన్‌ను మందలించారు. ప్రతి రోజూ ఉదయం తొలి రెండు పీరియడ్లలో గణితం బోధించేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థినికి గణితంపై పట్టు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తక్షణమే ఆరోగ్య కేంద్రాలకు తరలించి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆయన వెంట మండల విద్యాశాఖాధికారి కృష్ణమూర్తి, గిరిజన సంక్షేమ సహాయ అధికారి స్వర్ణలత, ప్రధానోపాధ్యాయుడు నారాయణ ఉన్నారు. కాగా ఐటీడీఏ ఆదిత్యవర్మ తిరుగు ప్రయాణంలో ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి సర్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్‌డీ శ్యాంసుందర్‌, తహశీల్దార్‌ లక్ష్మయ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 10:58 PM