Share News

ఐటీడీఏ పీవో శ్రీపూజ సుడిగాలి పర్యటన

ABN , Publish Date - Jan 03 , 2026 | 10:39 PM

మండలంలో పాడేరు ఐటీడీఏ పీవో, జిల్లా ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాణి శ్రీపూజ శనివారం సుడిగాలి పర్యటన చేశారు. పలు పాఠశాలలు, పీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఐటీడీఏ పీవో శ్రీపూజ సుడిగాలి పర్యటన
పిరిబంద పాఠశాలలో విద్యార్థినిని అభినందిస్తున్న ఐటీడీఏ పీవో శ్రీపూజ

పాఠశాలల్లో విద్యార్థుల విద్యా సామర్థ్యం పరిశీలన

సుంకరమెట్ట పీహెచ్‌సీ హాజరుపట్టి, అవుట్‌ పేషెంట్‌ రిజిస్టర్‌ తనిఖీ

బొరకలవలసలో పట్టాదారు పాస్‌ పుస్తకాలు పంపిణీ

బోర్లు మరమ్మతులు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు ఆదేశం

ఎఫ్‌ఎల్‌ఎన్‌ అమలుపరచ లేదని లోతేరు హెచ్‌ఎంకు నోటీసు జారీ

అరకులోయ, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మండలంలో పాడేరు ఐటీడీఏ పీవో, జిల్లా ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాణి శ్రీపూజ శనివారం సుడిగాలి పర్యటన చేశారు. పలు పాఠశాలలు, పీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత సుంకరమెట్ట పీహెచ్‌సీని సందర్శించి హాజరుపట్టి, అవుట్‌ పేషెంట్‌ రిజిస్టర్‌లను పరిశీలించారు. ఆసుపత్రిలో డెలివరీలపై ఆరా తీశారు. అనంతరం కరకవలస, పిరిబంద పాఠశాలలను సందర్శించారు. విద్యార్థుల విద్యా సామర్ధ్యాలను పరిశీలించి, సంతృప్తి వ్యక్తంచేశారు. మండలంలో బలియగుడ అంగన్‌వాడీ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. సుంకరమెట్ట నుంచి కటికి జలపాతం వరకు రోడ్డు నాణ్యతా పనులను నిశితంగా పరిశీలించారు. మండలంలో బలియగుడ, బొరకలవలస, పెదవలస గ్రామాలలో చేతిబోరులు సరిగా పనిచేయడం లేదని గ్రామస్థులు పీవో దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారులను పీవో ఆదేశించారు. బొరకలవలసలో రీసర్వే ప్రాజెక్టు కింద పట్టాదారు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అభిప్రాయసేకరణ ఫోన్‌కాల్‌ వస్తే మంచి జరిగితే ఒకటి నొక్కండి.. లేకుంటే రెండు నొక్కండంటూ ఆమె రైతులకు సలహా ఇచ్చారు. ఈ పట్టాల ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, బ్యాంకు రుణాలు వంటివి పొందవచ్చునన్నారు. పీఎం జన్‌మన్‌ పథకం కింద నిర్మించిన గృహాలకు కొత్తగా ఎలక్ర్టికల్‌ మీటర్లు మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరారు. కార్యక్రమంలో లోతేరు సర్పంచ్‌ జి.కళావతి, తహశీల్దార్‌ కుమారుస్వామి, డీటీ గోవిందు, నవాన్‌బాబు, వీఆర్‌వో, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా లోతేరు గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమోన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో చదవడం, రాయడం సామర్ధ్యాలను పరిశీలించారు. పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎన్‌ అమలుపరచడం లేదని హెచ్‌ఎంకు నోటీసు జారీ చేశారు. డిప్యూటీ వార్డెన్‌ అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Jan 03 , 2026 | 10:39 PM