కాఫీ ఆకుల సేకరణకు ఐటీడీఏ అనుమతి
ABN , Publish Date - Mar 16 , 2026 | 11:53 PM
గిరిజన ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ఒక మండలంలో కాఫీ ఆకులు సేకరించేందుకు ఐటీడీఏ అనుమతించిందని గ్రీన్ ఆయూష్ సీఈవో పులి రాజేశ్ తెలిపారు.
ప్రయోగాత్మకంగా ఒక మండలంలోని రైతుల నుంచి కొనుగోలు
గ్రీన్ ఆయూష్ సీఈవో రాజేశ్
చింతపల్లి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ఒక మండలంలో కాఫీ ఆకులు సేకరించేందుకు ఐటీడీఏ అనుమతించిందని గ్రీన్ ఆయూష్ సీఈవో పులి రాజేశ్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ దినేశ్‌కుమార్‌తో కాఫీ ఆకుల సేకరణపై సోమవారం చర్చించామని, కలెక్టర్ పలు సూచనలు చేశారన్నారు. ఆదివాసీ కాఫీ రైతులకు ఆకుల ద్వారా ఉపాధి కల్పించేలా ఐటీడీఏతో ఒప్పందం కుదుర్చుకునేందుకు కలెక్టర్‌ను కలిశామని, తొలివిడతగా ఏజెన్సీ పదకొండు మండలాల్లో ఒక మండలాన్ని కాఫీ ఆకుల సేకరణకు అనుమతించాలని ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వర్లును కలెక్టర్ ఆదేశించారని చెప్పారు. ఐటీడీఏ కేటాయించిన మండలంలో రైతుల నుంచి కాఫీ ఆకులను సేకరించి లీఫ్ కాఫీ తయారీకి పంపిస్తామన్నారు. ప్రస్తుతం చింతపల్లి మండలంలోని రైతుల నుంచి సేకరించిన కాఫీ ఆకులతో 50 వేల లీఫ్ కాఫీ యూనిట్లు సిద్ధం చేశామన్నారు. అధిక మొత్తంలో లీఫ్ కాఫీని ఉత్పత్తి చేసేందుకు ఐటీడీఏతో ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు. కిలో కాఫీ ఆకులకు రైతులకు రూ.17.28 ధర చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఆయూష్ ప్రతినిధులు కనకరాజు, బుజ్జిబాబు, షేక్ రజక్ పాల్గొన్నారు.