అభివృద్ధి పథంలో ఐటీడీఏ
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:08 AM
గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల చెంతకు తీసుకువెళ్లడంలో స్థానిక ఐటీడీఏ ముందంజలో ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
కేంద్ర పథకాల అమలులో ముందంజ
- ప్రధానంగా పీవీటీజీలకు ఇళ్లు, మౌలిక సదుపాయాల కల్పన
- పీఎం జన్‌మన్‌లో మారుమూల ప్రాంతాలకు రోడ్లు, భవనాల నిర్మాణం
- ఆయా కార్యక్రమాల అమలులో ఐటీడీఏకు నీతి ఆయోగ్ అవార్డు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల చెంతకు తీసుకువెళ్లడంలో స్థానిక ఐటీడీఏ ముందంజలో ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఫలితంగా ఈ నెల 3న ఢిల్లీలో రాష్ట్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాడేరు ఐటీడీఏకు నీతి ఆయోగ్ అవార్డును ప్రదానం చేసింది. ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న నేపథ్యంలో గిరిజన ప్రాంతంలో కేంద్ర పథకాల అమలు తీరుపై ప్రత్యేక కథనం.
గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో 1974లో రాజ్యాంగం ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేశారు. వాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తాయి. ఆయా నిధులతో ఐటీడీఏ అధికారులు గిరిజనులకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడతారు. ఇందులో భాగంగా స్థానిక ఐటీడీఏ పరిధిలోని పదకొండు మండలాల్లో 6 లక్షల 85 వేల మంది గిరిజనుల కోసం పలు పథకాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీలో ప్రధానమంత్రి జన్‌మన్ యోజనలో 1,037 పీవీటీజీల గ్రామాల్లోని 28 వేల 691 ఆదిమ జాతి గిరిజన కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం, జల్ జీవన్ మిషన్‌లో భాగంగా 3,482 కుటుంబాలకు కొళాయిల ద్వారా నీటి సదుపాయం, 1,151 ఆవాసాల్లో సెల్ టవర్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. పీఎం జన్‌మన్‌లో భాగంగా 146 ప్రాంతాలకు రూ.393 కోట్లతో 423 కిలో మీటర్ల పక్కా తారురోడ్డు నిర్మాణం, రూ.2.76 కోట్లతో 23 అంగన్‌వాడీ భవనాలు, రూ.21 కోట్లతో 35 మల్టీపర్పస్ భవనాలు నిర్మించారు. ఆదిమ జాతి గిరిజనుల కోసం 8 ప్రాంతాల్లో పీఎం వన్‌దన్ వికాస కేంద్రాలను ఏర్పాటు వాటి ద్వారా 400 కుటుంబాలకు స్వయం ఉపాధి కల్పిస్తున్నారు. పీఎం జన్ భగీధారి అభియాన్‌లో భాగంగా 252 గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పన, 655 మందికి కొత్తగా ఆధార్ కార్డుల జారీ, 657 మందికి పీఎం గరీభ్ కల్యాణ యోజన, 2073 మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు, 526 మందికి పీఎం కిసాన్‌కార్డులు, 717 మందికి పీఎం జీవన్‌జ్యోతి బీమా యోజన, 649 మందికి పెన్షన్ యోజన, 442 మందికి సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను అందించారు. అలాగే ఏజెన్సీ వ్యాప్తంగా 2 లక్షల 52 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న లక్షా 40 వేల మందిని ఐటీడీఏ ద్వారా ప్రోత్సహించడం, ఆశ్రమ పాఠశాలల ద్వారా సుమారుగా 76 వేల మంది గిరిజన విద్యార్థులకు ఆశ్రమ విద్య అందించడం, టెన్త్ విద్యార్థుల కోసం సూపర్- 50, టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి ప్రత్యేక కోచింగ్‌లు, గిరిజనులకు సంబంధించినవి డిజిటల్ డాక్యుమెంటేషన్, టెక్నాలజీ, ఈ-గవర్నెనెస్, పర్యాటకం, జీవనోపాధుల కల్పన, గిరిజన అభర్థులకు సివిల్ సర్వీస్ కోచింగ్ వంటివి చేపడుతున్నందుకు గాను జాతీయ స్థాయి నీటి ఆయోగ్ పాడేరు ఐటీడీఏకు అవార్డు ప్రకటించింది. ఈ నెల 3న కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఏపీవో వెంకటేశ్వరరావు ఉత్తమ అవార్డును నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్‌కుమార్, కేంద్ర గిరిజన వ్యవహారాల కార్యదర్శి రంజనా చోప్రా చేతుల మీదుగా అందుకున్నారు.