Share News

వేటకు వేళాయె

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:55 AM

మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

వేటకు వేళాయె

నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలోకి బోట్లు

భారంగా డీజిల్‌ ధరలు

అందులోనూ పరిమితులు

బోటుకు వేయి లీటర్లే సరఫరా

వారం రోజుల వేటకే ఏర్పాట్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేంద్రం ప్రభుత్వం విధించిన 61 రోజుల వేట నిషేధం ఆదివారం అర్ధరాత్రితో ముగుస్తుంది. ఆ మరుక్షణమే బోట్లతో వేటకు వెళ్లడానికి సరంజామా సర్దుకున్నారు. ఈసారి డీజిల్‌ ధరలు పెరగడం, రేషన్‌ విధించడంతో వారం రోజులే వేటకు వెళ్లి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. గతంలో పెద్ద పెద్ద బోట్లు రెండు వారాలు సముద్రంలో ఉండి వేట సాగించేవి. ఇందుకోసం ఐదు వేల లీటర్ల డీజిల్‌ పోయించుకునేవారు.

పశ్చిమ ఆసియా దేశాల యుద్ధ ప్రభావం వల్ల డీజిల్‌ సరఫరాపై కేంద్రం ఆంక్షలు విధించింది. రహదారులపై ప్రయాణించే వాహనాలకు రోజుకు 200 లీటర్లు మాత్రమే ఇవ్వాలని తాజాగా ఆదేశించింది. చేపల వేటకు వెళ్లే బోట్లకు ఎంత ఇవ్వాలనేది స్పష్టం చేయకపోయినా బంకు యజమానులు మాత్రం బోటుకు వేయి లీటర్ల కంటే ఎక్కువ ఇవ్వలేమని ప్రకటించి, ఆ మేరకు సరఫరా చేస్తున్నారు. గతంలో ఆయిల్‌ కంపెనీలు బంకులకు ఎన్ని ట్యాంకర్లు కావాలంటే అన్ని పంపించేవి. ఇప్పుడు పరిమితంగా ఇస్తున్నాయి. ఫిషింగ్‌ హార్బర్‌లో ఒక బంకుకు రోజుకు 40 వేల లీటర్ల ట్యాంకునే పంపుతున్నారు. దాంతో బోటుకు వేయి లీటర్ల చొప్పున రోజుకు 40 బోట్లకు డీజిల్‌ ఇస్తున్నారు. ఒక్కో బోటు సగటున రోజుకు 100 నుంచి 300 లీటర్ల డీజిల్‌ వినియోగిస్తుంది. ఈ లెక్కన వేయి లీటర్లతో ఏ బోటు వేటకు వెళ్లినా వారం రోజుల్లోనే వెనక్కి రావలసి ఉంది. గతంలోలా డీప్‌ సీ ఫిషింగ్‌కు వెళ్లి, రెండు వారాల వాయేజ్‌ చేయడానికి అవకాశం లేదు. వారం రోజులకే వెనక్కి వచ్చి, మళ్లీ డీజిల్‌ పోయించుకొని మరోసారి వేటకు వెళ్లాల్సిన పరిస్థితి.

సగం బోట్లే వేటకు

యుద్ధానికి ముందు డీజిల్‌ ధర లీటరు రూ.99 ఉండేది. ఇప్పుడు అది రూ.105.61కు చేరింది. అంటే సుమారు లీటరుకు ఏడు రూపాయలు పెరిగింది. రోజుకు 300 లీటర్లు ఉపయోగించే బోటుపై డీజిల్‌ భారం రూ.2 వేలు అదనంగా పడుతోంది. ప్రభుత్వం లీటరుపై తొమ్మిది రూపాయలు రాయితీ ఇస్తుంది. మర పడవలకైతే నెలకు మూడు వేల లీటర్లు, ఇంజన్‌ బోట్లకు అయితే 300 లీటర్ల డీజిల్‌కు ఈ రాయితీ ఇస్తుంది. అంతకు మించి ఉపయోగిస్తే ఆ భారం బోట్ల యజమానులే భరించాలి. డీజిల్‌ భారం రోజుకు రూ.2 వేలు పెరగడం, అడిగినంత డీజిల్‌ ఇవ్వకపోవడంతో సగం బోట్లు మాత్రమే వేటకు సిద్ధమయ్యాయి. హార్బర్‌ను కేంద్రంగా చేసుకుని మరపడవలు 687, ఇంజన్‌ బోట్లు వేయి వరకు ఉన్నాయి. వీటిలో సగమే ఆదివారం రాత్రి వేటకు వెళుతున్నాయి.

అమావాస్య అయినా సరే

సోమవారం అమావాస్య. సాధారణంగా ఎదురు అమావాస్య అని శుభకార్యాలు చేపట్టరు. అందులోను ఇది సీజన్‌ ప్రారంభం కాబట్టి చాలా మందికి సెంటిమెంట్‌ ఉంటుంది. అయితే సముద్రంలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో బాగా చేపలు లభిస్తాయని, అందుకని సెంటిమెంట్లు పక్కన పెట్టి వేటకు వెళుతున్నామని ఏపీ మరపడవల సంఘం కార్యదర్శి బాలాజీ తెలిపారు.

Updated Date - Jun 14 , 2026 | 12:55 AM