Share News

ఇప్పటికీ సీఎస్‌ఈనే, కానీ...

ABN , Publish Date - Jun 27 , 2026 | 12:40 AM

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌సీ)తో పాటు ఈ ఏడాది ఈసీఈ, ఈఈఈ బ్రాంచీల సీట్లకు కూడా డిమాండ్‌ పెరిగింది.

ఇప్పటికీ సీఎస్‌ఈనే, కానీ...

ఈసీఈ, ఈఈఈ తదితర బ్రాంచీలపైనా పెరిగిన ఆసక్తి

త్వరలో ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

మేనేజ్‌మెంట్‌ సీట్ల కోసం కళాశాలలకు విద్యార్థుల తల్లిదండ్రులు

కంప్యూటర్‌ సైన్స్‌ విత్‌ ఏఐ, ఎంఎల్‌కు తొలి ప్రాధాన్యం

ఆ తరువాత ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌...

కంప్యూటర్‌ సైన్స్‌ మేనేజ్‌మెంట్‌ కోటా సీటుకు రూ.8 నుంచి రూ.12 లక్షల వరకు వసూలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌సీ)తో పాటు ఈ ఏడాది ఈసీఈ, ఈఈఈ బ్రాంచీల సీట్లకు కూడా డిమాండ్‌ పెరిగింది. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలల యాజమాన్యాలను సంప్రతిస్తున్నారు. గడిచిన కొన్నాళ్లుగా విద్యార్థుల తొలి ప్రాధాన్యంగా కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌ఈ) ఉంటోంది. అయితే, తాజాగా మారిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మిగిలిన బ్రాంచీల్లోనూ చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌తో పాటు ఈసీసీ, ఈఈఈ సీట్ల గురించి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వాకబు చేస్తున్నారని నగర పరిధిలోని ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ తెలిపారు.

ఇతర కోర్సులపైనా ఆసక్తి

కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌ఈ)లో చేరేందుకు గత ఏడాది వంద మందిలో 80 మంది ఆసక్తి చూపితే, ఈ ఏడాది ఆ సంఖ్య 70 వరకూ ఉన్నట్టు ఒక ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ తెలిపారు. అందులోనూ కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌ఈ) విత్‌ ఏఐ అండ్‌ ఎంఎల్‌, డేటా సైన్స్‌తో కూడిన కోర్సులకు అత్యధికులు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. గడిచిన పదేళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్న ట్రెండ్‌లో ఈ ఏడాది స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ఆయన వెల్లడించారు. కొంతమంది ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ (ఈసీఈ), ఎలక్ర్టికల్‌ అండ్‌ ఎలక్ర్టానిక్స్‌ ఇంజనీరింగ్‌ (ఈఈఈ) వంటి కోర్సులకు విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారంటున్నారు.

మంచి ఉద్యోగ అవకాశాలు

కంప్యూటర్‌ సైన్స్‌ మాత్రమే కాకుండా ఇతర ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరే విద్యార్థులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈసీఈ, ఈఈఈ, కెమికల్‌, సివిల్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులకు భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తున్నాయంటున్నారు. డ్రోన్‌ టెక్నాలజీ, ఈవీ వాహనాల తయారీ పెరగడం, చిప్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇండస్ర్టీలు, టెలీ కమ్యూనికేషన్‌, ఎంబాడెడ్‌ సిస్టమ్స్‌ విస్తృతంగా రావడంతో ఎలక్ర్టికల్‌, ఎలక్ర్టానిక్స్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులకు భారీ వేతనాలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నట్టు చెబుతున్నారు. సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన వారికి నిర్మాణ రంగంలో, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులకు ఫ్యాబ్రికేషన్‌ సంస్థలతోపాటు కార్ల కంపెనీలు, వెహికల్‌ మానుఫ్యాక్చరింగ్‌ రంగాల్లో, జియో ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులకు మైనింగ్‌ సంస్థలు, వాటర్‌ లెవెల్స్‌ అనాలసిస్‌ సంస్థల్లో ఉద్యోగాలు దక్కుతున్నట్టు చెబుతున్నారు.

నైపుణ్యాలు అవసరం

ఇంజనీరింగ్‌లో ఏ కోర్సులో చేరినా విద్యార్థులు అదనపు నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి సారించాలి. అప్పుడే మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా అనలటిక్స్‌ వంటి అంశాల్లో నైపుణ్యం సాధిస్తే భారీ వేతనాలతో ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం ఉంది.

సీటుకు భారీగా వసూలు

నగర పరిధిలోని ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీలు మేనేజ్‌మెంట్‌ కోటాలో కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విత్‌ ఏఐ అండ్‌ ఎంల్‌, ఈసీఈ సీట్లకు భారీగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. మేనేజ్‌మెంట్‌ కోటాలో ఏడాదికి రూ.2.5 లక్షలు నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. అంటే నాలుగేళ్లకు పది లక్షల నుంచి రూ.12 లక్షల వరకు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రముఖ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటాలో కీలక బ్రాంచ్‌లకు చెందిన సీట్లు అయిపోయాయని చెబుతున్నారు. ఇంజనీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాకముందే తమ సీట్లు కన్ఫార్మ్‌ చేసుకునేందుకు విద్యార్థులు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తుండడంతో డిమాండ్‌ పెరుగుతోంది.

Updated Date - Jun 27 , 2026 | 12:40 AM