రైల్వే గేటు పడితే నరకమే..
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:36 AM
హస్తకళా రంగంలో ప్రఖ్యాతి గాంచిన మేజర్ పంచాయతీ ఏటికొప్పాక గ్రామ ప్రజలకు రైల్వే గేటు కష్టాలు తీరడం లేదు. రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో గేటు వేయడంతో వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
వాహనచోదకులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి
ఏటికొప్పాక మీదుగా రాకపోకలు సాగించే సుమారు 20 గ్రామాల ప్రజలకు నిత్యం యాతన
ఎలమంచిలి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): హస్తకళా రంగంలో ప్రఖ్యాతి గాంచిన మేజర్ పంచాయతీ ఏటికొప్పాక గ్రామ ప్రజలకు రైల్వే గేటు కష్టాలు తీరడం లేదు. రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో గేటు వేయడంతో వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఇక్కడ అండర్ పాస్‌వే నిర్మించాలని ప్రతిపాదన ఉన్నా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు.
ఏటికొప్పాక రైల్వే గేటు మీదుగా ఎలమంచిలి, ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాలకు చెందిన సుమారు 20 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవల కాలంలో రైళ్ల సంఖ్య పెరగడంతో తరచూ రైల్వే గేటు వేయాల్సి వస్తోంది. దీంతో వాహనచోదకులకు నిరీక్షణ తప్పడం లేదు. పర్యాటక ప్రాంతంగా ఏటికొప్పాక గ్రామాన్ని తీర్చిదిద్దుతామని గతంలో పాలకులు చెప్పిన మాటలు కార్యరూపం దాల్చకపోగా, కనీసం రైల్వే గేటు సమస్య కూడా పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రైల్వే గేటు మీదుగా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక, పులపర్తి, పేట బయ్యవరం, ములకలాపల్లి, ఎస్.రాయవరం మండలం దార్లపూడి, గోకులపాడు, భీమవరం, చినగుమ్ములూరు, పెదగుమ్ములూరు, పెనుగొల్లు, ధర్మవరం ఎస్.రాయవరం, తదితర పలు గ్రామాల ప్రజలు వివిధ వృత్తి, వ్యవసాయ, వ్యాపారం, ఉద్యోగాల నిమిత్తం నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రైల్వే గేటు పడిందంటే వీరంతా నరకం చూస్తున్నారు. సమయానికి గమ్యస్థానానికి చేరుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిఽధలు, అధికారులు స్పందించి ఇక్కడ అండర్ పాస్‌వే నిర్మించాలని వారు కోరుతున్నారు.