Share News

పరిచయస్తులే ప్రాణాలు తీస్తున్నారు

ABN , Publish Date - May 24 , 2026 | 12:45 AM

దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా గుర్తింపు పొందిన విశాఖలో వరుస హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

పరిచయస్తులే ప్రాణాలు తీస్తున్నారు

నగరంలో ఆందోళన కలిగిస్తున్న మహిళల హత్యలు

ఇటీవల కాలంలో ముగ్గురు...

నగలు, డబ్బు కోసమే...

ఒంటరిగా ఉన్నప్పుడు తెలిసినవారు వచ్చినా ఇంట్లోకి అనుమతించవద్దంటున్న పోలీసులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా గుర్తింపు పొందిన విశాఖలో వరుస హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతా తమకు పరిచయస్తులు, తెలిసిన వారి చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మహిళల గురించి, వారి ఇంటి పరిస్థితులు గురించి బాగా అవగాహన ఉన్నవారే అదనుచూసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో నగరంలో ముగ్గురు యువతులు/మహిళలు హత్యకు గురయ్యారు. మరొకరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

ఆరిలోవలోని దుర్గానగర్‌కు చెందిన కాపు లక్ష్మి అనే మహిళకు రాంగ్‌ ఫోన్‌ కాల్‌తో పరిచయమైన విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరి 11న ఆమె ఇంటికి వెళ్లాడు. చీటీలు నిర్వహించే లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉండడంతో తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కొంత డబ్బు ఇవ్వాలని కోరాడు. ఆమె తాను ఇవ్వనని చెప్పేసరికి విచక్షణ కోల్పోయి లక్ష్మిని గొంతు నులిమి హత్యచేశాడు. అనంతరం ఆమె శరీరంపై ఉన్న బంగారం, ఇంట్లోని నగదుని అపహరించుకుపోయాడు. మార్చి 30న నేవీలో ఉద్యోగం చేస్తున్న చింతాడ రవీంద్ర తనకు డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన కైలాసపురానికి చెందిన మౌనికను హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. కొన్ని శరీర భాగాలను ఫ్రిజ్‌లో పెట్టి మరికొన్నింటిని నగర శివారుల్లో కాల్చేశాడు. ఈనెల 13న అక్కయ్యపాలెం శ్రీనివాస నగర్‌కు చెందిన పి.పార్వతిని ఆమెకు చెందిన దుకాణాన్ని అద్దెకు తీసుకున్న వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో హత్య చేసి బంగారంతో పరారైపోయాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా ఈనెల 19న భీమిలికి చెందిన కొయ్య ప్రవీణ్‌ తనకు పరిచయస్తురాలైన కొమ్మాది వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన వివాహితను కాపులుప్పాడలోని ఒక లేవుట్‌లోకి తీసుకువెళ్లి వైరుతో గొంతునులిమి ఊపిరాడకుండా చేశాడు. మరణించిందని భావించి ఆమెను తుప్పల్లో పడేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరుసటిరోజు మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన గ్రేహౌండ్స్‌ పోలీసులు తుప్పల్లో కొన ఊపిరితో ఉన్న వివాహితను గుర్తించి భీమిలి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆమెను 108లో ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం కోలుకుంటోంది. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఏప్రిల్‌ 15న జోడుగుళ్లపాలేనికి చెందిన జెస్సీ అనే యువతి తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకల కోసం విశాలాక్షి నగర్‌లోని ఒక లాడ్జికి వెళ్లింది. అక్కడ స్నేహితులంతా మూకుమ్మడిగా ఆమెపై దాడి చేసి గాయపరచడంతో మనస్తాపానికి గురై అదే లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడింది.

నగరంలో ఒంటరి మహిళలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలిసిన వ్యక్తులే దారుణాలకు తెగబడుతుండడంతో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు చెబుతున్నారు. మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు తెలిసిన వ్యక్తులు వచ్చినాసరే ఇంట్లోకి అనుమతించకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ఇంట్లో విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకోవడం, నగదు, విలువైన ఆభరణాలను ఉంచుకోకుండా బ్యాంక్‌ లాకర్లలో భద్రపరుచుకోవడం చేయాలని సూచిస్తున్నారు.

Updated Date - May 24 , 2026 | 12:45 AM