Share News

రోడ్డు నిర్మించి రెండేళ్లయినా కాలేదే!

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:49 PM

మండలంలోని కొత్తపల్లి గ్రామానికి రహదారి నిర్మించాలని గ్రామస్థులు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్నారు. అయితే రోడ్డు నిర్మించిన రెండేళ్లకే ఎక్కడికక్కడ పగుళ్లు ఇచ్చి అధ్వానంగా తయారవుతుండడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు.

రోడ్డు నిర్మించి రెండేళ్లయినా కాలేదే!
పగుళ్లు ఇచ్చిన అంతాడ - పి.కొత్తపల్లి రోడ్డు

ఎక్కడికక్కడ పగుళ్లు ఇచ్చిన అంతాడ- పి.కొత్తపల్లి రహదారి

నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడమే కారణం

దారి కోసం దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న కొత్తపల్లి గ్రామస్థులు

ఇప్పుడీ పరిస్థితి చూసి ఆవేదన

కొయ్యూరు, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తపల్లి గ్రామానికి రహదారి నిర్మించాలని గ్రామస్థులు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్నారు. అయితే రోడ్డు నిర్మించిన రెండేళ్లకే ఎక్కడికక్కడ పగుళ్లు ఇచ్చి అధ్వానంగా తయారవుతుండడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. తమ రవాణా కష్టాలు తీరాయని ఆనంద పడుతున్న తరుణంలో రోడ్డు దుస్థితిని చూసి కలత చెందుతున్నారు.

మండలంలోని బంగారమ్మపేట నుంచి అంతాడ పంచాయతీ కొత్తపల్లి గ్రామానికి సరైన రహదారి లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రాకపోకలకు అవస్థలు పడుతుండేవారు. తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని దశాబ్దాల పాటు పోరాటం చేశారు. ఈ క్రమంలో 2021లో ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు ఆర్థిక సహకారంతో రూ.2.63 కోట్ల అంచనా వ్యయంతో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో రోలుగుంట మండలానికి చెందిన కాంట్రాక్టర్‌ ఎన్‌.వెంకటేశ్వరరావు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. 2023 ఏప్రిల్‌లో ఈ రహదారి నిర్మాణం పూర్తయింది. అయితే రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో అంతాడ రోడ్డు నుంచి కొత్తపల్లి వెళ్లే 4.5 కిలోమీటర్ల మేర పలు చోట్ల రోడ్డు పగుళ్లు ఇచ్చింది. అలాగే రోడ్డు అంచులు సైతం కొట్టుకుపోయాయి. దీంతో కొత్తపల్లి గ్రామస్థులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాలు వెళితే రోడ్డు కుంగిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయ్యాక ఐదు సంవత్సరాల పాటు నిర్వహణ నిమిత్తం కాంట్రాక్టర్‌ రూ.9 లక్షలు పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో డిపాజిట్‌ చేశారు. ప్రస్తుతం ఈ రహదారి పలు చోట్ల పగుళ్లు ఇచ్చిన నేపథ్యంలో ఆ డిపాజిట్‌ సొమ్ముతో మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Mar 09 , 2026 | 11:49 PM