పనిచేయక ఏడాది దాటి..
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:30 AM
అనకాపల్లి రైల్వేస్టేషన్‌లోని టికెట్ బుకింగ్ కౌంటరు వద్ద గల ఎస్కలేటర్ మెరాయించి నెలలు గడుస్తున్నా దానిని వినియోగంలోకి తీసుకురావడానికి అధికారులు దృష్టి సారించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇది గత ఏడాది జూలై నుంచి ఇది పనిచేయడంలేదు. రైల్వే అధికారులు బాగు చేయించకపోవడంతో రెండు, మూడు ప్లాట్‌ఫారాలకు వెళ్లే ప్రయాణికులు మెట్ల మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తున్నది.
అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో మరమ్మతులకు గురైన ఎస్కలేటర్
ప్లాట్‌ఫారాలపైకి రాకపోకలకు ప్రయాణికుల అవస్థలు
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
అనకాపల్లి టౌన్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి రైల్వేస్టేషన్‌లోని టికెట్ బుకింగ్ కౌంటరు వద్ద గల ఎస్కలేటర్ మెరాయించి నెలలు గడుస్తున్నా దానిని వినియోగంలోకి తీసుకురావడానికి అధికారులు దృష్టి సారించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇది గత ఏడాది జూలై నుంచి ఇది పనిచేయడంలేదు. రైల్వే అధికారులు బాగు చేయించకపోవడంతో రెండు, మూడు ప్లాట్‌ఫారాలకు వెళ్లే ప్రయాణికులు మెట్ల మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తున్నది.
నాన్-సబర్బన్ గ్రేడ్-4 కేటగిరీలో వున్న అనకాపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఏటా కనిష్ఠంగా 20 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఆదాయం రూ.10-15 కోట్లు వస్తున్నది. స్టేషన్ ఆధునికీకరణతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఆరేళ్ల క్రితం ఒకటి, రెండు ప్లాట్‌ఫారాల మధ్య ఒకటి, రిజర్వేషన్ కౌంటర్‌కు ఎదురుగా మరొకటి ఎస్కలేటర్లను నిర్మించారు. దీనివల్ల గర్భిణులు, వృద్ధులు, అధిక లగేజీ వున్న ప్రయాణికులకు మెట్లు ఎక్కాల్సిన శ్రమ తప్పింది. కొంతకాలంపాటు బాగానే పనిచేశాయి. తరువాత అప్పడుప్పుడు మొరాయిస్తుండడంతో అధికారులు బాగుచేయించేవారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ కౌంటర్‌కు ఎదురుగా వున్న ఎస్కలేటర్ గత ఏడాది జూలైలో పాడైంది. దీంతో ప్రయాణికులు రెండు, మూడు ప్లాట్‌ఫారాలకు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్కలేటర్ పనిచేయకపోవడంపై ఈ మధ్య కాలంలో పలుమార్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. త్వరలో బాగు చేయించి వినియోగంలోకి తీసుకొస్తామన్న అధికారుల మాటలు నీటి మూటలుగా మారాయి. అనకాపల్లిలో హాల్ట్ వున్న రైళ్లలో 80 శాతం వరకు రెండు లేదా మూడో నంబరు ప్లాట్‌ఫారాలపై నిలుపుదల చేస్తుంటారు. ఎస్కలేటర్ పనిచేయకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లలు వున్నవారు, భారీ లాగేజీలతో ప్రయాణించే వారు మెట్లు ఎక్కి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి అనకాపల్లి రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి విశాఖ కేంద్రంగా ప్రాంభించిన దక్షిణ కోస్తా జోన్ పరిధిలోకి వచ్చింది. అయినాసరే ఎస్కలేటర్ మరమ్మతులకు నోచుకోలేదు.
ఎస్కలేటర్ నెలల తరబడి పనిచేయకపోవడంపై రైల్వేస్టేషన్ మేనేజర్ కె.రామకృష్ణను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ఇటీవల టెక్నీషియన్లు వచ్చి మరమ్మతులు చేశారని, కానీ కొద్దిసేపటికే మొరాయించిందని చెప్పారు. ఈ విషయాన్ని విజయవాడ డివిజనల్ అధికారులకు తెలియపరిచామని, త్వరలో ఎస్కలేటర్ అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.