పట్టాలెక్కని ఐటీ కంపెనీలు
ABN , Publish Date - May 05 , 2026 | 12:50 AM
విశాఖను ఐటీ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ సత్వర నిర్ణయాలతో భారీ కంపెనీలకు భూములు కేటాయించి, శంకుస్థాపనలు చేశారు.
శంకుస్థాపన జరిగి 140 రోజులు
కనీసం పనులు ప్రారంభించని యాజమాన్యాలు
ఏడాదిలో కార్యకలాపాల ప్రారంభంపై అనుమానాలు
ఇంకా ప్రణాళికల తయారీలోనే కొన్ని సంస్థలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖను ఐటీ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ సత్వర నిర్ణయాలతో భారీ కంపెనీలకు భూములు కేటాయించి, శంకుస్థాపనలు చేశారు. ఏడాది గడువులోగా కంపెనీలన్నీ కార్యకలాపాలు ప్రారంభించేలా పనులు చేపట్టాలని ఆ సమయంలో మంత్రి లోకేశ్ కోరారు. దానికి సమ్మతించిన ఆయా సంస్థల యాజమాన్యాలు ఆ దిశగా కనీస ప్రయత్నాలు ప్రారంభించలేదు. తొమ్మిది కంపెనీలకు ఒకేసారి శంకుస్థాపన చేయగా కాగ్నిజెంట్ సంస్థ మాత్రమే ప్రహరీ నిర్మాణం చేపట్టింది. మిగిలినవి కనీసం భూమి చదును పనులు కూడా ప్రారంభించలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరుతో కంపెనీలు కోరిన వెంటనే ఆగమేఘాలపై భూములు కేటాయిస్తోంది. అడిగిన రాయితీలు, మార్కెట్ ధర కంటే అత్యంత చౌకగా భూములు అందిస్తోంది. ప్రభుత్వం చూపించిన స్పీడ్ ఆయా కంపెనీల పనుల్లో మాత్రం కనిపించడం లేదు. విశాఖలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది డిసెంబరు 12న ఐటీ శాఖా మంత్రి లోకేశ్ విశాఖలో తొమ్మిది ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేశారు. వారందరికీ రాయితీ ధరలపై భూములు ఇచ్చారు. ఏడాదిలోగా కార్యకలాపాలు ప్రారంభించాలని ఆ రోజే మంత్రి కోరారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇది జరిగి 140 రోజులు దాటింది. ఒక్క కాగ్నిజెంట్ మాత్రమే పది రోజుల క్రితం ప్రహరీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. మిగిలిన ఎనిమిది కంపెనీలు కనీసం భూముల చదును పనులు కూడా చేపట్టలేదు. శంకుస్థాపన చేసిన రోజు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడూ అదే వాతావరణం ఉంది. ఇలాగైతే ఈ ఏడాది డిసెంబరుకు కార్యకలాపాలను ఎలా ప్రారంభిస్తారనే అనుమానం కలుగుతోంది. దీనిపై ఆరా తీస్తే భవన నిర్మాణ ప్రణాళికలు తయారు చేసే పనిలో సంస్థలు ఉన్నాయని, అవి పూర్తయ్యాక ఏపీఐఐసీకి, జీవీఎంసీకి దరఖాస్తు చేస్తారని, పరిశీలించి, అనుమతులు వచ్చాకే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఏపీఐఐసీ వర్గాలు చెబుతున్నాయి.
శంకుస్థాపన చేసిన కంపెనీలివే...
ఫ రుషికొండ ఐటీ సెజ్ హిల్ నంబరు 2లో ఏసీఎన్ ఇన్ఫోటెక్ (ఏసీఎస్ హెల్త్ కేర్ ఆర్‌సీఎం సర్వీసెస్)కు రెండు ప్లాటు ్ల(21, 22) కేటాయించారు. రూ.30 కోట్ల పెట్టబడితో 600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉంది.
ఫ ఐటీ సెజ్ హిల్ నంబరు 2పై నాన్‌రెల్ టెక్నాలజీస్‌కు ఎకరా భూమి ఇచ్చారు. అందులో రూ.50 నుంచి 60 కోట్లు పెట్టుబడి పెట్టి, 567 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎండీ వినయ్‌బాబు మేక, సీఈఓ పవన్‌కుమార్ సామినేని హామీ ఇచ్చారు.
ఫ ఐటీ సెజ్ హిల్ నంబరు 2పై టెక్ తమ్మిన ఐటీ క్యాంపస్ నిర్మాణానికి 81 సెంట్ల భూమి ఇచ్చారు. రూ.62 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాల్సి ఉంది.
ఫ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూపునకు మధురవాడ హిల్ నంబరు 4పై 30 ఎకరాలు కేటాయించారు. రూ.1,500 కోట్ల పెట్టుబడితో అతి పెద్ద ఐటీ క్యాంపస్ నిర్మాణం చేపట్టాలన్నది నిబంధన. అందులో 25 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. గ్రేడ్-ఏ కార్యాలయాలు, ప్రీమియం నివాసాలు, ఇంటిగ్రేటెడ్ రిటైల్, హాస్పిటాలటీ సౌకర్యాలు కల్పించాలి. మొదటి మూడేళ్లలో మిలియన్ చదరపు అడుగుల ఐటీ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. వీరు కంపెనీ పేరు మార్చాలని, సేల్ డీడ్‌లో మార్పులు చేయాలని దరఖాస్తు చేసినట్టు సమాచారం.
ఫ కాపులుప్పాడలో క్వార్క్స్ టెక్నో సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంపస్ భవన నిర్మాణానికి నాలుగు ఎకరాలు ఇచ్చారు. వీరు రూ.115 కోట్ల పెట్టుబడితో రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించాలి.
ఫ కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్కులో మదర్‌సన్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థకు 3.55 ఎకరాలు కేటాయించారు. వారు రూ.109.73 కోట్ల పెట్టుబడుల ద్వారా 1,775 మందికి ఉద్యోగాలు ఇస్తామని ఒప్పందం చేశారు. హెడ్ ఆఫ్ టెక్నాలజీ డివిజన్ ధీరజ్
ఫ కాపులుప్పాడలో ఫ్లూయెంట్ గ్రిడ్ ఐటీ క్యాంపస్‌కు ఎకరా రూ.కోటి చొప్పున 3.3 ఎకరాలు కేటాయించారు. అక్కడ ఎకరం రూ.30 కోట్ల ధర పలుకుతోంది. ఈ సంస్థ రూ.150 కోట్ల పెట్టుబడితో రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తామని ఒప్పందం చేసుకుంది. కనీసం ప్రహరీ కూడా నిర్మించలేదు.
ఫ కాపులుప్పాడలో ఇమాజిన్నోటివ్ సొల్యూషన్స్ సంస్థకు 4.05 ఎకరాలు కేటాయించారు. రూ.140 కోట్ల పెట్టుబడితో 2,600 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని సీఈవో వి.భార్గవ్‌కృష్ణ ప్రకటించారు. కానీ ఆ కంపెనీలు ఏవీ ఇంతవరకు ఎటువంటి పనులు ప్రారంభించలేదు.