Share News

మీ ఓటు భద్రమేనా?

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:26 PM

కేంద్ర ఎన్నికల కమిషన్‌ చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)లో ఓటు నిలుపుకునే బాధ్యత ఓటర్లపైనే ఉంది. ఈ ప్రక్రియ గడువు రెండు రోజుల్లో ముగుస్తుండడంతో బీఎల్‌వోలు ఎన్యూమరేషన్‌ డిజిటలైజేషన్‌ వేగవంతం చేశారు.

మీ ఓటు భద్రమేనా?
తాజంగి సచివాలయంలో డిజిటలైజేషన్‌ను పరిశీలిస్తున్న జేసీ టి.శ్రీపూజ (ఫైల్‌ ఫొటో)

బీఎల్‌వోకు ఇచ్చిన ఎన్యూమరేషన్‌ ఫారం డిజిటలైజేషన్‌ అయిందో?, లేదో తెలుసుకోవలసిన బాధ్యత ఓటరుదే

రెండు రోజుల్లో ముగియనున్న సర్‌ ప్రక్రియ గడువు

తప్పుల సవరణకు ఎడిటింగ్‌ ఆప్షన్‌ కూడా అదే రోజు ఆఖరు

ఫారం డిజిటలైజేషన్‌ కాకపోతే ఓటు పోయినట్టే..

పరిశీలించుకునేందుకు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చిన ఎన్నికల కమిషన్‌

చింతపల్లి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల కమిషన్‌ చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)లో ఓటు నిలుపుకునే బాధ్యత ఓటర్లపైనే ఉంది. ఈ ప్రక్రియ గడువు రెండు రోజుల్లో ముగుస్తుండడంతో బీఎల్‌వోలు ఎన్యూమరేషన్‌ డిజిటలైజేషన్‌ వేగవంతం చేశారు.

జిల్లాలోని పలు మండలాల్లో డిజిటలైజేషన్‌ శతశాతం పూర్తి చేసినట్టు అధికారులు ప్రకటించారు. అయితే ఎన్యూమరేషన్‌ ఫారం డిజిటలైజేషన్‌ జరిగిందా?, లేదా? అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఓటర్లపైనే ఉంది. ఒకవేళ డిజిటలైజేషన్‌లో మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే ఎడిటింగ్‌ ఆప్షన్‌ అవకాశం రెండు రోజులే ఉంటుంది. ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే ఓటును చేజార్చుకునే అవకాశం లేకపోలేదు. సవరణలో ఓటును కోల్పోతే పునరుద్ధరించుకునేందుకు భవిష్యత్తులో కలెక్టర్‌ సిఫారసుకు 11 రకాల పత్రాలు సమర్పించాల్సి వుంటుంది. ఓటర్లు ముందుగానే అప్రమత్తంగా ఉంటే సవరణలో ఓటును పదిలపరుచుకోవచ్చు.

కేంద్ర ఎన్నికల కమిషన్‌ దోషరహిత ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు గత నెల 15 నుంచి ప్రత్యేక సమగ్ర సవరణను ప్రారంభించిన విషయం తెలిసిందే. సవరణ గడువు ఈ నెల 14తో ముగియనున్నది. జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టేందుకు పలు ఆటంకాలు, సాంకేతిక సమస్యలు ఎదురైనప్పటికి అధికార యంత్రాంగం పురోగతి సాధించింది. పది రోజుల క్రితం వరకు రాష్ట్రంలో జిల్లా సమగ్ర సవరణలో అట్టడుగు స్థానంలో ఉండగా, నేటికి నాలుగో స్థానానికి చేరుకుంది. అధికారులు, బీఎల్‌వోలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారు. అధికారుల కృషి ఫలితంగా జిల్లాలో 96.43 శాతం ఎన్యూమరేషన్‌ డిజిటలైజేషన్‌ పూర్తి చేశారు.

అప్రమత్తతే ఓటుకు భద్రత

బీఎల్‌వోలు చేపట్టిన సమగ్ర సవరణలో ఓటర్లు అప్రమత్తంగా ఉంటేనే ఓటుకు భద్రత ఉంటుంది. ఈ ప్రక్రియ గడువు ముగుస్తుండడం, గడువు పెంచే అవకాశం లేకపోవడంతో బూత్‌ పరిధి ఓట్లు డిజిటలైజేషన్‌ శతశాతం పూర్తి చేసే పనిలో బీఎల్‌వోలు నిమగ్నమయ్యారు. మెజారిటీ బీఎల్‌వోలు శతశాతం డిజిటలైజేషన్‌ పూర్తి చేశారు. ఓటర్లు సమగ్ర సమాచారంతో బీఎల్‌వోలకు అప్పగించిన ఎన్యూమరేషన్‌ ఫారాలు డిజిటలైజేషన్‌ జరిగిందా?, లేదా? అని తెలుసుకునేందుకు ఎన్నికల కమిషన్‌ ఒక లింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటర్లు జ్ట్టిఞట://ఠి్ట్ఛౌటట.్ఛఛిజీ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే లాగిన్‌ ఆప్షన్‌ వస్తుంది. ఓటరు రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ గాని, ఈ-మెయిల్‌ ఐడీగాని, ఎపిక్‌ నంబర్‌, క్యాప్‌చా ఎంటర్‌ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేస్తే ఎస్‌ఐఆర్‌- 2026 ఆన్‌లైన్‌ పరిశీలన వస్తుంది. ఓటరు రాష్ట్రం ఎంపిక చేసుకుని ఎపిక్‌ నంబర్‌ ఎంటర్‌ చేస్తే డిజిటలైజేషన్‌ జరిగిందా?, లేదా అని తెలుస్తుంది. డిజిటలైజేషన్‌ పెండింగ్‌లో చూపిస్తే వెంటనే ఓటర్లు బీఎల్‌వోను సంప్రతించాలి. అలాగే బీఎల్‌వోలు మృతులు, శాశ్వత వలసదారులు, డూప్లికేట్‌ ఎంట్రీ, గుర్తించబడని ఓటర్లను సంబంధిత ఆధారాలు జతపర్చి డిజిటలైజేషన్‌ పూర్తి చేస్తున్నారు. డూప్లికేట్‌ ఎంట్రీ(రెండు, మూడు చోట్ల ఓటు ఉంటే) ఓటర్లు ఎక్కడ ఓటును ఎన్యూమరేషన్‌ చేసుకున్నారు?, ఎక్కడ ఓట్లు తొలగించుకున్నారనేదానిపై స్పష్టత ఉండాలి. ఓటర్లు నిర్లక్ష్యం వహిస్తే ఎక్కడా ఓటు లేకుండాపోతుంది. బీఎల్‌వోలు మృతులు, శాశ్వత వలసదారులు, డబుల్‌ ఎంట్రీలు, గుర్తించబడని ఓటర్లు సంబంధించిన పక్కా ఆధారాలతో డిజిటలైజేషన్‌ చేశారా?, లేదా అని వివిధ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవాలి. లేదంటే రానున్న ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు సైతం ఓటు హక్కుకు దూరం కావాల్సి వస్తుంది. జిల్లా అధికారులు పారదర్శకంగా సవరణ చేపట్టామని, వివిధ రాజకీయ పార్టీల నాయకులను సవరణలో భాగస్వాములను చేశామని, పక్కా ఆధారాలతోనే మృతులు, శాశ్వత వలసదారులు, డబుల్‌ ఎంట్రీలు, గుర్తించబడని ఓట్లు తొలగిస్తున్నామని చెబుతున్నప్పటికి ఓటర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సవరణలో లోపాలను ఓటర్లు గుర్తిస్తే ఈ నెల 14వ తేదీలోగా బీఎల్‌వో ఎడిటింగ్‌ చేయించుకోవాలి.

Updated Date - Jul 12 , 2026 | 11:26 PM