Share News

వంతెన గతి ఇంతేనా?

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:21 PM

మండలంలోని పాడి- రత్నంపేట గ్రామాల మధ్య గల వంతెన శిథిలమైనా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.

వంతెన గతి ఇంతేనా?
పాడి- రత్నంపేట గ్రామాల మధ్య తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసిన దృశ్యం

రెండేళ్ల క్రితం శిథిలమైన బ్రిడ్జి

తాటిదుంగలతో తాత్కాలిక వంతెన నిర్మించిన స్థానికులు

బిక్కుబిక్కుమంటూ 15 గ్రామాల ప్రజల రాకపోకలు

కొయ్యూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పాడి- రత్నంపేట గ్రామాల మధ్య గల వంతెన శిథిలమైనా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. గత రెండేళ్లుగా అక్కడ తాత్కాలికంగా నిర్మించిన వంతెనపైనే సుమారు 15 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వారంతా ఆందోళన చెందుతున్నారు. మండలంలోని పాడి- రత్నంపేట గ్రామాల మధ్య గల వంతెన భారీ వర్షాలకు రెండేళ్ల క్రితం శిథిలమైంది. దీంతో 15 గ్రామాల ప్రజలు 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించే గమ్యం స్థానం చేరేవారు. ఈ క్రమంలో గత ఏడాది స్థానికులు వాహనాల రాకపోకలకు వీలుగా తాటిదుంగలు వేసి దానిని మట్టితో పూడ్చి తాత్కాలికంగా వంతెన ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ తాత్కాలిక వంతెన కుంగిపోయి ప్రమాదాలు జరుగుతాయేమోనని వాహనచోదకులు భయాందోళన చెందుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు ప్రకటించిందే తప్ప పనులు ప్రారంభించలేదు. కూటమి ప్రభుత్వం స్పందించి ఈ వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని 15 గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 10 , 2026 | 11:21 PM