Share News

అసంపూర్తి భవనాలకు మోక్షమెన్నడో?

ABN , Publish Date - Mar 01 , 2026 | 11:37 PM

మండలంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు భవన నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ యూనిట్‌ (రైతు భరోసా కేంద్రం) భవన నిర్మాణం దాదాపు పూర్తయి మూడేళ్లు దాటినా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.

అసంపూర్తి భవనాలకు మోక్షమెన్నడో?
అసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తున్న సచివాలయ భవనం

గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్బీకే, సచివాలయం, హెల్త్‌ సెంటర్‌ భవన నిర్మాణాలు ప్రారంభం

కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో నిలిచిన నిర్మాణాలు

మూడేళ్లుగా అసంపూర్తిగా దర్శనం

ఆర్బీకే భవనం దాదాపు పూర్తయినా అందుబాటులోకి రాని వైనం

కొయ్యూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): మండలంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు భవన నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ యూనిట్‌ (రైతు భరోసా కేంద్రం) భవన నిర్మాణం దాదాపు పూర్తయి మూడేళ్లు దాటినా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని తెలిసింది.

గత వైసీపీ ప్రభుత్వంలో 2019 డిసెంబరులో కొయ్యూరులో గ్రామ సచివాలయ భవనం, అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ యూనిట్‌ (రైతు భరోసా కేంద్రం), భారత్‌ నిర్మాణ సేవా కేంద్రం (హెల్త్‌ సెంటర్‌) నిర్మాణానికి ఉపాధి హామీ పథకం నుంచి రూ.76.75 లక్షలు మంజూరు చేసింది. ఆ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు 2020 ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణం 2023లో దాదాపు పూర్తయినా కాంట్రాక్టర్‌కు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో అప్పగించలేదని తెలిసింది. ఇక సచివాలయ భవన నిర్మాణం చాలా వరకు పూర్తయినా కాంట్రాక్టర్‌ అర్ధంతరంగా పనులు నిలిచిపోవడంతో మూడేళ్లుగా అసంపూర్తిగా దర్శనమిస్తోంది. ఇక హెల్త్‌ సెంటర్‌ భవన నిర్మాణమైతే పునాదులకే పరిమితమైంది. ప్రస్తుతం ఈ మూడు భవనాల చుట్టూ దట్టంగా తుప్పలు మొలిశాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. గత ప్రభుత్వంలో లక్షలాది రూపాయల ప్రజాధనం ఇలా దుర్వినియోగమైపోయిందని పలువురు విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి వీటి నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Mar 01 , 2026 | 11:37 PM