Share News

ఏడుముళ్ల ఆనకట్టకు మోక్షమెన్నడో?

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:47 PM

మండలంలోని కొత్తూరు వద్ద మేజర్‌ శారదా నదిపై ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన ఏడుముళ్ల ఆనకట్ట శిథిలావస్థలో ఉంది. దీని కింద ఉన్న ఆయకట్టు భూములకు సక్రమంగా సాగునీరు అందని పరిస్ధితి నెలకొంది. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏడుముళ్ల ఆనకట్టకు మోక్షమెన్నడో?
కొత్తూరు వద్ద మేజర్‌ శారదా నదిపై శిథిలావస్థలో ఉన్న ఏడుముళ్ల ఆనకట్ట

శిథిలావస్థలో ఉండడంతో 1,200 ఎకరాలకు సాగునీరు అందని దుస్థితి

గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక అవస్థలు

వేసవిలో మరమ్మతులు చేయించాలని రైతుల వేడుకోలు

రాంబిల్లి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తూరు వద్ద మేజర్‌ శారదా నదిపై ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన ఏడుముళ్ల ఆనకట్ట శిథిలావస్థలో ఉంది. దీని కింద ఉన్న ఆయకట్టు భూములకు సక్రమంగా సాగునీరు అందని పరిస్ధితి నెలకొంది. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏడుముళ్ల ఆనకట్ట కింద సుమారు 1,200 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. ఈ ఆనకట్టకు ఇరువైపులా ఏడుముళ్ల కాలువ, కొత్తలి-ఎలమంచిలి కాలువలు ఉన్నాయి. ఈ రెండు కాలువలకు మదుములు ఉన్నాయి. అయితే 2017 అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు నదిలో నీటి ఉధృతి పెరిగి 40 మీటర్ల పొడవున ఆనకట్ట కొట్టుకుపోయింది. అంతేకాకుండా ఏడుముళ్ల కాలువ మదుము కూడా కొట్టుకుపోయింది. ఈ ఆనకట్ట పొడవు 88 మీటర్లు కాగా, 40 మీటర్ల మేర కొట్టుకుపోవడంతో రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. అధికారులు ఈ ఆనకట్టకు రూ.1.5 కోట్లతో మరమ్మతులు చేయించారు. కాగా నిర్మించిన భాగం బాగానే ఉన్నా మళ్లీ నదిలో నీటి ఉధృతి తీవ్రతకు పాత కట్టడం మరో 40 మీటర్లు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఆనకట్ట కింద ఉన్న ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఆనకట్ట వద్ద కనీస మరమ్మతులు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ స్పందించి ఈ వేసవిలో ఆనకట్టకు మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు. దీనిపై ఇరిగేషన్‌ ఏఈ శివాజీని వివరణ కోరగా ఈ ఆనకట్ట తుఫానుల ప్రభావంతో నదిలో నీటి ఉధృతికి దెబ్బ తిందన్నారు. ఎగువ, దిగువ ఎప్రాన్‌లు, కటాఫ్‌వాల్స్‌, తలుపులు, రాతిపేర్పులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఈ ఆనకట్ట పరిస్ధితిని ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. మరమ్మతులు చేపట్టేందుకు రూ.7 కోట్లతో అంచనాలు తయారుచేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశామన్నారు. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతామని ఆయన చెప్పారు.

Updated Date - Apr 25 , 2026 | 11:47 PM