Share News

సచివాలయ భవనాలకు మోక్షమెన్నడో?

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:11 AM

జిల్లాలో చాలా చోట్ల సచివాలయ భవనాలు అసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రాధాన్యతా భవనాలుగా పేర్కొన్నప్పటికీ నిధులు సక్రమంగా విడుదల చేయక పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి.

సచివాలయ భవనాలకు మోక్షమెన్నడో?
హుకుంపేట మండలం మఠం గ్రామంలో అంపూర్తిగా ఉన్న సచివాలయ భవనం

గత వైసీపీ ప్రభుత్వంలో సక్రమంగా నిధులు విడుదల చేయక నిలిచిపోయిన పనులు

జిల్లాలో 212 సచివాలయాలకు గాను అసంపూర్తిగా ఉన్నవి 125

వసతికి అవస్థలు పడుతున్న ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు

భవన నిర్మాణాల పూర్తికి డిప్యూటీ సీఎం చర్యలు తీసుకోవాలని వేడుకోలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో చాలా చోట్ల సచివాలయ భవనాలు అసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రాధాన్యతా భవనాలుగా పేర్కొన్నప్పటికీ నిధులు సక్రమంగా విడుదల చేయక పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వంలోనైనా వాటికి మోక్షం కలుగుతుందని భావించినప్పటికీ ఆ దిశగా అడుగులు పడడం లేదని పలువురు అంటున్నారు.

సచివాలయ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రజలకు పౌరసేవలను సక్రమంగా అందించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం భవన నిర్మాణాలపైనా దృష్టి సారించాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తున్నది. గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్‌కల్యాణ్‌ సచివాలయాల భవన నిర్మాణాలపైనా దృష్టి పెట్టాలని ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు కోరుతున్నారు.

మన్యంలో అసంపూర్తిగా 125 భవనాలు

ఏజెన్సీ పదకొండు మండలాల పరిధిలో 212 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. 2020లో వాటికి శాశ్వత భవనాలు నిర్మించాలని భావించి జాతీయ ఉపాధి హామీ పథకంలో ఒక్కో సచివాలయ భవనాన్ని రూ.40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏజెన్సీ వ్యాప్తంగా 212 గ్రామ సచివాలయాలకు భవనాలను నిర్మించేందుకు రూ.84 కోట్ల 80 లక్షలు మంజూరు చేసింది. కానీ ఆయా భవన నిర్మాణాలకు అప్పటి ప్రభుత్వం సక్రమంగా నిధులను విడుదల చేయలేదు. దీంతో 2020, 2021 రెండేళ్లు భవనాల నిర్మాణాలు నత్తనడకన సాగాయి. ఆఖరికి 2022లో కొంత మేరకు నిధులు విడుదల కావడంతో అరకొరగా భవన నిర్మాణాల పనులు జరిగాయి. ఏజెన్సీలో మొత్తం 212 గ్రామ సచివాలయాల్లో ప్రస్తుతం 87 భవనాలు మాత్రమే పూర్తిగా అందుబాటులోకి రాగా, 20 పూర్తయ్యే స్థాయిలో, 65 తుది దశలో, 28 రెండు శ్లాబుల స్థాయిలో, 10 తొలి శ్లాబ్‌ వేయగా, 2 రూప్‌ లెవల్‌లో ఉన్నాయి. అయితే ఎక్కువ సంఖ్యలో భవనాలు అసంపూర్తిగా ఉండడంతో వసతికి ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల అందుబాటులో ఉన్న చిన్న భవనాల్లోనే వాటిని నిర్వహిస్తూ అవస్థలు పడుతున్నారు.

డిప్యూటీ సీఎం దృష్టి సారిస్తే..

గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాలపై డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండడంతో అసంపూర్తిగా ఉన్న అవి పూర్తవుతాయనే ఆశాభావం కలుగుతున్నది. ఇదే విధంగా జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఏజెన్సీ వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న గ్రామ సచివాలయ భవనాలను పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు వసతి కల్పించేందుకు భవనాలను మంజూరు చేశారు. ఇదే క్రమంలో గిరిజన ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ గ్రామ సచివాలయ భవనాలను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడితే, గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలకు సైతం మేలు జరుగుతుందని మన్యం వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 07 , 2026 | 12:11 AM