బీఎన్ రోడ్డుకు మోక్షం లేదా?
ABN , Publish Date - Mar 31 , 2026 | 01:41 AM
ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలకమైన భీమిలి- నర్సీపట్నంం (బీఎన్ రోడ్డు) అభివృద్ధి, విస్తరణ పనులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
మార్చిలోగా పనులు పూర్తిచేస్తామని కోర్టుకు తెలిపిన కాంట్రాక్టర్
నేటితో ముగియనున్న గడువు
పది శాతం పనులు కూడా పూర్తికాని వైనం
గోతులతో మరింత అధ్వానంగా తయారైన రహదారి
నరకప్రాయంగా మారిన ప్రయాణం
చోడవరం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలకమైన భీమిలి- నర్సీపట్నంం (బీఎన్ రోడ్డు) అభివృద్ధి, విస్తరణ పనులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మార్చిలోగా పనులు పూర్తి చేస్తామంటూ కాంట్రాక్టర్ సుమారు నెలన్నర క్రితం ఇటు కోర్టుకు, అటు ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. ఈ గడువు మంగళవారంతో ముగుస్తుంది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడంలేదు. అయితే రోడ్డు నిర్మాణ గడువును ఆరు నెలలకు పెంచుతూ కాంట్రాక్టర్, ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీనిపై వాహనదారులు, ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఒక్క ఏడాది కూడా నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో జిల్లా రవాణా వ్యవస్థలో కీలకమైన బీఎన్ రోడ్డు దారుణంగా తయారైంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత, రోడ్డు పనులు పూర్తవుతాయని భావించినా, ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. పైగా రహదారి పరిస్థితి మరింత దయనీయంగా మారడంతో వాహనదారులు నానా పాట్లు పడుతున్నారు. ఒక పక్క సీఎం హెచ్చరికలు, మరోవైపు స్థానిక బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు కేసులతో కాంట్రాక్టర్‌పై ఎంత ఒత్తిడి తెచ్చినా, రోడ్డు పనులు పూర్తికాకపోవడం విస్మయానికి గురిచేస్తున్నది.. బీఎన్ రోడ్డు పనులను మార్చి నెలాఖరులోగా పూర్తిచేస్తామంటూ కోర్టుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన కాంట్రాక్టర్.. గడువు ముగియడానికి ఒక్క రోజు మాత్రమే గడువు వుండగా.. కనీసం పది శాతం పనులు కూడా పూర్తి చేయలేదు.
ముక్కలు విడదీసినా...
బీఎన్ రోడ్డు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్... పనులను వేగంగా చేయలేక పోతుండడంతో ముక్కలుగా విడదీసి సబ్ కాంట్రాక్టర్లకు కేటాయించారు. అయినా సరే పనులు ముందుకు సాగడంలేదు. రోలుగుంట నుంచి బుచె ్చయ్యపేట మండలం వడ్డాది వరకు పనులు చేయడానికి సబ్ కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నప్పటికీ, అవసరమైన మెటల్ సరఫరా లేకపోవడంతో ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. రోలుగుంట మండలంలో పలు మెటల్ క్వారీలు వివిధ కారణాల వల్ల మూతపడడం, మిగిలిన క్వారీల నుంచి తగినంత మెటల్ లభ్యత లేకపోవడంతో ఈ ప్రభావం బీఎన్ రోడ్డుపై పడింది. ఇక వడ్దాది నుంచి చోడవరం మండలం గౌరీపట్నం వరకు మరో కాంట్రాక్టర్ పనులు చేపట్టారు. ఇక్కడ కూడా పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ఇక ప్రధానమైన చోడవరం- వెంకన్నపాలెం రోడ్డు పూర్తవ్వడం అసంభవంగానే కనిపిస్తున్నది. రెండు నెలలకోసారి ఎక్స్‌కవేటర్‌తో కొంచెం పనిచేసి, తరువాత కాంటాక్టర్ పత్తా లేకుండా పోవడం ఆనవాయితీగా మారిపోయింది. దీంతో చోడవరం, గోవాడ, అంభేరుపురం, వెంకన్నపాలెం జంక్షన్ల వద్ద ఛిద్రంగా తయారైన రోడ్డుపై ప్రయాణంతో ఒళ్లు హూనం అవుతున్నదని ప్రజలు వాపోతున్నారు. కొన్నిచోట్ల రోడ్డుపై ఏర్పడిన గోతులను క్రషర్‌బుగ్గితో కప్పారు. వాహనాల రాకపోకల సమయంలో పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి ఎగిసి, ప్రయాణికుల కళ్లల్లో పడుతున్నది. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
మొదలుకాని వెంకన్నపాలెం- సబ్బవరం రోడ్డు పనులు
వేరే ప్యాకేజీ కింద మంజూరైన వెంకన్నపాలెం- సబ్బవరం మండలం లింగాలతిరుగుడు రోడ్డు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. టెండర్ ఖరారైనప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ ఇప్పటికీ పనులు ప్రారంభించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. మొత్తం మీద రోలుగుంట మండలం వెలంకాయలపాలెం నుంచి సబ్బవరం మండలం లింగాలతిరుగుడు వరకు బీఎన్ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని ప్రజలు వాపోతున్నారు.
కొత్త వంతెనల నిర్మాణం లేనట్టేనా!
బీఎన్ రోడ్డులో విజయరామరాజుపేట, వడ్డాది గ్రామాల వద్ద గతంలో నిర్మించిన వంతెనలు శిథిలమై కూలిపోయిన విషయం తెలిసిందే. విజయరామరాజుపేట వద్ద వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనట్టు అధికారులు చెబుతున్నప్పటికీ ఇంతవరకు పనులు మొదలుకాలేదు. ఇక వడ్డాది వద్ద పెద్దేరుపై కొత్త వంతెన నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. మరో రెండు నెలలు ఆగితే వర్షాకాలం మొదలవుతుంది. విజయరామరాజుపేట వద్ద తాత్కాలికంగా నిర్మించిన కాజ్‌వే నదిలో వరద ఉధృతి పెరిగితే కొట్టుకుపోతున్నది. గత ఏడాది వర్షాకాలంలో రెండుసార్లు కొట్టుకుపోయిన విషయాన్ని స్థానికులు గుర్తుచేస్తున్నారు.