Share News

బొడ్డేరు వారధికి మోక్షం లేదా..

ABN , Publish Date - Jun 30 , 2026 | 01:44 AM

మండలంలో కట్టువాని అగ్రహారం గ్రామానికి అనుకొని బొడ్డేరు నదిపై ఉన్న వంతెన బలహీనంగా మారి రెండేళ్ల క్రితం కుంగిపోయింది.

బొడ్డేరు వారధికి మోక్షం లేదా..

కట్టువాని అగ్రహారం వద్ద రెండేళ్ల క్రితం కుంగిన వంతెన

వాహనాల రాకపోకలు బంద్‌

ఇబ్బంది పడుతున్న పలు మండలాల ప్రజలు

కొత్త వంతెన నిర్మించాలని వినతి

చీడికాడ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి):

మండలంలో కట్టువాని అగ్రహారం గ్రామానికి అనుకొని బొడ్డేరు నదిపై ఉన్న వంతెన బలహీనంగా మారి రెండేళ్ల క్రితం కుంగిపోయింది. దీంతో చీడికాడ, దేవరాపల్లి, బుచ్చెయ్యపేట, చోడవరం, మాడుగుల, రావికమతం మండలాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చీడికాడ, బుచ్చెయ్యపేట మండలాల్లో పలు గ్రామాలకు చెందిన రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు నానా అవస్థలు పడుతున్నారు. వాస్తవంగా పదిహేను సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ ఎటువంటి వంతెన లేదు. వర్షాకాలంలో బొడ్డేరు నది ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయేవి. రవాణా సదుపాయం కోసం వంతెన నిర్మించాలని అప్పట్లో ప్రజలుచేసిన విజ్ఞప్తిని పాలకులు పట్టించుకోలేదు. దీంతో 2009లో మాడుగుల ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, కట్టువాని అగ్రహారం వద్ద బొడ్డేరు నదిపై వంతెన నిర్మాణానికి విశాఖ డెయిరీ నుంచి ఆర్థిక సహకారం అందించాల అప్పటి విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావును కోరారు. ఆయన ఆదేశాల మేరకు డెయిరీ ఇంజనీరింగ్‌ అధికారులు ఇక్కడకు వచ్చి పరిశీలించి, వంతెన నిర్మాణానికి రూ.50 లక్షల వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. దీంతో విశాఖ డెయిరీ రూ.25 లక్షలు, చీడికాడ మండలంలోని అన్ని పాల సంఘాలు రూ.25 లక్షలు మంజూరు చేయగా 2010లో వంతెన నిర్మాణం చేపట్టారు. మరుసటి సంవత్సరం కేంద్ర మాజీ మంత్రి కింజారపు ఎర్రన్నాయుడుతో కలసి ఆడారి తులసీరావు, గవిరెడ్డి రామానాయుడు ప్రారంభించారు. ఆరు మండలాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కాగా 2024లో వంతెన కింద కోతకు గురై మధ్యలో కుంగిపోయింది. అప్పటి నుంచి వంతెన మీదుగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కుంగిన వంతెనను పూర్తిగా తొలగించి, కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని పలు మండలాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jun 30 , 2026 | 01:44 AM