Share News

శిక్షణ కేంద్రం స్థలం అన్యాక్రాంతం?

ABN , Publish Date - May 28 , 2026 | 01:24 AM

నగరంలోని జోడుగుళ్లపాలెంలో గల ప్రభుత్వ జిల్లా శిక్షణ కేంద్రం స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొందరు తీవ్రంగా యత్నిస్తున్నారు. చినగదిలి సర్వే నంబరు 147లో గల భూమి ప్రభుత్వానికి చెందినది. అక్కడ గతంలో తుఫాన్‌ షెల్డర్‌ భవనం ఉండేది. ఆ తరువాత అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే కేంద్రం నిర్వహిస్తున్నారు.

శిక్షణ కేంద్రం స్థలం అన్యాక్రాంతం?
జిల్లా శిక్షణ కేంద్రం ఆవరణలో చదును చేసిన స్థలం.

నెల రోజుల క్రితం

చదును చేస్తుండగా అడ్డుకున్న స్థానికులు

కోర్టు ఆర్డర్‌ ఉందన్న ప్రైవేటు వ్యక్తి

ఆ భూమి కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామన్న ఎమ్మెల్యే వెలగపూడి

మళ్లీ ఇప్పుడు రాత్రికి రాత్రి చదును

విలువ రూ.30 కోట్లపైనే...

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలోని జోడుగుళ్లపాలెంలో గల ప్రభుత్వ జిల్లా శిక్షణ కేంద్రం స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొందరు తీవ్రంగా యత్నిస్తున్నారు. చినగదిలి సర్వే నంబరు 147లో గల భూమి ప్రభుత్వానికి చెందినది. అక్కడ గతంలో తుఫాన్‌ షెల్డర్‌ భవనం ఉండేది. ఆ తరువాత అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే కేంద్రం నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నంలో కీలకమైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టారు. సీతమ్మధార తహశీల్దార్‌ కార్యాలయం, సర్క్యూట్‌ హౌస్‌, బక్కన్నపాలెంలో వికలాంగుల శిక్షణ సంస్థ, కంచరపాలెంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ తదితర 15 భూములను ముందు విక్రయించాలనుకున్నారు. ఆ తరువాత వీలుకాక తనఖా పెట్టి రుణం తీసుకోవాలని యత్నించారు. ఆ జాబితాలో జోడుగుళ్లపాలెంలోని ప్రభుత్వ శిక్షణ కేంద్రం స్థలం కూడా ఉంది. అందులో 75 సెంట్ల భూమిని రూ.19.29 కోట్లకు అమ్మకానికి పెట్టారు. ఇది ఐదేళ్ల క్రితం జరిగింది. ఆ తరువాత దానిపై కోర్టు కేసులు నడిచాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అందులో పాగా వేయాలని గత నెల...ఏప్రిల్‌ 21వ తేదీన చదును చేసే పనులు చేపట్టారు. స్థానికులు గుర్తించి అడ్డుకున్నారు. అది ప్రభుత్వ స్థలమని ఎందుకు చదును చేస్తున్నారని నిలదీశారు. ఈ వివాదం పెద్దది కావడం, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన అక్కడికి వెళ్లారు. అందరికీ సర్ది చెప్పారు. భాషా అనే వ్యక్తి తమకు కోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వులు ఉన్నాయని వాదించారు. ఈ భూమిపై అవసరమైతే సుప్రీంకోర్టుకు అయినా వెళతామని ఎమ్మెల్యే రామకృష్ణబాబు ప్రకటించారు. అయితే నెల రోజులు తిరిగే సరికి మళ్లీ ఆ భూమిని గుట్టు చప్పుడు కాకుండా చదును చేసేశారు. శిక్షణ కేంద్రం చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడ లోపలే పనులు చేశారు. ఇంకా ఆ యంత్రాలు అక్కడే ఉన్నాయి. గత నెలలో ప్రశ్నించిన స్థానికులు ఇప్పుడు ఎందుకు మిన్నకున్నారు?, స్థానిక ఎమ్మెల్యే వారించినా ఆ వ్యక్తులు భూమిలోకి ఎలా వచ్చారు?...అనేది అర్థం కావడం లేదు. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం 75 సెంట్ల భూమి విలువ రూ.30 కోట్లు.

పరిశీలిస్తాం

పాల్‌ కిరణ్‌, విశాఖ రూరల్‌ తహశీల్దార్‌

జిల్లా శిక్షణ కేంద్రం భూమి అంతా ప్రభుత్వానిదే. దానిపై కోర్టు కేసులు నడుస్తున్నాయి. దానిని చదును చేసిన విషయం తెలియదు. వెంటనే సిబ్బందిని పంపించి విషయం తెలుసుకుంటాం.

Updated Date - May 28 , 2026 | 01:24 AM