Share News

జీసీసీ మనుగడ ప్రశ్నార్థకం?

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:06 PM

ఆదివాసీల వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఏర్పాటైన గిరిజన సహకార సంస్థ(జీసీసీ) మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

జీసీసీ మనుగడ ప్రశ్నార్థకం?
శిథిలాస్థకు చేరిన లోతుగెడ్డ జంక్షన్‌ డీఆర్‌ డిపో

ఖాళీ పోస్టులు భర్తీ చేయక సిబ్బంది కొరత

శిథిలావస్థలో డీఆర్‌ డిపోలు, గోదాములు

కానరాని శాండీ ఇన్‌స్పెక్టర్లు

ఆదివాసీలకు దూరమవుతున్న సేవలు

చింతపల్లి, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఏర్పాటైన గిరిజన సహకార సంస్థ(జీసీసీ) మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఉద్యోగుల ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం, డీఆర్‌ డిపోలు, గోదాములకు మరమ్మతులు చేపట్టకపోవడం, కొత్త నిర్మాణాలు చేపట్టకపోవడంతో సంస్థ ఉనికిని కోల్పోయే పరిస్థితిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జీసీసీ బలోపేతానికి భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నప్పటికి ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల ఆదివాసీలకు సేవలు దూరమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి.

జీసీసీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తులను అందించలేకపోతోంది. గతంలో ప్రముఖ పట్టణాలు, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సూపర్‌బజార్లు, స్టాళ్లను ఎత్తివేశారు. కేవలం 30 శాతం మాత్రమే నిర్వహణలో ఉన్నాయి. చింతపల్లి మండల కేంద్రంలో నెలకు రూ.10 లక్షల లావాదేవీలు జరిగే సూపర్‌బజార్‌ను ఎనిమిదేళ్ల క్రితం ఎత్తివేశారు. కాగా ఎనిమిదేళ్లగా ఆదివాసీలు పండించిన కాఫీ గింజలకు జీసీసీ మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తున్నది. అయితే ఈ ఏడాది(2025-26)లో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పతనం కావడంతో కొనుగోళ్లు నిలిపివేసి మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. గిరిజన ప్రాంతంలో పెట్రోల్‌ బంకులను నిర్వహిస్తున్నప్పటికి ఆశించిన లాభాలు రావడం లేదు.

భర్తీకాని పోస్టులు

ఏళ్ల తరబడి జీసీసీలో ఉద్యోగ నియామకాలు జరగలేదు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల ఖాళీలు సైతం భర్తీ చేయడం లేదు. జీసీసీలోని కీలక పోస్టులో ప్రస్తుతం ఇతర ప్రభుత్వశాఖల నుంచి డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులే 70 శాతం మంది ఉన్నారు. జీసీసీ ఉద్యోగులు కేవలం 30 శాతం మంది మాత్రమే ఉన్నారు. గతంలో జీసీసీ ఉద్యోగులను శాండీ ఇన్‌స్పెక్టర్లుగా నియమించేవారు. శాండీ ఇన్‌స్పెక్టర్లు ప్రతి వారపు సంత రోజున డీఆర్‌ డిపోకి వెళ్లి గిరిజనులు తీసుకొచ్చిన అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం జీసీసీలో శాండీ ఇన్‌స్పెక్టర్లు ఒక్కరూ లేరు. జీసీసీ సేల్స్‌మన్లు, డీలర్లు అరకొరగా ఆదివాసీల నుంచి వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. మెజారిటీ అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను ఆదివాసీలు ప్రైవేటు వర్తకులకు విక్రయిస్తున్నారు.

శిథిలావస్థలో డీఆర్‌ డిపోలు, గోదాములు

జీసీసీ డీఆర్‌ డిపోలు, గోదాములు శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాలో 486 డీఆర్‌ డిపోలు ఉన్నాయి. కేవలం 45 శాతం డీఆర్‌ డిపోలకు మాత్రమే భవనాలు ఉన్నాయి. ఈ భవనాల్లో దాదాపు 98 శాతం శిథిలావస్థకు చేరుకున్నాయి. కొత్త భవనాల నిర్మాణాలు, పాత భవనాల మరమ్మతులు జరగడం లేదు. చింతపల్లి మండలంలో 59 డీఆర్‌ డిపోల్లో 23 డిపోలకు మాత్రమే భవనాలు ఉన్నాయి. ఈ భవనాలన్నీ శిథిలావస్థకు చేరుకోవడంతో నిత్యావసర సరుకులను ఎలుకలు పాడు చేస్తున్నాయి. అలాగే వర్షానికి భవనాలు కారిపోవడం వల్ల సరుకులు పాడైపోతున్నాయి. చింతపల్లి మండలంలో 58 డీఆర్‌ డిపోలకు కేవలం నలుగురు మాత్రమే జీసీసీ సేల్స్‌మన్లు ఉన్నారు. 11 మంది కాంట్రాక్టు, తాత్కాలిక సేల్స్‌మన్లు, 44 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు డీఆర్‌ డిపోలను నిర్వహిస్తున్నారు. ఇదే పరిస్థితి జిల్లాలోని ప్రతి మండలంలోనూ ఉంది. ఈ ఏడాది ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌(రేషన్‌ గోదాములు) నిర్వహణ బాధ్యలను జీసీసీ నుంచి రెవెన్యూశాఖకు అప్పగించారు. దీంతో జీసీసీ ఆదాయం మరింతగా పడిపోయింది. దీనిపై చింతపల్లి బ్రాంచి మేనేజర్‌ చల్లంగి సుగునాథం వివరణ కోరగా, పాడైన జీసీసీ డీఆర్‌ డిపోలు, గోదాముల మరమ్మతులకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. భవనాల పరిస్థితిని పరిశీలించి నూతన నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టాలని కోరామన్నారు. నిరుపయోగంగా వున్న లంబసింగి, అన్నవరం గోదాములను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Updated Date - Jun 23 , 2026 | 11:06 PM